అందమైన అనుభూతికి చిరునామా.. ది గ్రేట్ 'Thanks' !
చిరునవ్వును మీరెప్పుడైనా గమనించారా? అదో గొప్ప అనుభూతి.
దిశ, ఫీచర్స్ : డియర్ ఫ్రెండ్ థాంక్యూ రా.. థాంక్యూ డాడ్.. థాంక్యూ మామ్.. థాంక్యూ డియర్.. థాంక్స్ గాడ్ .. ఇలాంటి మాటలు విన్నప్పుడు.. లేదా మీరే చెప్పినప్పుడు మీలోనూ, ఎదుటి వ్యక్తిలోనూ కలిగే హాప్పినెస్‌ను మీరెప్పుడైనా పరిశీలించారా? ఆ క్షణంలో.. ఆ ఒక్క మాటవల్ల ఎదుటి వ్యక్తి ముఖంలో విరబూసే చిరునవ్వును మీరెప్పుడైనా గమనించారా? అదో గొప్ప అనుభూతి. కృతజ్ఞత లేదా ధన్యవాదాలు తెలిపినప్పుడు స్వీకరించిన వ్యక్తిలోనూ, తెలిపిన వ్యక్తిలోనూ కలిగే ఆనందం. అది మనసుకు ఎంతో హాయినిస్తుంది. అందుకే అంటారు పెద్దలు మీకు మేలు చేసిన వారిపట్ల, మీ మంచి కోరే వారిపట్ల, దేవునిపట్ల, పెద్దలపట్ల, ప్రకృతిపట్ల, పరిసరాలపట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని. అంతకు మించిన సంతోషం మరేదీ ఉండదని.
పవర్ ఫుల్ 'థాంక్స్'
థాంక్స్.. కృతజ్ఞతలు, షుక్రియా.. భాష ఏదైనా భావమొక్కటే.. సందర్భమేదైనా మీ గుండెలోతుల్లోంచి వెలువడే కృతజ్ఞతా భావానికి ఉన్న పవర్ ఒక్కటే. ఒక్క థాంక్స్ ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. ఒక్క థాంక్స్ ఎదుటి వ్యక్తిలో మీపట్ల మంచి అభిప్రాయం కలిగేలా చేస్తుంది. మీలోని క్రమ శిక్షణకు లేదా మంచితనానికి కేరాఫ్‌గా మారుతుంది. అందుకే థాంక్స్ చెప్పే సందర్భం వచ్చినప్పుడు తప్పక యూజ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. పరిచయస్తులు, కుటుంబం, రోజూ కలుసుకునేవారి మధ్య అండర్ స్టాండ్ ఉంటుంది కాబట్టి, అక్కడ థాంక్స్ అనేది ప్రతీ సందర్భంలో వాడకపోయినా పర్లేదు. కానీ ఓ కొత్త వ్యక్తినో, గొప్ప వ్యక్తినో కలిసినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు చివరలో థాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫైనల్‌గా మీరు చెప్పే ఈ ఒక్క మాటవల్ల మీపట్ల ఎదుటి వ్యక్తికి సదభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. అందకే పర్సనల్ స్కిల్స్ డెవలప్ మెంట్ సబ్జెక్టుల్లోనూ థాంక్స్ అనే పదాన్ని కూడా కీలకమైన అంశంగా పరిగణిస్తారు.
సందర్భమేదైనా..
కృతజ్ఞతను ఏ సందర్భంలో తెలియజేయాలి? అనే సందేహం అవసరం లేదు. అది మీ క్రియేటివిటీపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు సైకాలజిస్టులు. ఏ సందర్భంలో దానిని ప్రకటించాలనే విషయాన్ని మీ మనసు చెప్తుంది. ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. పరికించి చూడాలేగాని కృతజ్ఞతా భావానికి, భావ వ్యక్తీకరణకు సందర్భాలనేకం ఉంటాయి. మీరు అనుభవించే ప్రతీ అనుభూతి కూడా కృతజ్ఞతకు అర్హత కలిగి ఉంటుంది. ''అందమైన ప్రకృతిని సృష్టించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. పశు పక్ష్యాదులను సాకుతున్న అడవి తల్లికి ధన్యవాదాలు. పారే సెలయేటికి థాంక్స్. వీచే చిరుగాలికి థాంక్స్ '' ఇలా అనేక సందర్భాల్లో కృతజ్ఞతను ప్రకటించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కృతజ్ఞత అనేది జీవితంతో ముడిపడి ఉన్న ఒక అందమైన భావోద్వేగం. అవసరమైన సందర్భంలో దానిని ప్రకటించడం మానవ నైజం. ప్రపంచంలో పరస్పర సానుభూతిని, అనుభూతిని కలిగించే మధురమైన పదం 'థాంక్స్'. సంతోషాలకు, సదవకాశాలకు మార్గాన్ని గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ 'థాంక్స్'. అందుకే ది గ్రేట్ 'థాంక్స్'ను సందర్భోచితంగా సద్వినియోగం చేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు.
ఇవి కూడా చదవండి : అభద్రతా భావం వెంటాడుతుందా.. ? అయితే ఇలా చేసి చూడండి..