రాగి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి.. పట్టు వస్త్రాలతో ముస్తాబు చేసి..

లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు.

Update: 2024-02-22 07:26 GMT

దిశ, చంద్రగిరి : లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు. ఇది వింత కాదు ఇక్కడ ఆచారం. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్తమ్మ గుడి వద్ద భారీ రావిచెట్టు వేప చెట్టు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ముత్యాలయ్య పద్మావతమ్మల దంపతులు గత 18 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రెండు చెట్లను శివపార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం రావి చెట్టును శివుడిగా వేప చెట్టును పార్వతి దేవిగా పట్టుబట్టలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ గ్రామ ప్రజల శివనామ స్మరణలతో కల్యాణోత్సవం కనుల పండువగ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.

 ఈ వివాహతంతుకు ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులిగోరు మురళీకృష్ణ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి హాజరై మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయడం సంతోషంగా ఉందన్నారు. మన హైందవ సంస్కృతిలో రావి, వేప చెట్లకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఈ రెండు చెట్లు సాక్షాత్తు దైవ స్వరూపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వేదాంతపురం అగ్రహారం గ్రామస్తులు ముత్యాలయ్య పద్మావతమ్మ దంపతులు, వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ధర్మకర్త కొండే చెంగారెడ్డి, ముని రామయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శి,వ మునెమ్మ ,వెంకట ముని, చిన్న తదితరులు పాల్గొన్నారు.


Similar News