Money is happiness : డబ్బే సర్వస్వం.. ఆనందాన్నీ కొనవచ్చు..!!
Money is happiness : డబ్బే సర్వస్వం.. ఆనందాన్నీ కొనవచ్చు..!!
దిశ, ఫీచర్స్ : ఎంత డబ్బుంటే ఏం లాభం? మనశ్శాంతిని కోనుక్కోలేం.. ఆనందాన్ని ఆస్వాదించలేం.. అంటుంటారు పెద్దలు. అంతేకాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఓ నమ్మకం కూడాను. కానీ ఒక తాజా అధ్యయనం మాత్రం దీనిని సవాలు చేస్తూ.. కొత్త అంశాన్ని ముందుకు తెచ్చింది. డబ్బు నుంచి వచ్చే ఆనందం తాత్కాలికమనే విషయాన్ని కొట్టి పారేసింది. డబ్బు నుంచి పొందే ఆనందం ఏ కొద్ది రోజులేనని, 60 ఏండ్ల వయస్సు తర్వాత ఆగిపోతుందని ప్రచారంలో ఉన్న ప్రజల నమ్మకాన్ని సవాలు చేసింది. సమాజంలో బతకాలంటే డబ్బే ముఖ్యమని, డబ్బుంటే హ్యాపీనెస్‌ను సైతం కొనగలమని పేర్కొన్నది. పైగా పెరిగిన ఆదాయం మరింత శ్రేయస్సుతో, ఆనందంతో ముడిపడి ఉంటుందని వెల్లడించింది.
ఒక మనిషికి జీవితంలో ఏం కావాలి? కనీస అవసరాలు తీరితే చాలు అనుకుంటాం. కానీ ఆ కనీస అవసరాలు తీరాలన్నా డబ్బే కావాలి. అయితే ఒక మనిషి లేదా ఒక కుటుంబం సంవత్సరానికి రూ. 67.5 లక్షల($75,000) ఆదాయం పొందే పరిస్థితి వచ్చాక ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబంలో డబ్బు ప్రాధాన్యత తగ్గిపోతుందని కొందరు నమ్ముతుంటారు. 2010లో డేనియల్ కాహ్నెమాన్, అలాగే ఆంగస్ డీటన్ పరిశోధన కూడా డబ్బు ఆనందాన్ని, మనశ్శాంతిని ఇవ్వలేదని పేర్కొన్నది. కానీ 2021లో మాథ్యూ కిల్లింగ్స్ వర్త్ (Matthew Killingsworth) అనే ఆర్థిక నిపుణుడు, పరిశోధకుడు దీనిని సవాలు చేశాడు. డబ్బుంటేనే మనిషికి మేలు జరుగుతుందని, డబ్బు అవసరం లేదనే మాట మనం సమాజానికి సూచించ కూడదని పేర్కొన్నాడు.
రీసెంట్‌గా ఫోర్బ్స్‌లో పబ్లిషైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం కూడా డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటామని పేర్కొన్నది. అంతేకాకుండా డబ్బు నుంచి వచ్చే ఆనందం సంవత్సరానికి రూ. 67.5 లక్షల($75,000) ఆదాయం పొందడం ప్రారంభమైన తర్వాత ఆగిపోతుందనే విషయాన్ని వ్యతిరేకించింది. అధ్యయనంలో భాగంగా 33,000 మంది అమెరికన్లు సహా వివిధ దేశాలకు చెందిన ప్రజలు, ఆదాయ వనరుల డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు. డబ్బుతో ఆనందాన్ని కొనలేమనే ప్రజాదరణ పొందిన నమ్మకాన్ని వీరు వ్యతిరేకించారు. పైగా పెరిగిన ఆదాయం మరింత ఆనందం, మానవ శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని వెల్లడించారు. ప్రజల్లో ఆదాయాలు పెరిగే కొద్దీ రోజువారీ ఆనందం, మొత్తం జీవిత సంతృప్తి రెండూ మెరుగు పడతాయని స్పష్టం చేశారు.