అమ్మా.. ఆకలైతోంది
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో చిన్న వయసులోనే తల్లి దండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు అమ్మా ఆకలి అంటూ ఏడుస్తున్న సంఘటన స్థానికులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే, నిరుపేద చేనేత కార్మికులు అయిన తాటి మల్లయ్య- పద్మమ్మ దంపతుల కూతురు శారదను గుండాల మండలం పెద్ద పడిషాల గ్రామానికి చెందిన నామాల సోమయ్యకు 18 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. శారద (35) గత 8 సంవత్సరాల క్రితం […]
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో చిన్న వయసులోనే తల్లి దండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు అమ్మా ఆకలి అంటూ ఏడుస్తున్న సంఘటన స్థానికులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే, నిరుపేద చేనేత కార్మికులు అయిన తాటి మల్లయ్య- పద్మమ్మ దంపతుల కూతురు శారదను గుండాల మండలం పెద్ద పడిషాల గ్రామానికి చెందిన నామాల సోమయ్యకు 18 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. శారద (35) గత 8 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తరువాతి సంవత్సరమే సోమయ్య (40) కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో వీరి కుమారుడు సతీష్, కుమార్తె నాగలక్ష్మీ అనాథలుగా మారారు. వారికి ఎటువంటి ఆస్థిపాస్తులు లేకపోవడమే కాదు.. తండ్రి తరుఫు బంధువులెవరూ కూడా వీరిని ఆదరించలేదు. వృద్ధ దంపతులైన అమ్మమ్మ-తాతయ్యలే వీరిని అక్కున చేర్చుకున్నారు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కూపన్స్ ఇచ్చే క్రమంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ వృద్ధ దంపతులకు రేషన్ కార్డు జారీ చేయలేదు. దీంతో వీరి పరిస్థితి పూట గడవటం కూడా కష్టంగా మారింది. అయినా కూడా ఆ పిల్లలను హాస్టల్లో చేర్పించి చదివిస్తున్నారు. కరోనా కారణంగా హాస్టల్స్ మూతపడడంతో ఆ పిల్లలు అమ్మమ్మ-తాత వద్దే ఉంటున్నారు. ఆ వృద్ధ దంపతులది కడుపేదరికం, పైగా వారికి కళ్ళు కనిపించవు. దీంతో ప్రస్తుతం ఈ పిల్లలకు తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆ పిల్లల బాధను చూడలేక ఇరుగుపొరుగువారే అప్పుడప్పుడు అన్నం పెడుతున్నారు. ఇలా అనాథలుగా మారిన ఈ పిల్లలను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.
బియ్యం, నగదు సాయం
ఆకలితో బాధపడుతున్న ఈ చిన్నారులు, వృద్ధ దంపతులకు మోత్కూరుకు చెందిన మీడియా మిత్రులు అనిల్ (ఈటీవీ,), పోతు గంటి శంకర్(దిశ న్యూస్), పంజాల శ్రీనివాస్ (సి వి ఆర్), ప్రదీప్ శర్మ (మన తెలంగాణ), శ్రీహరి (నెం 1tv) , కనకయ్య, ప్రసాద్ (ప్రైమ్ 9) లు కలిసి 175 కిలోల బియ్యాన్ని అందించారు. ప్రదీప్ శర్మ బియ్యంతో పాటు రూ. 2 వేల నగదును వారికి అందజేశారు.