అదేం రంగుల ప్రపంచం కాదు.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న టెక్కీలు ..
సాఫ్ట్‌వేర్ రంగం అంటేనే అదొక అద్భుతమైన కలల ప్రపంచంగా ఊహించుకుంటారు కొందరు. ఇక అందులో పనిచేసే ఉద్యోగుల గురించి బయట ఎలాంటి టాక్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
దిశ, ఫీచర్స్ : సాఫ్ట్‌వేర్ రంగం అంటేనే అదొక అద్భుతమైన కలల ప్రపంచంగా ఊహించుకుంటారు కొందరు. ఇక అందులో పనిచేసే ఉద్యోగుల గురించి బయట ఎలాంటి టాక్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఐదంకెలకు మించిన జీతం, ఆనంద మయ జీవితం, వారానికి ఐదు రోజులే పని, ఇక వారికేం తక్కువ అనుకుంటాం. అయితే వాస్తవం మాత్రం మరోలా ఉంటుందని, అనుకున్నంత సానుకూలంగా ఏమీ ఉండదని, అదంతా అపోహ మాత్రమేనని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఆ రంగం గురించి అవగాహన ఉన్న నిపుణులు చెప్తున్నారు. పైగా ఇండియన్ టెక్కీస్ హెవీ వర్క్ బర్డెన్, మెంటల్ స్ట్రెస్ ఎదుర్కొంటున్నట్లు ఇటీవల అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి.
గంటల తరబడి ఓకేచోట కూర్చోవడం, ఎక్కువసేపు స్ర్కీన్లవైపు చూడటం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో అనారోగ్యాలకు కారణం అవుతోంది. కదలికలేని జీవనశైలిక కారణంగా సుమారు 43 శాతం మంది భారతీయ టెక్కీలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వెన్నునొప్పి, నిద్రలేమి వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని వారికి హెల్త్ కేర్ బెనిఫిట్స్ అందించే ‘ష్యూరిటీ వన్’ అనే సంస్థ నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయన కర్తల ప్రకారం.. మనదేశంలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో దాదాపు 50 శాతం మంది వారానికి 52 గంటల పాటు పనిచేస్తున్నారు. ఇక టెక్ నిపుణుల్లో కనీసం 55 శాతం మంది అర్ధరాత్రుళ్లు కూడా వర్క్‌లో ఉంటూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. మొత్తానికి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో 72 శాతం మంది మెంటల్ స్ట్రెస్‌తో పాటు ఎసిడిటీ, మెటబాలిజం ఇష్యూస్, బ్యాక్ పెయిన్, మైగ్రేన్, నెక్ పెయిన్, నిద్రలేమి, కండరాల గట్టిగా మారడం, కంటి చూపు తగ్గడం, అధిక బరువు పెరగడం, డయాబెటిస్, యాంగ్జైటీస్, డిప్రెషన్, గుండె జబ్బులు వంటి అనారోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.