దిశ, ఫీచర్స్ : 'స్పెర్మ్ డొనేషన్' కాన్సెప్ట్ కొత్తదేం కాదు. కృత్రిమ గర్భధారణ లేదా ఇతర 'సంతానోత్పత్తి చికిత్స'లో భాగంగా పురుషుడి లైంగిక భాగస్వాములు కాని స్త్రీ లేదా స్త్రీలు అతని స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చవచ్చు. తన వీర్యం ద్వారా పుట్టిన ప్రతి బిడ్డకు సదరు దాతనే జీవసంబంధమైన తండ్రిగా ఉంటాడు. కానీ తనకు చట్టపరమైన హక్కులు ఉండవు. ఈ మేరకు యూకేకు చెందిన 66 ఏళ్ల క్లైవ్ జోన్స్.. తాను 'ప్రపంచంలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ స్పెర్మ్ డోనర్'గా పేర్కొన్నాడు. గత ఎనిమిదేళ్లలో వీర్యదానం ద్వారా 138 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆ స్పెర్మ్ డోనర్.. ఇంకా ఎంత మందినైనా కనేందుకు సిద్ధం అంటున్నాడు.
నాలుగేళ్ల కిందట టీచర్‌గా పదవీ విరమణ పొందిన క్లైవ్ జోన్స్.. 58 ఏళ్ల వయసులో తొలిసారి స్పెర్మ్ డోనర్‌గా మారాడు. యూకే చట్టాల ప్రకారం జోన్స్ అధికారిక వీర్య దాత కాదు. ఇందుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు కావడంతో.. అతను ఫేస్‌బుక్ ద్వారా పిల్లల్ని కనలేని వ్యక్తులను సంప్రదించడం మొదలుపెట్టాడు. అలా మొదలైన ప్రస్థానం ఆటంకం లేకుండా కొనసాగుతూ ఇప్పటి వరకు 129 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్‌ను చేసింది. మరో తొమ్మిది మంది త్వరలోనే పుట్టనున్నారు. అయితే ఇంకొన్నాళ్ల పాటు స్పెర్మ్ డొనేషన్ చేస్తానంటున్న క్లైవ్.. 150 మందికి జన్మనిచ్చిన తర్వాతే డోనర్ ప్రొఫెషన్‌కు వీడ్కోలు పలుకుతానని పేర్కొన్నాడు.
'బహుశా నేను ప్రపంచంలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ స్పెర్మ్ డోనర్ కావచ్చు. యూకేలోని క్లినిక్స్, స్పెర్మ్ వ్యాపారుల గురించి నాకు తెలుసు. వారు వీర్యాన్ని విక్రయిస్తారు తప్ప డోనర్స్‌గా వ్యవహరించారు. కానీ నేను ఉచితంగానే అందిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రయాణ ఖర్చులకు డబ్బులు తీసుకుంటాను. ఈ విధంగా కొంతమంది సంతాన కల నెరవేర్చడం ఆనందంగా ఉంది. నాకు వచ్చే సందేశాలు సహా తల్లిఒడిలో నవ్వుతున్న శిశువుల ఫొటోలు చూసినపుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేను' అని క్లైవ్ జోన్స్ అన్నాడు.