బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం రెండూ ఒకటేనా?.. నిపుణులు చెప్తున్నది ఇదే..
కారణాలేమైనా ఈ మధ్య అధిక బరవు సమస్య చాలామందిని వేధిస్తోంది. అలాగే బాడీలో హైకొలెస్ట్రాల్ వల్ల పక్షవాతం, గుండె జబ్బులు వంటివి కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : కారణాలేమైనా ఈ మధ్య అధిక బరవు సమస్య చాలామందిని వేధిస్తోంది. అలాగే బాడీలో హైకొలెస్ట్రాల్ వల్ల పక్షవాతం, గుండె జబ్బులు వంటివి కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. అందుకే చాలామంది వాటిని అదుపులో ఉంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక్కడే మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. కొందరు బరువు తగ్గడం, శరీరంలో కొవ్వును తగ్గించుకోవడం ఒకటే అనుకుంటారు. కానీ ఇది పొరపాటు.
* సమయానికి తినకపోవడం లేదా అతిగా తినే అలవాటు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, నిశ్చల జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం వంటివి బరువు పెరిగేందుకు దారితీస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. కాగా ఇక్కడే చాలామంది బరువు తగ్గాలా?.. అది తగ్గాలంటే శరీరంలో కొవ్వు తగ్గాలా? అనే సందేహాలతో గందరగోళంలో పడతారు. కానీ బరువు తగ్గడం వేరు, కొవ్వును తగ్గించడం వేరు. బరువు తగ్గించేకునే ప్రాసెస్‌లో కండరాలు, కొవ్వులు, నీరు, కేలరీలు, ఆహారం, వ్యాయామం వంటివి ఉంటాయి. అంటే ఆహార నియమాలు పాటిస్తూ తగిన ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉంటే బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు నిపుణుల సలహా మేరకు క్రాష్ డైట్, గ్లూటెన్ ఫ్రీ డైట్ వంటివి పాటించవచ్చు.
* శరీరంలో స్థాయికి మించిన కొవ్వు శాతం కూడా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అధిక బరువు ఉండేవారిలో ఇది మిగతా వారికంటే ఎక్కవ ఉండే చాన్స్ ఉంటుంది. అలాగని సన్నగా ఉండేవారి శరీరంలో కొలెస్ట్రాల్ ఉండదని మాత్రం అనుకోవద్దు. కొన్నిసార్లు సన్నగా ఉండేవారి శరీరంలోనే కొవ్వు శాతం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి అధిక బరువును, కొవ్వు శాతాన్ని వేర్వేరుగా చూడాలి.
* కొవ్వు మొత్తం శరీరానికి నష్టం కలిగిస్తుంది. గుండె జబ్బులకు, నరాల బలహీనతకు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇక కొవ్వు తగ్గించుకోవడం అంటే బరువు తగ్గించుకోవడం కాదు, కొవ్వు కణజాలాల శాతాన్ని తగ్గించడంగా నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి వేర్వేరు ఆహార నియమాలు, వ్యాయామాలను నిపుణులు సూచిస్తారు. అధిక బరువు, అధిక కొవ్వు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. అయితే అధిక బరువుకంటే కూడా అధిక కొవ్వు చాలా ప్రమాదకరం. కాబట్టి దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవన శైలిలో, ఆహార నియమాల్లో మార్పులు, వ్యాయామాలు ఇందుకు దోహదం చేస్తాయి.