ఉక్రెయిన్ శరణార్థుల కోసం 15 ఏళ్ల ఇండియన్ టీన్ సరికొత్త యాప్, ఏంటీ ప్రత్యేకత..?!
ఈ యాప్‌ను అభివృద్ధిచేసింది సెక్వోయా ఇండియా మేనేజర్ కుమారుడు. 15-year-old Indian boy creates app for Ukrainian refugees
దిశ, వెబ్‌డెస్క్ః రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకు పైగా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వాళ్లంతా ఇతర దేశాలలో శరణార్థులుగా మారాల్సి వచ్చింది. అయితే, ఈ శరణార్థులకు సహాయం చేయడానికి, 15 ఏళ్ల ఓ భారతీయ బాలుడు యాప్‌ను రూపొందించాడు. ఉక్రేనియన్ శరణార్థులు వారికి అవసరమైన సహాయాన్ని పొందుకోడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. అయితే, ఈ యాప్‌ను అభివృద్ధిచేసింది సెక్వోయా ఇండియా మేనేజర్ అయిన జి.వి.రవిశంకర్ కుమారుడు తేజస్. అనుభవమున్న మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే యాప్‌ను రూపొందించడానికి నెలల సమయం తీసుకుంటే, తేజస్ మాత్రం ఈ యాప్‌ను కేవలం రెండు వారాల్లోనే సిద్ధం చేయడం విశేషం. తేజస్ రూపొందించిన ఈ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లోనూ అందుబాటులో ఉంది. ఇక, దీని లింక్‌ని తేజస్ స్వయంగా ట్వీట్ చేశాడు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్ తేజస్ రూపొందించిన ఈ యాప్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో శరణార్థులకు సమీపంలో సహాయ స్థావరాలు ఎక్కడున్నాయో సమగ్ర సమాచారం ఉంటుంది. మొత్తం ప్రపంచం మ్యాప్‌లో వీటిని వెతికే అవకాశం ఉంటుంది. జాతీయ గుర్తింపు కార్డు-ఆధారిత ధృవీకరణ సౌకర్యాలు, ఆహారం, బస చేయడానికి సురక్షితమైన స్థలాలు, ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న మందులు వంటి వివిధ అవసరాలను తీర్చడానికి ఓ జాబితా సిద్ధం చేసి, ఇందులో పొందుపరిచారు. ఇక, ఆపదలో ఉన్న వ్యక్తి ఈ యాప్‌ని వినియోగించుకొని, కేవలం రెండు క్లిక్‌లలో సహాయం పొందవచ్చని తేజస్ తన ట్వీట్‌లో రాశాడు. ఈ యాప్ ఇంగ్లీషుతో పాటు 12 ఇతర భాషల్లో కూడా పని చేస్తుంది. ఈ సందర్భంగా తేజస్ తండ్రి జి.వి.రవిశంకర్ తన కుమారుడి విజయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు, ప్రశంసించారు. ఇంతకు మించి కష్టపడాలని కొడుకును కోరాడు.
More power to the younger generation! They decide to not debate but act. Keep building @XtremeDevX!
— G V Ravi Shankar (@gvravishankar) March 31, 2022
Please RT to help create impact! https://t.co/EE8wdGfkbQ