చిమ్మ చీకటిలో వింత ఆకారం.. ఆ శబ్దాలు వినగానే వాళ్లు ఏం చేశారంటే..

అదో అందమైన అడవి. సమయం అర్ధరాత్రి. చిమ్మ చీకటి కమ్ముకున్నది. ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణమే. ఎంతలా అంటే గుండు సూది కిందపడినా శబ్దం వస్తుందేమో అన్నంతగా.. అక్కడొక ప్రదేశంలో ఏర్పాటు చేసిన గుడారం కొందరు వ్యక్తులు ఏదో గుస గుసలాడుకుంటున్నారు.

Update: 2024-07-11 13:19 GMT

దిశ, ఫీచర్స్ : అదో అందమైన అడవి. సమయం అర్ధరాత్రి. చిమ్మ చీకటి కమ్ముకున్నది. ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణమే. ఎంతలా అంటే గుండు సూది కిందపడినా శబ్దం వస్తుందేమో అన్నంతగా.. అక్కడొక ప్రదేశంలో ఏర్పాటు చేసిన గుడారం కొందరు వ్యక్తులు ఏదో గుస గుసలాడుకుంటున్నారు. అంతలోనే అక్కడికి కొద్ది దూరంలో సడెన్‌గా ఏదో వింత ఆకారం ప్రత్యక్షమైంది. హైఫోకస్ కరెంట్ బల్బుల్లాంటి కళ్లు.. పెద్ద పెద్ద చెక్కల్లాంటి పాదాలు.. ఇది చూడగానే ఆ గుడారంలోని వ్యక్తుల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ క్షణాల్లోనే ఆ వింత ఆకారం మాయమైపోయింది.

ఇదీ అమెరికా లూసియానా ఫారెస్టులో కొంతమంది విద్యార్థులకు ఎదురైన అనుభవం. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఏం జరిగిందని పలువురు ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోతుంటాయి. అలాగనీ గుడ్డిగా నమ్మలేం.. అయితే కొన్నిసార్లు నమ్మక తప్పదేమో అనిపించే వింతలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి వాటిలో యూఎఫ్‌ఓలు, ఏలియన్లు, దెయ్యాలు వంటివి కూడా ఉంటున్నాయి. కొందరు ఇవి ఉన్నాయని, తాము చూశామని, ఎదుర్కొన్నామని బలంగా చెప్తుంటారు. అదంతా తూచ్.. ఒట్టి భ్రమ అని కొట్టిపారేసేవారు కూడా అంతే బలంగా వ్యతిరేకిస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలోని లూసియానా అడవిలో జరిగిన వింత ఆకారానికి సంబంధించిన ఘటన కూడా అలాంటిదే.

దక్షణి లూసియాలోని హౌమా నుంచి కొందరు హైస్కూల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇక్కడి కిసాచీ నేషనల్ ఫారెస్టును సందర్శించారు. అనంతరం అక్కడికి కొద్దిదూరంలోని ఓ ప్రాంతంలో క్యాంపింగ్ చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో మెరుస్తున్న కళ్లు, పెద్ద పెద్ద పాదాలు, భయంకరమైన గొంతుతో వింత శబ్దం చేస్తున్నా ఓ అకారం కనిపించి.. కొద్ది క్షణాల్లో మాయమైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు వెంటనే అక్కడి పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేశారు.

అక్కడికి వచ్చిన పోలీసులు ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. దీంతో స్టూడెంట్స్ చెప్తున్న మాటలు నమ్మశక్యంగా లేవని, వారు చెప్పిన వింత ఆకారం ఏదీ అక్కడ ఎంత వెతికినా తమకు కనబడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ వింత ఆకారం సంఘటన విద్యార్థుల దృష్టిలో ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా కిసాచీ నేషనల్ ఫారెస్టులో ఈ వింత ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని, 2019లోనూ ఒకసారి కొందరు తాము వింత ఆకారాన్ని చూశామని పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొన్నది. 


Similar News