Cardiac Arrest : తొమ్మిదేండ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్..! చిన్నారుల్లోనూ ఎందుకని వస్తుంది?
ఒకప్పుడు గుండెపోటు 60 ఏండ్ల వయస్సు దాటిన వారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉండేది. ఏజ్ రిలేటెడ్ సమస్యలు అందుకు కారణం అయ్యేవి. ఆ తర్వాత యువతలోనూ ప్రారంభమైంది.
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు గుండెపోటు 60 ఏండ్ల వయస్సు దాటిన వారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉండేది. ఏజ్ రిలేటెడ్ సమస్యలు అందుకు కారణం అయ్యేవి. ఆ తర్వాత యువతలోనూ ప్రారంభమైంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటివి ఇందుకు కారణంగా నిపుణుల పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారి తర్వాత అయితే ఇది మరింత పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా పెద్దల్లో, యువతలో రావడం కామన్ అయిపోయింది. ఇప్పుడు చిన్నారుల్లోనూ వ్యాపిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు కూడా కార్డియాక్ అరెస్టు బారిన పడిన వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న తొమ్మిదేండ్ల బాలిక స్పోర్ట్స్ పీరియడ్‌లో తన తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ ఉంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే చనిపోయిందని, కార్డియాక్ అరెస్టుకు గురికావడంవల్ల ఇలా జరిగిందని తెలిపారు. దీంతో చిన్నారుల్లోనూ ఎందుకీ సమస్య వస్తోందని పలువురు సోషల్ మీడియా వేదికల్లోనూ చర్చిస్తున్నారు. అసలు కార్డియాక్ అరెస్టు అంటే ఏమిటి?, అది ఎందుకు వస్తుంది? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.
కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?
మనిషిలో గుండె బాగా పనిచేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అలా జరగడంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడైతే గుండె కండరాలు సంకోచించుకుని ఒక్కసారిగా రక్త ప్రసరణ ఆగిపోతుందో అప్పుడు ఏర్పడే పరిస్థితినే వైద్య నిపుణులు కార్డియాక్ అరెస్ట్‌గా పేర్కొంటున్నారు. ఈ సందర్భంలో గుండెలోని నేచురల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లె లోపావల్ల శరీర భాగాలకు బ్లడ్ సర్క్యూట్‌లో ఆటంగకాలు ఏర్పడతాయి. దీంతో మెదడుకు కూడా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్తారు. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. వెంటనే చికిత్స అందకపోతే ఊపిరి ఆడక చనిపోతారని వైద్య నిపుణులు చెప్తున్నారు.
చిన్నారుల్లో ఎందుకు వస్తుంది?
ఈ మధ్య చిన్నారుల్లో కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు, అలాగే చదువుల్లో ఒత్తిడి అధికం కావడం వంటి కారణాలతో విద్యార్థులు లేదా పిల్లల్లోనూ ఈ సమస్య పెరుగుతున్నట్లు కొందరు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వారు నిద్రపోతున్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు ఇలా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే కొన్ని రకాల మెడిసిన్ ఎక్కువగా వాడటం, మందులు పడకపోవడం, మెడిసిన్ వికటించడం, పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉండటం, మయోకార్డిటిస్ వంటివి చిన్నారుల్లో కార్డియాక్ అరెస్టులకు ఎక్కువగా కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.
లక్షణాలు ఇవే..
కార్డియాక్ అరెస్ట్ చిన్నారుల్లో కూడా వస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలను గుర్తిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్తున్నారు. అయితే ఇది వచ్చే కొద్దిరోజుల ముందు నుంచే చిన్నారుల్లో శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, వారు తరచుగా ఇబ్బందిగా ఫీలవడం, సరిగ్గా తినకపోవడం, తమకు ఏదో జరుగుతోందని చెప్పడం చేస్తుంటారు. ముఖ్యంగా ఛాతీలో నొప్పిగా ఉందని చెప్తారు. ఈ లక్షణాలు కనిపించేవారు కొన్నిసార్లు మూర్ఛపోతుంటారు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతారు. కాబట్టి చిన్నారుల్లో ఐదారు రోజుల నుంచే సింప్టమ్స్‌ను కనిపిస్తాయి కాబట్టి వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ఆ క్షణం ఏం చేయాలి?
కార్డియాక్ అరెస్ట్ అనేది అనుకోకుండా వచ్చే పరిస్థితి. చిన్నారుల్లో అది రాగానే వెంటనే ఏం చేయాలో తెలీక పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. అయితే అపస్మారక స్థితికి వెళ్లినట్లు గుర్తిస్తే వెంటనే సీపీఆర్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది. ఇక వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ఎమర్జెన్సీ వైద్య చికిత్స అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనుమానాలు ఉంటే కార్డియాలజిస్టులను సంప్రదించడం ఉత్తమం.
Read More..
Health benefits: క్రమం తప్పకుండా ఈ రసం తాగితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు