మీరు 20 ఏళ్ల సింగిల్ ఉమెనా? అయితే ఇది విని విసుగెత్తిపోవాల్సిందే!
పెళ్లి కావాల్సిన పిల్లవి అలా ఉండకూడదు.
దిశ, ఫీచర్స్ : ‘పెళ్లి కావాల్సిన పిల్లవి అలా ఉండకూడదు. ఈ డ్రెస్సులు వేసుకోవద్దు. అణకువగా ఉండాలి. ఇంకా పెళ్లెప్పుడు చేసుకుంటావు. ఇదే సరైన వయస్సు. ఈ ఏజ్‌లో అయితేనే పిల్లలు పుడతారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పటికీ పెళ్లికాదు. పెళ్లయ్యాక చదువుకోవచ్చు లే. ఎంత చదివినా ఒకింటికి వెళ్లక తప్పదు’’ ఈ డైలాగ్స్ మీరెప్పుడైనా విన్నారా? 20 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రతి ఆడపిల్లా ఏదో ఒక సందర్భంలో వినీ విసుగెత్తిపోయే మాటలివి. జెండర్ ఇనిక్వాలిటీ మన సంస్కృతిలో భాగమైపోవడంవల్ల నిర్ణయాలు తీసుకోవడంలో, అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తరచూ మహిళలే బాధితులవుతున్నారని కొందరు మానసిక నిపుణులు, ఫెమినిస్టులు చెప్తున్నారు.
మహిళల జీవితంలో 20 ఏళ్ల వయస్సు సంతోషకరమైదిగాను, భయంకరమైనదిగాను ఉంటోంది. చదువుకొని స్థిరపడాలన్న ఆలోచన అమ్మాయిలకు ఉన్నా, మరోవైపు అందుకు వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. పెళ్లీడు వచ్చిందని, లగ్గం చేసుకోవాలని పేరెంట్స్‌తోపాటు బంధువులు, చుట్టు పక్కలవాళ్లు పదే పదే ప్రస్తావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బయటివాళ్ల ఒత్తిడివల్ల కూడా కుటుంబ సభ్యులు చదువు, ఉద్యోగం, కెరీర్ వంటి అంశాలకంటే ఆడపిల్ల పెళ్లికే ప్రాధాన్యం ఇస్తుంటారు. అత్తారింటికి పంపిస్తే ఓ బాధ్యత తీరిపోతుందని, రిలాక్స్ అవ్వొచ్చని భావిస్తుంటారు. ఇక ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే త్వరగా పెళ్లి చేసుకోవాలని పెద్ద కూతురుపై ఒత్తిడి తేవడం ఇప్పటికీ అనేక కుటుంబాల్లో చూస్తుంటాం. ఒక వేళ ఆమెకు ఇష్టం లేకపోతే ‘పెళ్లి కావాల్సిన ఇంకో ఆడ పిల్ల ఇంట్లో ఉంది. నువ్వు చేసుకోనంటే ఎలా?’ అంటూ ప్రశ్నించడం, ఒప్పించడం చేస్తుంటారు. దీంతో ఇప్పటికీ చాలామంది మహిళలు తమ 20 ఏళ్ల వయస్సులో చదువు, భవిష్యత్తు, పెళ్లి అనే విషయాల గురించి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. అదే ఒక మగపిల్లవాడి విషయంలో ఇలాంటి పట్టింపులు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉండవు. అందుకు కారణం మన సమాజంలో పాతుకుపోయిన లింగ అసమానత, పురుషాధిక్యత భావజాలమేనని కొందరు కౌన్సెలింగ్ సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, ఆడ పిల్లలు కూడా తమ కాళ్లపై తాము నిలబడే నిర్ణయాలు తీసుకోగలిగే పరిస్థితి రావాలని చెప్తున్నారు.
Read More: స్కిన్ ప్రాబ్లమ్స్‌తో గుండె జబ్బులు.. హెచ్చరిక సంకేతాలివే
అక్కడ వివాహానికి ముందు వరుడు, వధువుకు లోదుస్తులు కొనివ్వాల్సిందే.. లేదంటే పెళ్లిలోనే అలా