భారతదేశంలోని ఈ గ్రామంలో సగం మంది మూగ, చెవిటివారే..!!
నిజమైన భారతదేశం గ్రామాలలో కనిపిస్తుందని అంటారు. A village in India half of the population can neither speak nor hear
దిశ, వెబ్‌డెస్క్ః నిజమైన భారతదేశం గ్రామాలలో కనిపిస్తుందని అంటారు. భారతదేశంలో ఆదర్శ గ్రామాల నుండి అనామక గ్రామాల వరకూ ఎన్నో రకాల గ్రామాలను చూడొచ్చు. అందులో ప్రత్యేకమైన గ్రామాలలో ఒక గ్రామం కథ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. అదే జమ్మూలో ఉన్న ధడ్కాయ్ విలేజ్. ఆశ్చర్యకరంగా ఇక్కడ జనాభాలో సగం మంది చెవిటి, మూగవారు. చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా అందరికీ ఈ సమస్య ఉంది. వాస్తవానికి ఈ గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఈ సమస్య ఉంది. ప్రతి కుటుంబంలో సగం మంది సభ్యులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం కొన్ని జీన్ సిండ్రోమ్‌లని కొందరు అంటే, కొందరు దీనిని శాపంగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. కానీ, దీని వెనుక ఏదో ఒక శాస్త్రీయ కారణం ఉండకపోదు.
ధడ్కాయ్ గ్రామం దోడాలోని గండో తహసీల్‌లోని భలేసా బ్లాక్‌లో ఉన్న ఓ కొండ ప్రాంతం. గుజ్జర్లు ఉండే ఈ గ్రామం మినీ కాశ్మీర్‌గా పిలువబడే భదర్వా నుండి 105 కి.మీ దూరంలో పర్వత శిఖరంపై ఉంటుంది. ఇక్కడ దాదాపు 105 కుటుంబాలు నివసిస్తున్నాయి. 'నిశ్శబ్ద గ్రామం'గా మారు పేరున్న ఈ గ్రామంలో మొదటిసారి 1901లో చెవిటి బిడ్డ పుట్టినట్లు చెబుతారు. 1990లో ఇక్కడ 46 మంది బధిరులు ఉండగా ఈ వ్యాధి కారణంగా కొన్ని కుటుంబాలు పంజాబ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇక, ఇక్కడ ఒక కుటుంబంలో తల్లి మాట్లాడగలిగితే, ఆమె పిల్లలు మాట్లాడలేరు. ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి కారణంగా గ్రామంలో ప్రజలు వివాహానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. బధిరులతో బయటివారు సంబంధం కలుపుకోకపోవడం, దానితో ఉన్న కుటుంబాల్లోనే వివాహం చేయడం వల్ల సమస్య తగ్గకపోగా తీవ్రమవుతోంది. అయితే, దీనికి జన్యుపరమైన లోపమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివాహ సంబంధాలు బయటకు వెళ్లకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల గ్రామస్థులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.