Glowworm Caves : మెరిసే నక్షత్రాలతో అలరిస్తున్న మాయా గుహలు..! అక్కడ ఏమున్నదంటే..
Glowworm Caves : మెరిసే నక్షత్రాలతో అలరిస్తున్న మాయా గుహలు..! అక్కడ ఏమున్నదంటే..

దిశ, ఫీచర్స్ : అది ఆకాశం కాదు.. కానీ మెరుస్తున్న నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయ్.. అది హైఫోకసింగ్ లైట్లతో కూడిన డెకరేషన్ కాదు. కానీ.. మెరుపు తీగల వంటి కాంతిధారలు ప్రసరిస్తుంటాయ్.. ఇంతకీ ఏంటది.. అనుకుంటున్నారా? మెరిసే భూ గర్భ గుహలు. చిమ్మ చీకటిలో మిణుగురు పురుగుల వెలుతురులా మిణుకు మిణుకు మంటూ ఆకట్టకుంటాయి కాబట్టి, గ్లోవర్మ్ కేవ్స్ (Glowworm caves) అని కూడా పిలుస్తారు. ప్రధానంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో ఇవి అద్భుతమైన ప్రకృతి దృశ్యంగా భాసిల్లుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ నీలి, ఆకు పచ్చ రంగుల్లో ప్రవహిస్తున్న సెలయేళ్లు కూడా చూడముచ్చటగా ఉంటాయి.
ఎక్కడైనా భూగర్భ గుహలు (Underground caves) చీకటితో నిండి ఉంటాయి. చూడ్డానికి నల్లగా కనిపిస్తుంటాయి. కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలోని గ్లోవర్మ్ గుహలు మాత్రం ఎందుకలా దగా దగా మెరుస్తాయి? నీలి ఆకు పచ్చరంగు(blue-green glow)లో ఎందుకని కనిపిస్తుంటాయి? అనే సందేహాలు రావడం సహజమే. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏంటంటే.. ఈ అందమైన అండర్ గ్రౌండ్ గుహలలో బయోలూమినిసెంట్ లార్వాలు (Bioluminescent larvae) అంటే.. ఒక రకమైన మిణుగురు పురుగులు నివసిస్తుంటాయి. ఇవి ఒక విధమైన సీతాకోక చిలుకల మాదిరి కనిపిస్తుంటాయి. అంతేకాకుండా అవి నిరంతరం యాక్టివ్‌గా ఉండటం వల్ల అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తుంటాయి. వీటిని మాయా గుహలు అని కూడా పిలుస్తారు.
బయోలూమినిసెంట్ లార్వాలు (bioluminescent larvae) భూగర్భ గుహల లోపల, బయట రాతిగోడలపై వేలాడుతూ ఉంటాయి. అయితే వీటి శరీరంలోని జీవ రసాయన ప్రతి చర్యల కారణంగా ఈ గుహల్లో కాంతి వెదజల్లుతుంది. ఇది ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థకు కారణం అవుతుంది. అందుకే ఈ గ్లోవర్మ్ గుహలు (Glowworm Claves) నీలి రంగు ఆకాశంలో అందమైన నక్షత్రాల్లా మెరుస్తుంటాయి. ఇక న్యూజిలాండ్‌లోని వైటోమా గుహలు, ఆస్ట్రేలియాలో గల స్ప్రింగ్ నేషనల్ పార్కులోని గుహలలో అయితే పైనుండి కిందకు ఏటవాలుగా ఉండే నిర్మాణాలు మెరిసే కాంతిధారలుగా అలరిస్తుంటాయి. బయోలూమినిసెంట్ లార్వాలు వీటిపై వాలిపోయి ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. అంతే కాదు ఈ గుహల లోపలి భాగంలో నీటి ప్రవాహాలు సైతం ఉంటాయి. ఇవి కూడా నీలి ఆకు పచ్చ రంగులతో మెరుస్తూ అలరిస్తుంటాయి. వీటిని చూడ్డానికి పర్యాటకులు తెగ ఆసక్తి చూపుతుంటారు.