ఏప్రిల్ 16 ఇండియన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ డే
బొగ్గుతో నడిచే ట్రైన్ నుంచి వందే భారత్ ట్రైన్స్ వరకు భారతీయ రైల్వేస్ వికాసం చెందిన తీరు అద్భుతం.
దిశ, వెబ్ డెస్క్: బొగ్గుతో నడిచే ట్రైన్ నుంచి వందే భారత్ ట్రైన్స్ వరకు భారతీయ రైల్వేస్ వికాసం చెందిన తీరు అద్భుతం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా భారతీయ రైల్వేస్ కు పేరుంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఇండియన్ రైల్వేస్ ప్రజలకు సేవలు అందిస్తోంది. అయితే ఈ స్థాయికి రావడానికి ఇండియన్ రైల్వేస్ కు చాలా కాలమే పట్టింది. అయితే ఎంత గొప్ప వ్యవస్థకైనా ఏదో ఒక రోజు అంకురార్పణ జరగాల్సిందే. 140 కోట్ల మంది భారతీయులకు సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వేస్ ప్రస్థానం కూడా ఆ విధంగానే మొదలైంది. దేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే సేవలు బ్రిటిష్ హయాంలో మొదలయ్యాయి. 1853 ఏప్రిల్ 16న బోరి బందర్ నుంచి థానే వరకు దేశంలో మొదటి ప్యాసెంజర్ రైలు నడిచింది. మొత్తం 34 కిలోమీటర్ల వరకు ఈ ట్రైన్ ప్రయాణించింది. దేశంలో రైలు సేవలు ప్రారంభం అయిన ఏప్రిల్ 16న ఏటా ఇండియన్ ట్రైన్ ట్రాన్స్ పోర్టు దినోత్సవాన్ని జరుపుకుంటాం.
170 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వేస్
దేశంలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమై నేటితో 170 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ రైల్వేస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయవంతంగా నిలబడింది. ఓ సింగిల్ ట్రాక్ తో మొదలైన ఇండియన్ రైల్వేస్ జర్నీ.. నేడు అనేక రూట్లల్లో మల్టీ ట్రాక్, మల్టీ స్టేషన్లు, జంక్షన్లతో ఆధునికతను సంతరించుకుంది. ఇటీవల దేశీయ టెక్నాలజీతో వచ్చిన వందే భారత్ ట్రైన్లు భారతీయ సాంకేతిక శక్తని ప్రపంచానికి చాటాయి. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం.
ఇండియన్ రైల్వేస్ విశిష్టతలు ఇవే..!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో భారతీయ రైల్వే ఒకటి.
- ఇది ప్రతి రోజూ మూడు కోట్ల ప్రయాణీకులను గమ్యం చేరుస్తుండటమే కాక 28 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది.
- 169 సంవత్సరాల వారసత్వ చరిత్ర (1853 లో మొదటి రైలు నడిచింది).
- ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే (చీనాబ్ రివర్ పై) బ్రిడ్జి భారత్ లోనే ఉంది.
- ప్రపంచంలోనే పొడవైన ప్లాట్ ఫామ్ గోరఖ్ పూర్ భారత్ సొంతం.
- యునెస్కో గుర్తింపు పొందిన ఘనత స్థలాలు రైల్వేస్ సొంతం.
- నాగ్ పూర్ లోని డైమండ్ క్రాసింగ్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
- 4,189 కిలో మీటర్ల అత్యంత పొడవైన రైలు మార్గం(దిబ్రఘర్ నుంచి కన్యాకుమారి వరకు)
- ఒకే ప్రదేశంలో రెండు స్టేషన్లు (అహ్మద్ నగర్ లో శ్రీరాంపూర్ మరియు బేలాపూర్ స్టేషన్లు).
- దేశంలోనే అత్యధిక మంది ఉద్యోగులు (14 లక్షలు) కలిగిన రైల్వేస్ గా గుర్తింపు
- ఒకే చోటు నుంచి 7 రైల్వే లైన్స్ (మథుర జంక్షన్)
- దేశంలో ప్రభుత్వ సెక్టార్ లో నడుస్తోన్న అతి పెద్ద ట్రాన్స్ పోర్టు వ్యవస్థ.