కంటినిండా నిద్రతోనే అందం, ఆరోగ్యం !

అందానికీ.. ఆరోగ్యానికి పౌష్టకాహారమే కాదు, కంటి నిండా నిద్ర కూడా చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

Update: 2023-02-02 06:52 GMT

దిశ, ఫీచర్స్: అందానికీ.. ఆరోగ్యానికి పౌష్టకాహారమే కాదు, కంటి నిండా నిద్ర కూడా చాలా అవసరం అంటున్నారు నిపుణులు. జీవన శైలిలో మార్పులు, ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి వంటి కారణాలతో ఈ రోజుల్లో కొందరు నిద్రకు దూరం అవుతున్నారు. ఇది రకరకాల అనారోగ్యాలకు దారి తీస్తోంది. సరిపోను పో గలిగినప్పుడే మెదడు చురుకుగా పని చేస్తుందని, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డే టైమ్‌లో తమ కార్యకలాపాల్లో నిమగ్నమై అలసిపోయిన వారు సరిగ్గా నిద్రపోకపోతే, అది వారి పనితీరుపై వ్యతిరేక ప్రభావం చూపుతుందట. అదే కంటి నిండా నిద్రపోయే వారిలో ఈ సమస్య లేకపోగా సుఖవంతమైన నిద్ర అనేది ముఖ వర్ఛస్సును, శారీరక అందాన్ని ఇనుమడింపజేస్తుంది.


40 శాతం మందిలో నిద్రలేమి

తప్పని పరిస్థితులు, అవసరాలు యాంత్రికమైన జీవితానికి కారణం అవుతున్నాయి. ఉద్యోగానికో, పనికో హడావిడిగా పొద్దున్నే బయలు దేరాల్సి రావడం వల్ల ఏ తెల్లవారుజామునో లేవాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో నెలకొంటున్నాయి. తిరిగి పొద్దుపోయాక ఇంటికి వెనుదిరుగుతుంటారు కొందరు. మరి కొందరు నైట్ షిఫ్టుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధమైన జీవనశైలి మానవ అవసరంగా మారుతున్నప్పుడు ఏమీ చేయలేం కానీ.. ఉన్న సమయంలోనే కంటి నిండా నిద్ర పోవడం అనేది మానవ ప్రయత్నంలో భాగంగానే ఉంటుంది.


కాబట్టి నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన ఈ రోజుల్లో చాలామంది నిద్ర మేల్కొని మరీ అందులో దూరి పోతుంటారు. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ను మళ్లీ మళ్లీ చూడటంవల్ల నిద్రపారిపోతుంది. దీనివల్ల అనారోగ్యాలు వెంటాడుతాయి. దేశంలో దాదాపు 40 శాతం మంది కంటినిండా నిద్రపోని కారణంగా వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.


ఆహారపు అలవాట్ల ప్రభావం

ఆహారపు అలవాట్లు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కాఫీలు, టీలు, వేడి వేడి వేపుడు పదార్థాలు రాత్రిళ్లు తీసుకునే వారికి నిద్ర సరిగ్గా రాదు. ఇలా నిద్రకు దూరమయ్యే వారిని నిపుణులు వేకర్స్‌‌గా పేర్కొంటున్నారు. ఇక రొట్టెలు, చపాతీలు, పెరుగు, పన్నీర్, వెన్న, చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు వంటివి తీసుకునే వారు త్వరగా నిద్రకు ఉపక్రమించగలుగుతారు. కాబట్టి వీరిని నిపుణులు స్లీపర్స్‌గా పేర్కొంటున్నారు. అంటే.. ఆహారపు అలవాట్లు కూడా నిద్రలేమి సమస్యకు దారితీస్తాయని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.


ఒక మనిషి రోజులో 7 లేదా 8 గంటలు, కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. అప్పుడే చురుగ్గా ఉండగలుగుతారు. కొందరు 4 నుంచి 5 గంటలే నిద్రపోతుంటారు. దీనివల్ల ఒత్తిడిగా ఫీలవడం లేదా, ఏకాగ్రత దెబ్బతినడం వంటివి సంభవిస్తాయి. అవి వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్‌కు దారి తీస్తాయి. కాబట్టి హెల్తీ లైఫ్ కోసం నిద్రపోయే సమయాన్ని ఎవరికి వారు సెట్ చేసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు.



Read More: భూమి మీదనే కష్టంగా ఉంటది... అలాంటిది నీళ్లలో నిర్మాణాలు ఎలా చేస్తారు..?

Tags:    

Similar News