చెత్తకుప్పకు చేరనున్న 500 కోట్ల మొబైల్ ఫోన్లు.. ఈ ఏడాదే ముహూర్తం?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న 16 బిలియన్ ఫోన్లలో ఐదు బిలియన్లకు పైగా ఫోన్లు 2022లో వేస్టేజ్‌గా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న 16 బిలియన్ ఫోన్లలో ఐదు బిలియన్లకు పైగా ఫోన్లు 2022లో వేస్టేజ్‌గా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ప్రమాదకర మెటీరియల్ ఉన్నందున రీసైక్లింగ్ ప్రాసెస్ కోసం పిలుపునిస్తున్నారు. WEEE రీసెర్చ్ కన్సార్టియం ప్రకారం, వాడుకలో లేని ఈ ఫోన్లను ఒకదానిపై ఒకటి పేర్చినప్పుడు అవి 50,000 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్థాయి కంటే దాదాపు వంద రెట్లు ఎక్కువని తెలుస్తోంది.
ఫోన్లలో బంగారం, రాగి, వెండి, పల్లాడియం వంటి విలువైన పదార్థాలతో పాటు ఇతర రీసైక్లబుల్ మెటీరియల్ ఉంటుంది. అయినప్పటికీ వీటిలో చాలా వరకు నిల్వ ఉంచడం, డంప్ చేయడం లేదా కాల్చడం వలన గణనీయమైన ఆరోగ్య నష్టాలు తలెత్తడం సహా పర్యావరణానికి హాని కలుగుతుంది. 2020 గ్లోబల్ ఇ-వేస్ట్ మానిటర్ ప్రకారం, ఏటా ఉత్పత్తి చేయబడే, రీసైకిల్ చేయబడని 44.48 మిలియన్ టన్నుల గ్లోబల్ ఇ-వ్యర్థాల ఐస్‌బర్గ్‌లో ఈ పనికిరాని ఫోన్లు చిన్న పార్ట్ మాత్రమే.
జూన్ నుంచి సెప్టెంబరు 2022 వరకు ఆరు యూరోపియన్ దేశాల్లో జరిపిన సర్వే ఆధారంగా.. కుటుంబాలు, సంస్థలు పాడైన తమ ఫోన్లను మరమ్మతు లేదా రీసైక్లింగ్ కోసం తీసుకురావడానికి బదులుగా డ్రాయర్స్, అల్మారాలు లేదా గ్యారేజీల్లో మరచిపోతున్నారు. ప్రతి ఐరోపా కుటుంబం.. ఒక్కో వ్యక్తికి కనీసం ఐదు కిలోల ఇ-డివైజ్‌లను నిల్వ చేస్తోంది. కొత్త ఫలితాల ఆధారంగా చేసిన సర్వేలో 8,775 కుటుంబాల్లో 46 శాతం మంది ఎలక్ట్రానిక్స్ నిల్వ చేసేందుకు అనేక కారణాల్లో సంభావ్య వినియోగాన్ని ఒకటిగా పరిగణించారు. 15 శాతం మంది వాటిని విక్రయించడానికి లేదా వేరొకరికి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిల్వ ఉంచారు. 13 శాతం మాత్రం 'సెంటిమెంటల్ వాల్యూ' కారణంగా దాచారు.
'ఈ వస్తువులన్నింటికీ చాలా విలువ ఉందని ప్రజలు గుర్తించరు. పైగా ప్రపంచ స్థాయిలో వీటి పరిమాణం చూసుకుంటే ఆ విలువ మరింత ఎక్కువ. కానీ అధిక ఖర్చు కారణంగా ఇ-వ్యర్థాలు స్వచ్ఛందంగా సేకరించబడవు. అందుకే తప్పనిసరిగా చట్టం అవసరం' అని పాస్కల్ లెరోయ్, WEEE ఫోరమ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.