సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉన్నారా? అయితే, జాగ్రత్త..!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు.
దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఉపయోగాలతో పాటుగా నష్టాలు కూడా ఉన్నాయి. చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులో వారి జీవితంలో జరిగిన ప్రతీ మూమెంట్‌ను షేర్ చేసుకుంటారు. ఆనందాన్ని, బాధను పంచుకుంటుంటారు. ఇప్పుడు పదేళ్ల వయసు నుంచి పండు ముసలి వారు వరకు సోషల్ మీగడియాను యూజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే, సోషల్ మీడియా యూజర్ల విషయంలో మానసిక నిపుణులు కీలక విషయాలు తెలియజేస్తున్నారు. దీని వల్ల మనిషి మానసికంగా, శారీరకంగా ఎఫెక్ట్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు.
ఈ క్రమంలోనే.. జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, రూర్ వర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో..సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మంచిదని, లేకపోతే మానసిక సమస్యలు పెరుగుతాయని తెలిపింది. రోజులో కనీసం గంట పాటు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకుంటే మంచిదని, దీని వల్ల చేసే పనిపై ఏకాగ్రత పెరగడంతో పాటుగా పనిలో సంతృప్తి కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియా, ఎక్కువగా ఉపయోగించే వారి జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, ఇది క్రమంగా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
సోషల్ మీడియాకు బానిసలుగా మారితే ఉద్యోగం, విద్యా సామర్థంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సూచించింది. దీంతో ఆందోళన, డిప్రెషన్, వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్య సమస్యలు వస్తాయి.
కంపేరిజన్: సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వ్యక్తుల మధ్య కంపేరిజన్ ఎక్కువగా పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
జీవితం: సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులను చూసినప్పుడు వారు మంచి జీవితాన్ని గడుపుతున్నారనే ఆలోచన కలుగుతుంది. ఇది నెగిటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తుంది.
సైబర్ భయాలు: అధికంగా దీనిని వాడుతున్న వారు సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరపు లింకులు క్లిక్ చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
శారీరక సమస్య: రోజులో ఎక్కువ సమయం సోషలో మీడియాలో గడపడం వల్ల అనేక శారీరక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది కళ్లు, మెదడు పనిచేసే తీరుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.