చైనా ఆవిష్కరణ.. యుద్ధంలో పాల్గొననున్న మిలిటరీ రోబో
దిశ, ఫీచర్స్ : గ్లోబల్ రోబోటిక్స్, మిలిటరీ టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా మరోసారి ప్రపంచదేశాలన్నీ.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్ : గ్లోబల్ రోబోటిక్స్, మిలిటరీ టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా మరోసారి ప్రపంచదేశాలన్నీ తనవైపు తిరిగి చూసేలా చేసింది. సరికొత్త హెవీ డ్యూటీ మిలిటరీ రోబోను ఆవిష్కరించి టెక్నాలజీ రంగంలో సత్తా చాటింది. గ్లోబల్ టైమ్స్ ప్రకారం ఈ భారీ మెకానికల్ యాక్ 'ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగుకాళ్ల బయోనిక్ రోబో' అని తెలుస్తుండగా.. 350 పౌండ్లకు పైగా బరువుతో గంటకు 6 మైళ్ల వేగంతో పరుగెత్తడం దీని ప్రత్యేకత.
ఇది మారుమూల సరిహద్దు ప్రాంతాలు, అత్యంత ప్రమాదకరమైన యుద్ధక్షేత్రాలతో సహా సంక్లిష్ట వాతావరణాల్లోనూ లాజిస్టిక్స్ డెలివరీ, మిలిటరీ ఆపరేషన్లలో సేవలు అందించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక ఈ మిలిటరీ రోబోలో ఆయుధాలు అమర్చవచ్చని, ప్రధానంగా వీటిని గ్రౌండ్ బేస్డ్ డ్రోన్ వార్‌ఫెయిర్స్‌లో కచ్చితంగా ఉపయోగించవచ్చని చైనా నిపుణులు పేర్కొన్నారు. ఇక పీపుల్స్ డైలీ షేర్ చేసిన వీడియోలో.. ఈ మిలిటరీ రోబో ఖాళీ రోడ్లపై షికారు చేయడంతో పాటు ఎడారి ప్రాంతంలోని ఎగుడుదిగుడు మార్గాల్లో సునాయాసంగా ముందుకెళ్లడం కనిపించింది. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. 12 సెట్ల జాయింట్ మాడ్యూల్స్‌తో ముందుకు, వెనక్కి కదలడంతో పాటు రౌండ్‌గా తిరగగలదు. ఇక డయాగ్నల్(వికర్ణం)గానూ నడవగలిగే బయోనిక్ రోబో.. స్థిరమైన పద్ధతిలో దూకగలదు కూడా.
పీఠభూములు, పర్వతాలు, ఎడారి ప్రాంతాలతో పాటు సాధారణ వాహనాలు ప్రయాణించడం కష్టంగా ఉన్న అటవీ మార్గాల్లో ఈ రోబో సేవలు ఆవశ్యకం కానున్నాయి. అంతేకాదు ప్రమాదకర వాతావరణంలో ఆయుధాలు, ఆహారం వంటి సామగ్రిని పంపిణీ చేసేందుకు కూడా ఈ బయోనిక్ రోబోట్ ఉపయోగపడుతుంది. కాగా చైనా ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఇన్నోవేటివ్ రోబో యుద్ధరంగంలో సేవలకు వినియోగించినపుడు టెక్నాలజీ పరంగా ఆ దేశం ఏ మేరకు పురోగతి సాధించిందో ప్రపంచ దేశాలు తెలుసుకునే అవకాశం ఉంది. కాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ యుద్ధాల ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేయగలదని నిపుణులు భావిస్తున్నారు.
https://twitter.com/PDChina/status/1482037293128962050?s=20&t=T9rVxATRg1gfuMeItfcueQ