మొక్క జొన్నలో అద్భుత పోషకాలు.. తినడంవల్ల కలిగే లాభాలివే..

వర్షాకాలంలో చాలా మంది తినడానికి ఇష్టపడే స్నాక్స్‌లో మొక్క జొన్న ఒకటి. ప్రస్తుతం అన్నిచోట్ల ఇది అందుబాటులో ఉంటున్నది. రోడ్ సైడ్ బిజినెస్‌గా చిరు వ్యాపారులకు ఉపాధి కూడా కల్పిస్తోంది. చల్లటి వాతావరణంలో మొక్క జొన్న కంకులను వేడిచేసి, వాటిపై నిమ్మరసం పూసి, ఉప్పు, కారం చల్లి తింటుంటే ఆ మాజానే వేరని చాలా మంది చెప్తుంటారు.

Update: 2024-07-18 07:22 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో చాలా మంది తినడానికి ఇష్టపడే స్నాక్స్‌లో మొక్క జొన్న ఒకటి. ప్రస్తుతం అన్నిచోట్ల ఇది అందుబాటులో ఉంటున్నది. రోడ్ సైడ్ బిజినెస్‌గా చిరు వ్యాపారులకు ఉపాధి కూడా కల్పిస్తోంది. చల్లటి వాతావరణంలో మొక్క జొన్న కంకులను వేడిచేసి, వాటిపై నిమ్మరసం పూసి, ఉప్పు, కారం చల్లి తింటుంటే ఆ మాజానే వేరని చాలా మంది చెప్తుంటారు. అయితే ఇవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. వాటిని తినడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

మొక్క జొన్నలో ఆరోగ్యానికి అవసరమైన చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతోపాటు విటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు దూరం

ఫైబర్ కంటెంట్ ఫుల్లుగా ఉండటంవల్ల మొక్క జొన్న జీర్ణ సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అయితే పచ్చివి తినడంవల్ల ఈ పోషకాలు లభించే అవకాశం తక్కువ. కాబట్టి వాటిని కాల్చి లేదా ఉడకబెట్టి తింటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కంటి సమస్యలకు చెక్

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందువల్ల మొక్కజొన్న కంటి సమస్యలను దూరం చేస్తుంది. డైట్‌లో భాగంగా తీసుకోవడంవల్ల దృష్టిలోపాలు రాకుండా ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు వీటిని తినాలని పోషకాహార నిపుణులు చెప్తుంటారు.

గుండె ఆరోగ్యానికి మంచిది

కాల్చిన మొక్క జొన్నలో ఫైబర్ కంటెంట్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. విటమిన్ సి, బయో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి లక్షణాలు ఉండటంవల్ల అవి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఎముకల బలానికి

ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు కలిగి ఉండటంవల్ల మొక్క జొన్న ఎముకల బలానికి కూడా మంచిది. వర్షాకాలంలో కీళ్లు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడేవారు మొక్కజొన్న కంకులను తినడంవల్ల మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

చర్మ సమస్యలు దూరం

యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలతోపాటు మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. తరచుగా తినడంవల్ల స్కిన్ అలెర్జీలు తగ్గుతాయని, స్కిన్ గ్లో పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెప్తుంటారు.

Tags:    

Similar News