అంటు వ్యాధులకు చెక్ పెట్టే RSV వ్యాక్సిన్.. మొదటిసారిగా అనుమతించిన అమెరికా
అమెరికన్లలో ప్రతీ సంవత్సరం వంద నుంచి 3 వందల మంది ఐదేళ్లలోపు చిన్నారులు, 6 వేలకు పైగా 65 ఏళ్లు దాటిన పెద్దల మరణాలకు కారణం అవుతున్న శ్వాసకోశ వ్యాధికి
దిశ, ఫీచర్స్: అమెరికన్లలో ప్రతీ సంవత్సరం వంద నుంచి 3 వందల మంది ఐదేళ్లలోపు చిన్నారులు, 6 వేలకు పైగా 65 ఏళ్లు దాటిన పెద్దల మరణాలకు కారణం అవుతున్న శ్వాసకోశ వ్యాధికి చెక్ పెట్టేందుకు తయారు చేసిన రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వ్యాక్సిన్ అయినటువంటి అరెక్స్వీ (Arexvy)ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా ఆమోదించింది. ఇక నుంచి ఈ వ్యాక్సిన్‌ను తమ దేశంలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు మే 4వ తేదీన ఇక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్టేషన్ (FDA) పేర్కొన్నది.
అయితే ఈ వ్యాక్సిన్ విజయవంతంగా పురోగతి సాధించడానికి 60 ఏళ్లు పట్టిందని కూడా గుర్తు చేసింది. ఔషధ దిగ్గజం GSK ద్వారా తయారు చేయబడిన ఈ ఆర్‌ఎస్‌వీ సింగిల్ డోస్ షాట్ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిని రక్షించడానికి డెవలప్ చేయబడిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొన్నది. అర్హతగల వృద్ధులు వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్‌ను యాక్సెస్ చేయగలుగుతారని, ఇతర దేశాల్లో వినియోగంపై కూడా దృష్టి కేంద్రీకరించినట్లు GSK చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ టోనీ వుడ్ వెల్లడించారు.
వైరస్ ప్రభావం-క్లినికల్ ట్రయల్స్
ఆర్ఎస్‌వి వైరస్ సాధారణంగా తేలికపాటి జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది వృద్ధులను, చిన్న పిల్లలను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. ఇదొక అంటువ్యాధి వైరస్. ప్రతీ సంవత్సరం 60 వేల కంటే ఎక్కువ మంది పెద్దలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 80 వేల మంది పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారు. 100 నుంచి 300 మంది వరకు పిల్లలు మరణిస్తున్నారు.
ఇప్పుడు ఈ శ్వాస సంబంధిత అంటు వ్యాధికి విరుగుడుగా రూపొందించిన రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వ్యాక్సిన్ (Arexvy) అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. దీని ఆమోదానికి ముందు అనేక క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో భాగంగా ఇక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ కమిటీ 12, 500 మందికి వ్యాక్సిన్ వేసినప్పుడు రిజల్ట్స్ డేటాను పరిశీలించింది. మెరుగ్గా పనిచేస్తుందని నిర్ధారణకు వచ్చాక వినియోగించడానికి అనుమతించింది. అయితే ఈ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత చిన్నపాటి అలసట, కండరాల నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ కొందరిలో కనిపించినా అవి తగ్గిపోతాయని నిపుణులు పేర్కొన్నారు.
60 ఏళ్లు పైబడిన వారిని, ఆస్తమా లేదా రక్తప్రసరణ లోపాలు ఉన్నవారిని, శ్వాసకోశ వ్యాధుల బారిన పడినవారిని రక్షించడంలో ఆర్ఎస్‌వీ వ్యాక్సిన్ లేదా టీకా మెరుగైన ఫలితాన్నిస్తుందని అమెరికన్ మెడికల్ గ్రూప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ కెన్నెడీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
రా ఫిష్ వినియోగం హానికరం.. కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందంటున్న నిపుణులు