Mother's love : అమ్మ అంటేనే ఆనందం.. అమ్మ ఉంటేనే గుండె ధైర్యం..

అమ్మ అంటే.. ఎక్కడాలేని ఆనందం. అమ్మ ఉంటే చెప్పలేనంత గుండె ధైర్యం. అమ్మంటే.. ప్రేమానురాగాల అనుబంధం, అమ్మ ఉంటే.. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నంత సంతోషం.

Update: 2024-05-11 08:57 GMT

దిశ, ఫీచర్స్ : అమ్మ అంటే.. ఎక్కడాలేని ఆనందం. అమ్మ ఉంటే చెప్పలేనంత గుండె ధైర్యం. అమ్మంటే.. ప్రేమానురాగాల అనుబంధం, అమ్మ ఉంటే.. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నంత సంతోషం. తన బిడ్డకు జన్మనిచ్చిన మరు క్షణం నుంచే బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం ఏమాత్రం స్వార్థం లేకుండా అహర్నిశలూ కృషి చేసే మహా మనిషి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే.

మనుషుల్లోనే కాదు, సృష్టిలోని ప్రతి జీవికీ అమ్మ కావాలి. అమ్మ ప్రేమ లేనిదే, అమ్మ లాలనలోని వాత్సల్యాన్ని అనుభవించనిదే బతుకు సార్థకం కాదు. బాధలు దూరం కావు. ఈ ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి. అనురాగాలు, ఆప్యాయతలు కూడా లభిస్తాయి. కొంగ్రొత్త అనుబంధాలు పెనవేసుకుంటాయి. కానీ ఎంత వెతికినా దొరకనిది అమ్మ ప్రేమతో సమానమైన ప్రేమ మాత్రమే. అందుకే అమ్మను ఎప్పుడూ తక్కువ చేసి చూడవద్దని, అగౌరవ పర్చవద్దని, అమ్మ మనసును బాధ పెట్టవద్దని పెద్దలు చెప్తుంటారు.

కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అహర్నిశలూ కృషి చేస్తుంది అమ్మ. తన కంటే, తన ఆరోగ్యం కంటే కూడా తన పిల్లలే ముఖ్యమని భావిస్తుంది. వాళ్ల ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, భవిష్యత్తుకోసం నిస్వార్థంగా కృషి చేస్తుంది అమ్మ. ఏ ఫలితమూ ఆశించకుండా పిల్లలు బాగుంటే చాలు అనుకునే వెర్రిమాలోకం అమ్మే. ఆనందంలో, ఆవేశంలో, ఆపదలో.. ఇంకెలాంటి పరిస్థితుల్లోనైనా సరే తన బిడ్డలకు ప్రేమను పంచే విషయంలో అప్పటికీ, ఇప్పటికీ, ఇంకెప్పటికీ మారని ఒకే ఒక వ్యక్తి అమ్మ.

దారిలో నడుచుకుంటూ వెళ్తుంటాం సడెన్‌గా ఏదో రాయి తగిలి కిందపడతాం. అప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఏ దేవుడో కాదు, అమ్మ మాత్రమే. భయంకర పరిస్థితుల్లో చిక్కుక్కున్నా, కళ్ల ముందు అద్భుతం ఆవిష్కృతమైనా మన నోటి నుంచి మనకే తెలియకుండా వెంటనే వెలువడే ఏకైక పదం అమ్మ. అందుకే అంటారు కనిపించని దేవుడికన్నా, కని పెంచే తల్లే గొప్పదని. తను కొవ్వత్తిలా కరుగుతూ తన పిల్లకు వెలుగునిచ్చే దేవత అమ్మ.

సమస్యల సుడిగుండాల్లో మనం చిక్కుకున్నప్పుడు, సంసార సాగరాన్ని ఈదలేక తండ్లాడుతున్నప్పుడు, ఎవరూ మనకు సహాయపడట్లేదని కుమలి పోతున్నప్పుడు అమ్మా అంటే చాలు.. పరిష్కార మార్గమై మనల్ని గట్టెక్కించేస్తుంది. చదువులో ప్రేమలో, ఉద్యోగంలో, జీవితంలో ఎప్పుడు, ఎక్కడ ఇబ్బందులు ఎదరైనా, సందేహాలు తలెత్తినా మన దగ్గర కొన్నిసార్లు సమాధానమో, పరిష్కారమో లేకపోవచ్చు. కానీ అమ్మవద్ద మాత్రం కచ్చితంగా ఉంటుంది.

సమాజంలో ఎదురయ్యే సమస్యలను, లక్ష్యాల దారుల్లో వెంటాడే ఆటంకాలను ఎదుర్కోలేక నిరాశలో మనం కూరుకుపోయినప్పుడు ఏక వ్యక్తి సైన్యమైన ఎలా ఎదుర్కోవాలో చెప్తుంది అమ్మ. అందుకే ఎంత చదివినా ఒడవని ప్రేమ కథ అమ్మ. అమ్మను గౌరవిద్దాం. అమ్మను ప్రేమిద్దాం. అమ్మకు కావాల్సినవన్నీ సమాకూర్చుదాం. అమ్మ మనతో ఉన్నా లేకపోయినా గుండెలోతుల్లో అమ్మ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే కదా. హ్యాపీ మదర్స్ డే.


Similar News