Space travel : అంతరిక్షంలోకి మొదట అడుగు పెట్టింది జంతువులే.. వాటిలో కొన్ని ఇవిగో..

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో హీలియం లీకేజీలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. కాగా స్టార్ లైనర్ ఖాళీగానే భూమికి తిరిగి వచ్చింది.

Update: 2024-09-13 09:01 GMT

దిశ, ఫీచర్స్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో హీలియం లీకేజీలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు అక్కడే ఉండాల్సి రావడం, స్టార్ లైనర్ ఖాళీగానే భూమికి తిరిగి రావడం వంటి పరిణామాలు అంతరిక్ష పరిశోధనలు, రహస్యాలపై పలువురిలో ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో మొదటి సారి స్పేస్‌లోకి అడుగు పెట్టిందెవరు? అక్కడ ఎలాంటి పరిశోధనలు చేస్తారు? మనుషులే వెళ్లారా? ఇతర జీవాలను కూడా పంపారా? వంటి సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట అంతరిక్షంలోకి వెళ్లిన జంతువులు ఏవి? వాటిని ఏ దేశాలు పంపాయో ఇప్పుడు చూద్దాం.

ఆల్బర్ట్ కోతులు

అంతరిక్ష రహస్యాలను తెలుసుకునే ప్రయోగాల్లో భాగంగా అమెరికాకు చెందిన నాసా 1948, జూన్ 18న ఆల్బర్ట్ 1 అనే మకాక్ జాతికి చెందిన కోతిని స్పేస్‌లోకి పంపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా యూఎస్‌లోని వైట్ సాండ్స్ ప్రూవింగ్ గ్రౌండ్ కేంద్రంగా ఈ ప్రయోగం నిర్వహించారు. అయితే అప్పట్లో టెక్నికల్ సమస్యల కారణంగా ఇది విఫలమైనందున ఆల్బర్ట్ 1 అనే కోతి మృతి చెందింది. ఆ తర్వాత ఆల్బర్ట్ 2 అనే కోతిని నాసా సైంటిస్టులు 1949, జూన్ 14న, న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వి-2 సౌండింగ్ రాకెట్‌లో అంతరిక్షానికి పంపారు. కానీ పారాచూట్ వైఫల్యం కారణంగా ఈ కోతి కూడా ల్యాండింగ్ సమయంలోనే మరణించిందని పరిశోధకులు చెప్తారు.

1957లో లైకా డాగ్

ఇక మరో జంతువు లైకా అనే డాగ్‌‌ను మొదటిసారిగా అప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన రష్యా 1957లో స్పుత్నిక్ -2 ద్వారా స్పేస్‌లోలోకి పంపింది. అయితే దీనిని ఎంపిక చేయడానికి ఒక కారణం ఉందని చెప్తారు. లైకా అనే కుక్క మాస్కో వీధుల్లో తిరుగుతూ చలి, ఎండ, ఆకలి వంటి అన్ని పరిస్థితులను తట్టుకుంటోందని అప్పట్లు గుర్తించారు. అన్ని పరిస్థితులను తట్టుకోవడంలో మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు దానిని తీసుకొచ్చి కొంతకాలం శిక్షణ ఇచ్చి స్పేస్‌లోకి పంపారు.

1961లో చింపాంజీ

అంతరక్షి ప్రయోగాల్లో భాగంగా 1961లో హామ్ అనే చింపాంజీని మెర్క్యురీ రెడ్ స్టోన్ 2 మిషన్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపింది అమెరికాకు చెందిన నాసా. కాగా ఈ చింపాంజీ 1957, జులైలో ఫ్రెంచ్ కామెరూన్‌లో జన్మించిందని, కొందరు దానిని ఫ్లోరిడాలోని మయామిలోగల రేర్ బర్డ్ ఫామ్‌కు ఇచ్చారని చెప్తారు. కాగా అదే ఏడాది యూఎస్ ఎయిర్ ఫోర్స్ అధికారులు దానిని 457 డాలర్లకు కొనుగోలు చేశారట. దీంతోపాటు మొత్తం 40 చింపాంజీలను అంతరిక్షంలోకి పంపేందుకు అప్పట్లో శిక్షణ ఇచ్చారు. అయితే వీటిలో చివరిస్థానంలో ఉన్న హామ్ అనే చింపాంజీ ఒక్కటే ప్రయోగానికి సెలెక్ట్ అయింది. సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలోకి వెళ్లివచ్చింది.

1968లో తాబేళ్లు

సోవియట్ యూనియన్ 1968లో జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో తాబేళ్లను కూడా పంపింది. అయితే అవి భూమికి తిరిగి రావడానికి ముందు చంద్రుని చుట్టూ సురక్షితంగా తిరిగాయి. ఆ తర్వాత ఆరు రోజులకు జోండ్ 5 హిందూ మహాసముద్రంలో క్రాష్ ల్యాండ్ అయింది. కాగా తాబేళ్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అంతరిక్షంలో జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని అందించడంలో ఈ ప్రయోగం బాగా ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇకపోతే అంతకు ముందు 1960లో కూడా సోవియట్ యూనియన్ బెల్కా, స్ట్రెల్కా అనే రెండు కుక్కలను స్పేస్‌లోకి పంపగా అవి భూమి చుట్టూ తిరిగి సజీవంగా భూమికి తిరిగి వచ్చాయి. ఈ సక్సెస్ ఫుల్ యాత్రపై 2010లో స్పేస్ డాగ్స్ అనే ఒక యానిమేషన్ మూవీ కూడా రష్యన్ భాషలో రిలీజైంది. 


Similar News