Detox Drink : అందానికి.. ఆరోగ్యానికి ఈ జ్యూస్ తాగండి !
అందానికీ, ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారాల్లో బీట్‌రూట్, క్యారెట్, టమోటాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు.
దిశ, ఫీచర్స్: అందానికీ, ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారాల్లో బీట్‌రూట్, క్యారెట్, టమోటాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. వీటిని మిక్స్ చేసి తయారు చేసే జ్యూస్ తాగడం వల్ల ముఖవర్ఛస్సు, చర్మ సౌందర్యం పెరుగుతుందని డైటీషియన్లు చెప్తుంటారు. రక్తహీనత కారణంగా కూడా మనిషి అందం దెబ్బతినడమో, చర్మం పొడిబారి గరుకుగా మారడమో జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన డైట్‌గా బీట్‌రూట్, క్యారెట్, టమోటాలతో చేసిన జ్యూస్ బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
పరిగడుపున తీసుకుంటే మేలు
బీట్‌రూట్, క్యారెట్, టమోటా ముక్కలు కలిపి కొద్దిపాటి నీరు పోసి తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజూ పరిగడుపున ఒక గ్లాసు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. రెండు వారాల పాటు ఇలా చేస్తే అది చేసే మేలేంటో ఎవరికి వారు తామే గ్రహించగలుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గి చురుకుదనం పెరుగుతుంది. చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
రక్తహీనత వల్ల తలెత్తే ఇతర సమస్యలు, మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, హైబీపీ, గుండె జబ్బులు దరిచేరవు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బీట్‌రూట్, క్యారెట్, టమోటా కలిపి చేసిన జ్యూస్ తాగడం వల్ల కరిగిపోతుంది. ఫలితంగా బరువు పెరిగే సమస్య దూరం అవుతుంది. అవసరమైన ఫోలిక్ యాసిడ్ కలిగి ఉండటంవల్ల గర్భిణుల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి తరచూ ఈ జ్యూస్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.