చీకటిలో వెలుగులు.!
జనవరి 4న బ్రెయిలీ డే సందర్భంగా అంధత్వాన్ని జయించిన కొందరిపై కథనం.
కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.
కానీ దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.
చాలామంది దీన్ని నిరూపించారు కూడా.
అన్నీ సక్రమంగా ఉండి..
ఆపసోపాలు పడుతుంటారు కొందరు.
అలాంటి వారు ఒకసారి వీరిని చూడండీ.
అంధత్వం శాపం అనుకోలేదు.
సంకల్పంతో జయించి సక్సెసయ్యారు.
నేడు (జనవరి 4) బ్రెయిలీ డే సందర్భంగా అంధత్వాన్ని జయించిన కొందరిపై కథనం.
దిశ, ఫీచర్స్
100 కోట్ల ఎంటర్‌ప్రెన్యూర్
శ్రీకాంత్ బొల్ల పేరెప్పుడైనా విన్నారా.? బాలీవుడ్‌లో శ్రీకాంత్ అనే సినిమా కూడా వచ్చింది. అదితడి బయోగ్రఫీనే. ఆయన కథాంశంగా సినిమా తీశారంటే ఏదో గొప్ప పనే చేసుంటాడు కదా.? ఔను. విధి రాతను మార్చి ఎంట్రప్రెన్యూర్‌గా మారి సక్సెస్ అయిన అంధుడతను. పేరు మరోసారి గుర్తుతెచ్చుకోండీ.. శ్రీకాంత్ బొల్ల. ఎక్కడో కాదు మన తెలుగోడే. మామూలుగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు అవాంతరాలు ఎదురైతే.. లేదా ఎహే నీవల్ల కాదు తియ్ అని ఎవరైనా విమర్శిస్తే చాలా బాధనిపిస్తుంటది కదా. మనకెందుకివన్నీ అని వదిలేసి పోవాలన్నంత చిరాకు కూడా కలుగుతుంది. కానీ శ్రీకాంత్ అలాంటి వాటిని పట్టించుకోలేదు. దృఢ సంకల్పంతో ముందుకు సాగి 130 కోట్ల టర్నోవర్ సాధించే పారిశ్రామికవేత్తగా నిలిచాడు.
చూపులేకున్నా కలెక్టరైంది
ప్రాంజల్ పాటిల్ పేరు కూడా చాలానే వినుంటారు. ఆమె అంధురాలు. ఏమాత్రం కనిపించవు. అయినా.. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించారు. అదీ ఒకసారి కాదు.. వరుసగా రెండు సార్లు ఎంపికయ్యారు. ప్రాంజల్ మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించారు. పుట్టుకతోనే ఆమెకు పాక్షిక అంధత్వం ఉంది. ఆమె కంటిచూపు పూర్తిగా పోవచ్చునని డాక్టర్లు ఆమె తల్లిదండ్రులకు ముందే చెప్పారు. కానీ.. డాక్టర్లు చెప్పినదానికంటే ముందే ఆమెకు అంధత్వం వచ్చింది. అయినా కానీ.. ప్రాంజల్ చదువు కొనసాగించి ఎన్నో సవాళ్లను అధిగమించి ఆమె సివిల్స్ వైపు దృష్టి సారించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అన్నీ సక్రమంగా ఉన్నా జీవితంలో ఫెయిల్యూర్ అవుతున్నవారికి ప్రాంజల్ ఒక చక్కటి లెసన్‌ను ఇచ్చారు.
బ్యాంకు జాబ్ కొట్టింది..
జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన హిమబిందు పుట్టుకతోనే అంధురాలు. కానీ అంధురాలినని ఎన్నడూ బాధపడలేదు. తల్లిదండ్రులు కూడా బాగా చూసుకున్నారు. దీంతో పట్టుదలతో చదివింది హిమబిందు. ఐదో తరగతి వరకు లక్ష్మీనారాయణపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిన హిమబిందు మలక్‌పేటలోని గవర్నమెంట్ స్కూల్లో పదో తరగతి పూర్తిచేసింది. కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, పీజీని బ్రెయిలీ లిపితో పూర్తి చేసింది. తొలుత ఐపీబీఎస్‌లో పీవో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. అక్కడ విఫలమైనా నిరాశ చెందకుండా మళ్లీ పూర్తిస్థాయిలో సాధన మొదలు పెట్టి 2021లో ఏపీజీవీబీలో ఉద్యోగానికి ఎంపికైంది. బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేరైంది. ఎంతో కష్టపడి మొత్తానికి బ్యాంకు ఉద్యోగ సాధించింది. ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం ఓడిపోయిందని నిరూపించింది.
బ్రెయిలీ డే ఎందుకు.?
జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ రోజు. అంధులకు ఆపద్భాంధవుడు లూయీ బ్రెయిలీ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జనవరి 4, 1809లో లూయీ బ్రెయిలీ జన్మించారు. బ్రెయిలీ పుట్టినరోజునే ఆయన పేరునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సంగా రూపొందింది. అంధుల కళ్లల్లోను.. జీవితాల్లోను వెలుగులు నింపిన మహనీయుడు లూయీ బ్రెయిలీ.
ఏం చేశాడు.?
అంధులు సులువుగా చదువుకోవడం కోసం ఏదైనా చేయాలని పరితపించారు బ్రెయిలీ. పగలు ప్రెఫెసర్ గా పనిచేస్తూ.. రాత్రిళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషిచేశాడు. అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కులుగా ఉండాలని లూయీ భావించాడు. 1821లో చార్లెస్ బార్బియర్ అనే సైనిక అధికారి చీకట్లోనూ తన సైనికులు తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 చుక్కల సంకేత లిపిని తయారుచేసాడని తెలుసుకున్న లూయిస్ 12 చుక్కలను ఆరు చుక్కలకు కుదించి అవసరమైన రీతిలో అక్షరాలను, పదాలను, సంగీత గుర్తులను చదివేలా ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించాడు.