కొత్త స్టడీ: వేల ఏళ్ల క్రితమే అవి రకరకాల సైజుల్లో, షేపుల్లో ఉండేవి..!
పెంపుడు కుక్కల నుండి దవడ ఎముకలు సేకరించి, పరిశోధన చేశారు. Surprising morphological diversity of ancient dogs
దిశ, వెబ్‌డెస్క్ః భూమిపైన నివశించే జీవుల్లో మనిషికి అత్యంత దగ్గరగా, దాదాపు సమానంగా జీవించే జంతువులు కుక్కలు అనడంలో సందేహం లేదు. పెంపుడు జంతువుల్లో వీటికి అత్యంత ప్రధమ స్థానం దక్కుతుంది. ఇలాంటి కుక్క జాతి ఒకటే అయినా వాటిలో విభిన్న జాతులు, రకరకాల షేపులు, సైజులు చూస్తుంటాము. అయితే, ఆధునిక కాలంలోనే ఇన్ని రకాల డాగ్ బ్రీడ్స్ వచ్చాయని చాలా మంది అనుకుంటారు. కానీ, వేల సంవత్సరాల క్రితమే కుక్కలు చాలా షేపుల్లో, సైజుల్లో ఉన్నాయని ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది. చిన్న చివావా, చైనీస్ క్రెస్టెడ్ కుక్క, నుండి శక్తివంతమైన గ్రేట్ డేన్ వరకు, కుక్కలన్నీ ఒకే జాతి అని నమ్మడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. చాలా మంది అనుకుంటున్నట్లు కుక్కలు తోడేళ్ళ నుండి వచ్చినవని చెప్పనవసరం లేదు.
ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ Bలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం, కుక్క పరిమాణం, ఆకృతిలో ఈ వైవిధ్యాలు ఎంత కాలం క్రితం నుంచి ఉన్నాయో తెలియజేసింది. అంతర్జాతీయ పరిశోధనా బృందం చెబుతున్న వివరాలను బట్టి, ఎక్కువగా ఫ్రాన్స్‌లో, అలాగే, పశ్చిమ ఐరోపా, రొమేనియా చుట్టూ ఉన్న పురావస్తు ప్రదేశాల్లో కనుగొన్న 525 పురాతన కుక్క మాండబుల్‌లను (దిగువ దవడ ఎముకలు) ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ఈ నమూనాలు సుమారుగా 8100, 3000 BCE మధ్య, లేదా మెసోలిథిక్ (మధ్య రాతి యుగం) నుండి కాంస్య యుగం వరకు ఉన్నవి. ఇక, ఈ అధ్యయనంలో కొన్ని పురావస్తు తోడేలు మాండబుల్స్, అలాగే ఆధునిక తోడేళ్ళు, డింగోలు, పెంపుడు కుక్కల నుండి దవడ ఎముకలు సేకరించి, పరిశోధన చేశారు.
అధ్యయన నిర్వహించిన రచయితల ప్రకారం, పరిశోదనా ఫలితాలను పరిశీలిస్తే, ఆ కాలంలో కుక్కల నిర్దిష్ట సౌందర్య లక్షణాలు, పశువుల పెంపకం వంటి వివిధ ప్రవర్తనలకు అనుకూలంగా మానవులు కుక్కలను కృత్రిమంగా ఎంచుకునేవారు కాదని స్పష్టంగా తెలిసింది. దానికి బదులుగా, పురాతన కుక్కల ఆహారంలో ఎక్కువ సహజత్వం, వైవిధ్యం ఉండేదని, తర్వాత కాలంలో కుక్కలు, వాటిని పెంచే మానవులు వివిధ ఖండాలకు వలస రావడంతో ఆయా పరిస్థితులను బట్టి వచ్చిన మార్పులు వాటి పుర్రె ఆకృతిని ప్రభావితం చేసి ఉండవచ్చని అధ్యయనంలో వెల్లడించినట్లు కాస్మోస్ మ్యాగజేన్ పేర్కొంది.