ఒకటి కాదు.. రెండు కాదు.. అక్కడ ఎన్నో అందాలు
చుట్టూ కొండా కోనలు.. జలపాతాల సవ్వడులు.. ఆకాశాన్ని తాకే వెండి మబ్బులు.. నేలతల్లిపై పరిచినట్టుగా ఉండే పచ్చని చెట్లు..
దిశ, వెబ్‌డెస్క్ : చుట్టూ కొండా కోనలు.. జలపాతాల సవ్వడులు.. ఆకాశాన్ని తాకే వెండి మబ్బులు.. నేలతల్లిపై పరిచినట్టుగా ఉండే పచ్చని చెట్లు.. దాగుడు మూతలు ఆడుతూ మబ్బుల చాటు నుంచి కనిపించి కనిపించని సూర్యుడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో అందాలను తనలో దాచుకుంది 'చిరపుంజి'. ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది మేఘాలయ రాష్ట్రంలోని ఈ చిరపుంజిలోనే.
మేఘాలయలోని చిరపుంజికి వెళ్లాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్ నుంచి ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పట్టణం అసలు పేరు సొరా. పూర్వం దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలం గడుస్తున్న కొద్ది చిరపుంజీగా మారింది. ఏడాది పొడవునా చిరపుంజిలో వర్షాలు పడుతునప్పటికీ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది. ఈ ప్రాంతంలో నిత్యం వర్షాలు పడ్డా కూడా ఇక్కడి ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఇక్కడి అందాలను చూడడానికి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా చిరపుంజిలో ఉండే "మాక్టో వ్యాలీ"ని మాత్రం సందర్శకులు మర్చిపోకుండా చూస్తారు. ఈ వ్యాలీకి వెళ్లాలంటే కొన్ని అడ్వెంచర్లు చేయక తప్పదు. రెండు వైపులా కొండలు, మధ్యలో నల్లతాచు లాంటి రోడ్డు అక్కడక్కడ కనిపించే జలపాతాలు, పక్షుల కిలకిల రావాలు ఆహా.. ఆ అనుభూతి ఇలా చూస్తేనో, వింటేనో కాదండి స్వయంగా అనుభవిస్తే వచ్చే మజానే వేరుగా ఉంటుంది.
చిరపుంజి, మాక్టో వ్యాలీ తరువాత చూడదగ్గ ఇంకో ప్రదేశం నాంగ్‌స్లావియా. ఈ ప్రాంతంలో సూర్యోదయం పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతులను కలిగిస్తుంది. ఎత్తైన కొండల్లోంచి పాలధారల్లా దూకే జలపాతాలు, అప్పుడే ఉదయించే సూర్యుడి లేలేత కాంతి కిరణాలు మనసుకు హాయిని కలిగిస్తాయి.