20 నిమిషాల్లో కొత్త చికిత్స.. జ్ఞాపకశక్తి తిరిగి పొందొచ్చు!

దిశ, ఫీచర్స్ : కేవలం 20 నిమిషాల్లో మెమొరీ లాస్‌ను రికవరీ చేయగల ప్రయోగాత్మక చికిత్సను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.

Update: 2022-09-05 08:27 GMT

దిశ, ఫీచర్స్ : కేవలం 20 నిమిషాల్లో మెమొరీ లాస్‌ను రికవరీ చేయగల ప్రయోగాత్మక చికిత్సను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. నాన్-ఇన్వాసివ్‌గా పరిగణిస్తున్న ట్రీట్మెంట్ గురించి తమ పరిశోధన వివరాలను బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ న్యూరోసైన్స్‌లో ప్రచురించారు. అంతేకాదు అల్జీమర్స్, ఇతరత్రా చిత్తవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ కొత్త చికిత్సలు ఎలా సాయపడతాయో వివరించారు. ఎలక్ట్రోడ్స్‌తో కూడిన వేరబుల్ క్యాప్‌(తలకు ధరించే టోపీ)పై ఈ చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా మెదడులోకి విద్యుత్ సంకేతాలను పంపపడం ద్వారా జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపరచవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

'వయోజనుల జనాభా పెరిగేకొద్దీ అదనపు వ్యక్తిగత, సామాజిక, ఆరోగ్య సంరక్షణ సహా ఆర్థిక వ్యయాలకు దారి తీస్తుంది. ఇది ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా భాషను అర్థం చేసుకోవడం వంటి దైనందిన జీవిత కార్యకలాపాలకు అవసరమైన ప్రాథమిక జ్ఞాపకశక్తి వ్యవస్థల్లో బలహీనతకు దోహదపడుతుంది' అని అధ్యయన ప్రధాన రచయిత రాబర్ట్ రెయిన్‌హార్ట్ తెలిపారు.

జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుస్తారు?

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు వరుసగా 4 రోజులు 20 నిమిషాల పాటు ఎలక్ట్రికల్ బ్రెయిన్ స్టిమ్యులేషన్‌ను పొందారు. 20 పదాలు గుర్తుంచుకోవాలని, వెంటనే వాటిని పఠించాలని రోగులకు సూచించారు. లో-ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వర్తింపజేసిన మూడు-నాలుగు రోజుల తర్వాత రోగుల్లో షార్ట్ టర్మ్ మెమొరీ మెరుగవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రభావాలను ఒక నెల తర్వాత చూడవచ్చు. ఇక హై-ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ విషయానికొస్తే.. అప్లయ్ చేసిన రెండోరోజు తర్వాత నుంచే లాంగ్ టర్మ్ మెమొరీ మెరుగుపడి ఒక నెల తర్వాత మంచి ఫలితాలు కనబడతాయి. అంతేకాతు ఈ చికిత్స తర్వాత తక్కువ అభిజ్ఞా పనితీరు గల వ్యక్తుల్లోనూ జ్ఞాపకశక్తి ఇంప్రూవ్ అయింది.

Tags:    

Similar News