తక్కువ వ్యాయామంతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు.. కేవలం మహిళలకే అలా..
స్త్రీ, పురుషులు ఒకే తరహా వ్యాయామం చేసినప్పటికీ బెనిఫిట్స్ మాత్రం ఇరువురికీ భిన్నంగా ఉంటాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తక్కువ వ్యవధి కలిగిన ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల కూడా మహిళలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
దిశ, ఫీచర్స్ : స్త్రీ, పురుషులు ఒకే తరహా వ్యాయామం చేసినప్పటికీ బెనిఫిట్స్ మాత్రం ఇరువురికీ భిన్నంగా ఉంటాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తక్కువ వ్యవధి కలిగిన ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల కూడా మహిళలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇక పురుషులు వీరితో పోల్చినప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఎక్కువ శారీరక శ్రమ లేదా వ్యాయామాలు అవసరం అవుతాయని ష్మిత్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. స్త్రీలలో కార్డియో వాస్క్యులర్ మరణాల రిస్క్ కూడా పురుషులతో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గుతోందని చెప్తున్నారు.
24 శాతం తగ్గుతున్న రిస్క్
స్టడీలో భాగంగా యూఎస్‌లోని 4 లక్షల మంది అడల్ట్స్‌కు సంబంధించిన లాంగ్ టెర్మ్ ఫిజికల్ యాక్టివిటీ లెవల్స్ డేటాను పరిశోధకులు పరిశీలించారు. ఇందులో రెండు దశాబ్దాలకు సంబంధించిన మరణాలకు దారితీసిన హెల్త్ డేటాను కూడా ట్రాక్ చేశారు. ఈ సందర్భంగా పురుషులతో పోల్చినప్పుడు మహిళలు తక్కువ శారీరక శ్రమ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా వ్యాయామం చేయని మహిళలతో పోల్చినప్పుడు, శారీరక శ్రమ తీవ్రత లేదా వ్యవధితో సంబంధం లేకుండా ప్రతి వారం ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీస్‌లో నిమగ్నయ్యే మహిళల్లో అనారోగ్య కారణాల వల్ల సంభవించే మరణాల ప్రమాదం కూడా 24% వరకు తగ్గుతుందని నిపుణులు కనుగొన్నారు. పురుషుల విషయానికి వస్తే మాత్రం ఇదే తగ్గింపును సాధించడానికి హయ్యర్ లెవల్ యాక్టివిటీస్ అవసరం అవుతున్నాయి.
ఎందుకని ఈ తేడాలు?
వ్యాయామాలకు సంబంధించిన పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి స్త్రీ, పురుషుల్లో సమానమైన యాక్టివిటీస్ అవసరం లేదని, డిఫరెంట్ లెవల్స్ అవసరమని నిపుణులు చెప్తున్నారు. పురుషులు వారానికి ఐదు గంటల కార్డియో వ్యాయామం వల్ల బెనిఫిట్స్ పొంద గలిగితే, మహిళలు కేవలం రెండు గంటకంటే ఎక్కువసేపు మితమైన-శక్తివంతమైన వ్యాయామాలతోనే అటువంటి ఫలితాలను పొందుతున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. స్త్రీలు వ్యాయామం చేసేటప్పుడు పురుషులతో పోల్చినప్పుడు ఎక్కువ వాస్క్యులర్ కండక్టెన్స్ కలిగి ఉంటారు. మహిళల అస్థిపంజర కండరాల యూనిట్‌కు సున్నితమైన రక్త నాళాలు అధికంగా విస్తరించి ఉండటం, వాస్క్యులర్ సిస్టంలో కూడా అతి చిన్న రక్తనాళాలు ఎక్కువగా ఉండటం, అవి శరీర వ్యవస్థలోని కణాలకు రక్తం, పోషకాలు, ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో కీలకపాత్ర పోషించడం ఈ విధమైన ఆరోగ్య ప్రయోజనాలకు కారణం అవుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.