చిన్న చేప కోసం మొసలితో ఫైట్ చేసిన వ్యక్తి.. వైరల్ వీడియో!
చూడటానికి సరదాగా ఉన్నా.. ఎంతో ప్రమాదకరంగానూ ఉంటాయి. Australian Man Fights With Crocodile To Catch Fish.
దిశ, వెబ్‌డెస్క్ః జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే పెద్ద పోరాటాలు చేయాల్సి ఉంటుంది. బహుశా అది ఆ చిన్న ప్రతిఫలాన్ని పొందటం కోసం కాదు గానీ, మనలో పోరాటం చేసే సత్తా ఉందని తెలియడం కోసం! కొన్ని విశేషాలు సీరియస్ అయినా సరదాగా ఉంటాయి. చూడటానికి సరదాగా ఉన్నా.. ఎంతో ప్రమాదకరంగానూ ఉంటాయి. అలాంటి వీడియోల్లో ఇదీ ఒకటి. ఇందులో ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ 'nuffblokescoty' లో ఈ వీడియోను పోస్ట్ చేసాడు. అక్కడ అతను తాను పట్టిన ఒక చేప కోసం మొసలితో పోరాడతాడు.
స్కాట్ రోస్కారెల్ అనే ఈ వ్యక్తి మరికొంత మంది వ్యక్తులతో కలిసి ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలోని కాహిల్స్ క్రాసింగ్‌లో చేపలు పడుతుంటాడు. అక్కడి నదిలో మొసళ్ల మోత మామూలే. స్థానికులకూ వాటి గురించి తెలుసు. ఇక, ఆ నదిలో స్కాట్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పెద్ద మీటర్ బార్రా చేపను ఓ మొసలి కూడా వెంబడిస్తూ, ఒడ్డుకు వచ్చేస్తుంది. చివరి వరకూ చేపను నోట కరుచుకోడానికి ప్రయత్నిస్తుంది. అయితే, స్కాట్ పక్కనున్న కొంతమంది చేపను మొసలికి ఇవ్వమని, దాని నుండి దూరంగా ఉండమని అరవడం వీడియోలో వినబడుతుంది. కానీ, స్కాట్ మొసలిని అదిలిస్తూ మొత్తానికి చేపను సాధిస్తాడు. ఇదే వీడియోను, "మొసలితో పోరాడకుండా మీటర్ బార్రాను పట్టుకోవడం చాలా కష్టం", అంటూ ఇన్‌స్టాలో షేర్ చేశాడు స్కాట్. ఈ క్లిప్ కాస్తా వైరల్‌గా మారింది. నిజమే, 'మొసలిని ఎదురించి చేపను సాధించావు..' అంటూ అంతా స్కాట్‌ను పొగిడేస్తున్నారు.