గాయాలు మాన్పిస్తున్న చేపల స్కిన్ బ్యాండేజ్.. ఔషధ గుణాలు అద్భుతం.. ఇతర చికిత్సల్లోనూ ఉపయోగంపై పరిశోధనలు
చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు, చిన్న చిన్న కాలిన గాయాల సందర్భంలో సాధారణంగా బర్నాల్ వంటి యాంటీ బయోటిక్స్ క్రీములు రాస్తుంటాం. కొందరు పరిస్థితిని బట్టి బ్యాండేజ్ వేయించుకుంటారు.
దిశ, ఫీచర్స్ : చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు, చిన్న చిన్న కాలిన గాయాల సందర్భంలో సాధారణంగా బర్నాల్ వంటి యాంటీ బయోటిక్స్ క్రీములు రాస్తుంటాం. కొందరు పరిస్థితిని బట్టి బ్యాండేజ్ వేయించుకుంటారు. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన ప్రాథమిక చికిత్సా విధానమిది. కానీ బ్రెజిల్ వైద్య పరిశోధకులు మాత్రం కొత్త పద్ధతిని కనుగొన్నారు. గాయాలు మానడానికి, చీము పట్టకుండా ఉండటానికి, పుండ్లు తగ్గడానికి నీటిలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్‌లుగా వాడితే మంచి ప్రయోజనం ఉంటుందని కనుగొన్నారు.
చేపలు అద్భుతమైన పోషకాహారంగా ఉపయోగపడతాయనే విషయం తెలిసిందే. కానీ వాటి చర్మంలో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వైద్య చికిత్సల్లో ముఖ్యపాత్రపోషించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2017 నుంచి బ్రెజిల్ ప్రజలు తిలపియా అనే చేప చర్మాన్ని వివిధ గాయాలు అయినప్పుడు నాటు పద్ధతిలో బ్యాండేజ్‌గా చుట్టడం ఇప్పటికే అనుసరిస్తున్నారు. కాగా అది నిజంగానే పనిచేస్తుందో లేదో తెలుసుకునే క్రమంలో రీసెర్చర్స్ ఇటీవల ప్రయోగశాలలో పరిశీలించారు. చేప చర్మాన్ని బ్యాండేజీగా ఉపయోగించడంవల్ల కాలిన గాయాలు యారేజ్‌గా 9 నుంచి 11 రోజుల్లో నయం అవుతున్నట్లు గుర్తించారు. అదే సందర్భంలో జంతువులపై చేసిన ప్రయోగాలు కూడా సత్ఫలితాలను ఇచ్చాయి.
చేపల స్కిన్ కేవలం గాయాలను మాన్పించడంతోపాటు డయాబెటిక్ ఫుట్ అల్సర్‌ను కూడా నయం చేస్తుందని గుర్తించారు. చేపల చర్మంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. నొప్పి త్వరగా తగ్గడంలో, రోగ కారక బ్యాక్టీరియాలతో పోరాడటంలో, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో తిలపియా సహా పలు రకాల చేపల చర్మం అద్భుతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. చేపల చర్మంలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను కొన్ని ప్లాస్టిక్ రికన్‌స్ట్రక్టివ్ సర్జరీలలో కూడా వాడవచ్చని, డయాబెటిస్ కారణంగా ఏర్పడే పుండ్లకు చికిత్సగా ఉపయోగించవచ్చని పరిశోధకులు అంటున్నారు.