Yoga for health : డిప్రెషన్ నుంచి బయటపడేసే అద్భుత యోగాసనాలు.. మరిన్ని ప్రయోజనాలు కూడా..

ఉరుకులు పరుగుల జీవితం, మానసిక ఒత్తిళ్లు, జీవితంలో ఎదురయ్యే విషాద సంఘటనలు.. ఇలా కారణాలేమైనా ఇటీవల పలువురిలో లోన్లీనెస్, డిప్రెషన్ వంటివి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Update: 2024-09-01 07:45 GMT

దిశ, ఫీచర్స్ : ఉరుకులు పరుగుల జీవితం, మానసిక ఒత్తిళ్లు, జీవితంలో ఎదురయ్యే విషాద సంఘటనలు.. ఇలా కారణాలేమైనా ఇటీవల పలువురిలో లోన్లీనెస్, డిప్రెషన్ వంటివి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పరిస్థితులు చక్కబడ్డాక వీటినుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కొందరిలో అందుకు భిన్నంగా జరగవచ్చు. అలాంటప్పుడు వైద్య నిపుణులను, సైకాలజిస్టులను సంప్రదిస్తే తగిన పరిష్కారం చూపుతారు. సమస్యన బట్టి చికిత్స అందిస్తారు. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా కూడా కొన్ని రకాల యోగాసనాలతో కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అవేంటో చూద్దాం.

భుజంగాసనం

సాధారణంగా వెనక్కి వంగి ఉండే భంగమలో చేసేదే భుజంగాసనం. సేతు బంధనాసనం, ఉస్ట్రాసన వంటివి కూడా ఇవే కోవకు చెందుతాయని యోగా నిపుణులు చెప్తున్నారు. వీటిని ప్రతిరోజూ చేయడంవల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ వంటి సమస్యల నుంచి బయట పడతారు. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఛాతీ, గుండె భాగాలకు బలం చేకూరుతుంది.

శీర్షాసనం

తలకిందులుగా చేసే దానిని శీర్షాసనం అంటారు. ఏదైనా గోడ సపోర్ట్‌తో తలభాగం కిందకు పెట్టి, కాళ్లను పైకి ఉంచే ఈ భంగిమలో ఉండటంవల్ల నాడీ వ్యవస్థ ప్రేరేపితం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. సర్వాంగాసనం లేదా విపరీత కరణి వంటి ఆసనాలు కూడా దాదాపు ఇలాంటి ప్రయోజనాలే కలిగిస్తాయి. గుండె ఆరోగ్యానికి పరోక్షంగా మేలు చేస్తాయి.

ఉత్తనాసనం

ముందుకు వంగే భంగిమలో చేసే ఒక రకమైన వ్యాయామమే పశ్చిమోత్తనాసనం లేదా ఉత్తనాసనం అంటారు. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా శరీరానికి బలాన్నిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. తరచుగా నిరాశతో బాధపడేవారు, లోన్లీనెస్ ఫీలయ్యేవారు దీనిని ప్రయత్నిస్తే సమస్య నుంచి బయటపడతారు.

వృక్షాసనం

డిప్రెషన్ నుంచి బయటపడటంలో వృక్షాసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా ఇది ప్రతికూల భావాల నుంచి బయటపడేస్తుందని నిపుణులు చెప్తున్నారు. భావోద్వేగాల నియంత్రణకు, శారీరక సమతుల్యతకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ప్రాణాయామం

మానసిక స్థితిని మెరుగు పర్చడంలో ప్రాణాయామం గొప్పగా పనిచేస్తుంది. డిప్రెషన్‌తో బాధపడేవారికి యోగా నిపుణులు శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ ఆసనాన్ని ప్రయత్నించాలని చెప్తుంటారు. మానసిక ప్రశాంతతను పెంచడంతోపాటు ఆందోళన, లోన్లీనెస్ భావాలను ఇది దూరం చేస్తుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే యోగా నిపుణులను సంప్రదించగలరు. 


Similar News