ప్రైమేట్ డీఎన్ఏతో జెనెటిక్ వ్యాధులకు చెక్.. తాజా పరిశోధన
మానవుల్లో మోడర్న్ జెనెటిక్ వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి? వీటిని పూర్తిగా నివారించే మార్గం లేదా? అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : మానవుల్లో మోడర్న్ జెనెటిక్ వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి? వీటిని పూర్తిగా నివారించే మార్గం లేదా? అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అయితే వీటికి పరిష్కారం అతి త్వరలో సాధ్యమయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. తాజాగా పూర్వీకుల (కోతులు) శిలాజ అవశేషాలను స్టడీ చేయడం ద్వారా 233 ప్రైమేట్ జాతుల నుంచి సేకరించిన డీఎన్‌ఏతో 800 మందికి పైగా వ్యక్తుల డీఎన్‌ఏను పరిశోధకులు మ్యాప్ చేశారు.
అయితే వీటిలో దాదాపు సగం నేటికీ ఉనికిలో ఉన్నాయని కనుగొన్నారు. ప్రపంచ జీవ వైవిధ్యంపై పరిశోధనలో ఇదొక కొత్త మలుపు అని పేర్కొంటున్నారు. “మానవులు నిజానికి జంతు సమూహానికి చెందిన వారు. నాన్ హ్యూమన్ ప్రైమేట్ జినోమ్స్ అధ్యయనం ద్వారా, వాటి ఫైలోజెనెటిక్ స్థానాన్ని బట్టి జెనెటిక్ వ్యాధులను అర్థం చేసుకోవడానికి తాజా అధ్యయనం దోహదం చేస్తుంది’’ అంటున్నారు పోంపీ ఫాబ్రా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు, ప్రొఫెసర్ టోమస్ మార్క్వెస్-బోనెట్.
ప్రస్తుతం డయాబెటిస్, గుండె జబ్బులు వంటి అనేక ప్రబలమైన వ్యాధులకు జెనెటిక్ ఇష్యూస్ కారణం అవుతున్నాయి. కొన్ని వ్యాధులు జన్యు వైవిధ్యాలు లేదా ఉత్పరివర్తనాల కలయిక నుంచి ఉద్భవించవచ్చని.. ఇవే మధుమేహం, క్యాన్సర్ వంటి వంశపారంపర్య వ్యాధులకు కారణం అవుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఇవి పూర్వీకుల నుంచి సంభవించాయని భావిస్తున్నారు. ఎందుకంటే ‘‘పరిశోధకులు గుర్తించిన 4.3 మిలియన్ మిస్సెన్స్ మ్యుటేషన్స్‌లలో 6% ప్రైమేట్స్‌లో సమృద్ధిగా ఉన్నాయి. అంటే జంతువుల నుంచి మానవ పరిణామక్రమం జరిగినప్పటికీ గత లక్షణాలు కొన్ని జెనెటిక్ వ్యాధులకు కారణం అవుతున్నాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ ఇల్యూమినాలో వైస్ ప్రెసిడెంట్, ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కైలే ఫర్(Dr. Kyle Farh) తెలిపారు.
హైబ్రిడైజేషన్‌తో జన్యు సంక్రమణ
డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌లో గ్లోబల్ లీడర్ అయినటువంటి Illumina, San Diego ద్వారా అభివృద్ధి చేయబడిన PrimateAI-3D అనే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించడం ద్వారా మానవ జన్యుకారక వ్యాధులపై నిర్వహించిన అధ్యయనం.. ఆసియా, అమెరికా, ఆఫ్రికా మడగాస్కర్ నుంచి జాతుల సమాచారాన్ని సేకరించింది. బాబూన్‌ల(కోతి లాంటి జంతువులు)పరిణామంపై కొత్త కోణాలను అందించింది. విభిన్నమైన, సమృద్ధిగా ఉన్న కోతుల సమూహ జాతుల మధ్య హైబ్రిడైజేషన్, జన్యు సంక్రమణకు సంబంధించిన అంశాలను నిపుణులు గుర్తించారు. ఉదాహరణకు పాశ్చాత్య టాంజానియన్ ఎల్లో బాబూన్‌లు మూడు వేర్వేరు వంశాల నుంచి జన్యుపరమైన ఇన్‌పుట్‌ను పొందిన మానవేతర ప్రైమేట్‌లుగా గుర్తించబడిన వాటిలో మొదటివి.
ఈ ఫలితాలు పాపులేషన్ జెనెటిక్ స్ట్రక్చర్, బబూన్ వంశాల మధ్య ప్రవేశ చరిత్ర గతంలో అనుకున్నదానికంటే చాలా క్లిష్టంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. మానవులు, నియాండర్తల్స్, డెనిసోవాన్స్ పరిణామానికి బాబూన్‌లు గుడ్ మోడల్ అని హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుడు, ప్రొఫెసర్ జెఫ్రీ రోజర్స్ అంటున్నారు. మొత్తంగా పరిశీలిస్తే 50వేల సంవత్సరాల క్రితం భూమిపై సహజీవనం చేసిన ప్రైమేట్స్‌లో జెనెటిక్ వ్యాధుల పరంపర కొనసాగింది. అలాగే మనుషుల్లో కూడా అదే కారణం అని చెప్పవచ్చు. అయితే ఈ జెనెటిక్ వ్యాధులను పూర్తిగా నివారించే అంశాలపై పరిశోధనలు ఇంకా అవసరం. కొన్ని రకాల ప్రైమేట్స్ నుంచి సేకరించిన జీనోమ్ సీక్వెన్స్‌ని ఉపయోగించి జెనెటిక్ వ్యాధులను ఎలా నిర్మూలించవచ్చనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వంశపారంపర్య వ్యాధులను కూడా శాశ్వతంగా ఎదుర్కొనే మెడికేషన్స్ అందుబాటులోకి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.