తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. 15 నుంచి రానున్న వరుణుడు

వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చ‌ల్లని క‌బురును అందించింది.

Update: 2023-03-12 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్: వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చ‌ల్లని క‌బురును అందించింది.ఆంధ్రప్రదేశ్, తెల‌ంగాణ‌లో వ‌చ్చే వారం వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి బీహార్ నుంచి ఛత్తీస్ గ‌ఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా విస్తరించి ఉన్నందున ఈ నెల 16 నుంచి 20 వరకు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

ఈ నెల 16న తూర్పు భారతంపై మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం వల్ల గాలుల దిశ మారుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశ మార్చుకుని దక్షిణం నుంచి వీచే అవకాశం ఉందని, ఫలితంగా 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.

మరోవైపు క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా పగటి (గరిష్ఠ) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఐదారు రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో కురిసే వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కోత దశలోనే పంటలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా రైతులకు సూచించారు.

తెలంగాణ‌లోనూ వ‌ర్షాలు..

వ‌చ్చే వారంలో తెలంగాణ‌లోనూ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఛ‌త్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించి ఉండ‌టంతో పాటు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయ‌ని ఐఎండీ బులెటిన్ పేర్కొంది.

Tags:    

Similar News