ఇండియాలో 200 ఏండ్ల నాటి నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్..

ఒకప్పుడు ఒక మనిషి నుంచి మరో మనిషికి సమాచారం అందాలంటే ప్రత్యేకంగా ఒక మనిషి వారి దగ్గరికి పోవాల్సి వచ్చేది.

Update: 2024-04-27 08:48 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఒక మనిషి నుంచి మరో మనిషికి సమాచారం అందాలంటే ప్రత్యేకంగా ఒక మనిషి వారి దగ్గరికి పోవాల్సి వచ్చేది. తర్వాత మెల్లిగా టెలిగ్రాం, ఉత్తరాలు పంపడం ప్రారంభం అయ్యింది. ఇక ప్రస్తుతం ఉత్తరాల యుగం ముగిసి ప్రజలు ఫోన్ ద్వారా నిమిషాల వ్యవధిలో ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతున్నారు. అయినా మనం ఏదో ఒక పని కోసం ఇప్పటికీ పోస్ట్‌ని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే సాధారణంగా పోస్టాఫీసులు కాలనీల మధ్యలో ఉంటాయి. కానీ ఇప్పుడు నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. ఏంటి నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్ అని ఆశ్చర్యపోతున్నారు కదా. మరి దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమిపై స్వర్గం అని పిలిచే కాశ్మీర్‌లో ప్రజలు శ్రీనగర్ రత్నంగా పిలిచే దాల్ సరస్సు అందాలను చూస్తూనే ఉంటారు. మీరు ఈ సరస్సులో అనేక షికారాలను అంటే హౌస్‌బోట్‌లను చూడవచ్చు. ప్రజలు ఈ షికారాల్లో కూర్చొని దాల్ సరస్సును సందర్శిస్తారు. దాల్ సరస్సులోనే మీరు తేలియాడే పోస్ట్ ఆఫీస్ ని కూడా చూడవచ్చు. దీన్ని హౌస్ బోట్ మీద నిర్మించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇది కేంద్రంగా ఉంటుంది.

ఈ పోస్ట్ ఆఫీస్ 200 ఏళ్ల నాటిది..

దాల్ లేక్‌లో తేలియాడే పోస్టాఫీసు గురించి చెప్పాలంటే ఈ పోస్టాఫీసు బ్రిటిష్ పాలనలో నిర్మించారు. దీని వయస్సు సుమారు 200 సంవత్సరాలు ఉంటుంది. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఏకైన తేలియాడే పోస్ట్ ఆఫీస్. ఇందులో రెండు గదులు ఉన్నాయి. ఒకటి పోస్టాఫీసు సంబంధిత పనుల కోసం, మరొక గది మ్యూజియం.

మెయిల్ ఎలా పంపిణీ చేస్తారు ?

నేటికీ దాల్ సరస్సులో ఉన్న ఈ పోస్టాఫీసు నుండి క్రమం తప్పకుండా పార్సెల్‌లు పంపిణీ చేస్తారు. వాస్తవానికి, దాల్ సరస్సులో అనేక హౌస్‌బోట్‌లను చూడటం సర్వసాధారణం, అందులో పర్యాటకులు కూడా ఉంటారు. ఇక్కడ, హౌస్‌బోట్‌లలో నివసించే స్థానిక ప్రజలకు పోస్టల్ సర్వీస్ కూడా అందిస్తున్నారు. షికారాలో కూర్చున్న వ్యక్తులకు పోస్ట్‌మెన్ వారి మెయిల్‌ను అందజేస్తారు.

'ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్' అని ఎప్పుడు పేరు పెట్టారు..

బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీసు పరిస్థితి శిథిలావస్థకు చేరుకోగా 2011లో అప్పటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జాన్ శామ్యూల్ చైతన్యం నింపి మళ్లీ సజావుగా నడపాలని నిర్ణయించారు. ఇంతకుముందు దీనిని నెహ్రూ పోస్టాఫీస్ అని పిలిచేవారు. కానీ 2011లో ఈ హెరిటేజ్ పోస్టాఫీసుకు 'ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్' అని పేరు పెట్టారు.

Tags:    

Similar News