కిషన్‌రెడ్డికి పెద్ద చెరువు గుర్తొస్తలేదు
దిశ , ఇబ్రహీంపట్నం: పెద్ద చెరువు.. వేల రైతుల చిరునవ్వు.15,00 ఎకరాల ఆయకట్టు. మూడు వేల మంది మత్స్యకారులకు ఆదెరువు. టీఎంసీ నీటి నిల్వ. వంద గ్రామాల భూగర్భ దప్పిక తీర్చే వనరు. ఇది నాటి చరిత్ర. కానీ నేడు.. ఎడారి. నీటి చుక్కా లేక చెరువు చెమ్మగిల్లుతోంది. పాలకులు హామీలివ్వడమే కానీ నీటిని తీసుకొచ్చే పని ఏనాడూ చేయలేదు. ఇరవై నాలుగు ఏళ్ల క్రితం నిండు కుండలా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఫిరంగి కాలువ […]
దిశ , ఇబ్రహీంపట్నం: పెద్ద చెరువు.. వేల రైతుల చిరునవ్వు.15,00 ఎకరాల ఆయకట్టు. మూడు వేల మంది మత్స్యకారులకు ఆదెరువు. టీఎంసీ నీటి నిల్వ. వంద గ్రామాల భూగర్భ దప్పిక తీర్చే వనరు. ఇది నాటి చరిత్ర. కానీ నేడు.. ఎడారి. నీటి చుక్కా లేక చెరువు చెమ్మగిల్లుతోంది. పాలకులు హామీలివ్వడమే కానీ నీటిని తీసుకొచ్చే పని ఏనాడూ చేయలేదు. ఇరవై నాలుగు ఏళ్ల క్రితం నిండు కుండలా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఫిరంగి కాలువ (రాచకాలువ), పెద్దవాగు ఈ రెండు కబ్జాలకు గురికావడంతో నీరులేక తన అస్థిత్వాన్ని కోల్పోతూ వస్తుంది.
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు క్రీ.శ.1555 లో 1,250 ఎకరాల ఆయకట్టుతో నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ చెరువు జిల్లాలోనే అతిపెద్దది. వర్షాలు బాగా కురిస్తే సుమారు టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. ఈ చెరువులో పుష్కలంగా నీళ్లు ఉంటే చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలకు కొదువ ఉండదు. ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఉన్నతంగా బతికేవారు. ఎంతో గొప్ప లక్ష్యంతో నిర్మించిన ఈ చెరువు నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆనవాళ్లు లేకుండా పోతున్నది. ఫిరంగి కాలువను 1872లో నిజాం ప్రభువు ఫ్రెంచ్, ఇంగ్లాండ్ ఇంజినీర్ల సాయంతో నిర్మాణాన్ని చేపట్టినట్లు సమాచారం. కాలువ నిర్మాణంలో రాళ్లు అడ్డుగా వస్తే మందుగుండుతో పేల్చి నిర్మాణాన్ని కొసాగించినందుకు ఈ కాలువకు ఫిరంగి కాలుగా పేరు స్థిరపడినట్లు పెద్దలు చెబుతున్నారు.
ఈసీ నది నుంచి…
షాబాద్ మండలం చందన్‌వెళ్లి గ్రామానికి తూర్పు- ఈశాన్య దిశలో ఈసీ నది ప్రవహిస్తోంది. చేవెళ్ల, షాబాద్ మండలాల సరిహద్దుల్లో ఈ నదిపై సుమారు రెండు పర్లాంగుల పొడవున ఫిరంగి కాలువ ఆనకట్టను నిర్మించారు. ఈసీ నది నుంచి నీటిని ఫిరంగి కాలువకు మళ్లించేందుకు పెద్ద పెద్ద రాళ్లు, సున్నం డంగు, ఇసుకను కలిపి 48 మీటర్ల వెడల్పుతో అత్యంత పటిష్టంగా సుమారు మీటరు ఎత్తున కరకట్టను నిర్మించారు. కరకట్ట ద్వారా ఫిరంగి కాలువకు నీటిని మళ్లించగా మిగిలినవి హైదరాబాద్నగరానికి తాగు నీరందించే హిమాయత్‌సాగర్‌కు చేరుతుంది. చందనవల్లి శివారు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వరకు 85 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మాణాన్ని పూర్తిచేశారు. షాబాద్ మండలంలో ప్రారంభమైన కాలువ శంషాబాద్, రాజేంద్రనగర్ మున్సిపాలిటీ, సరూర్‌నగర్ మండలాల ద్వారా ఇబ్రహీంపట్నం చెరువులో కలిసి ముగుస్తుంది. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 1500 చెరువులు, కుంటలు, నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సమృద్ధిగా పండించేందుకు ఈ నిర్మాణం చేపట్టారు.
చెరువులను నింపుతూ..
ఫిరంగి కాలువతో షాబాద్ మండలంలోని చందనవల్లి చెరువు, సోలిపేట్ పెద్ద చెరువు, శంషాబాద్ మండల పరిధిలోని రామాంజపూర్ సమీపంలోని మద్దూరుకుంట, పాలమాకుల చెరువు, శంషాబాద్ చెరువు, హయత్‌నగర్ చెరువు, ఇంజాపూర్ చెరువు, తుర్కెంజాల్ సమీపంలోని కొత్త చెరువు, తుక్కుగూడ చెరువులతో పాటు ఇబ్రహీంపట్నం చెరువులను నీటితో నింపేవారని, ఈ నీటిని ఇబ్రహీంపట్నం చెరువుకు కాలువ ద్వారా చేరవేసే లోపే చందనవల్లి వద్ద నిర్మించిన కరకట్ట తెగిపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని పెద్దలు చెబుతున్నారు.
కబ్జా కోరల్లో కాలువ
వేలాది ఎకరాలకు సాగు నీరు, గ్రామాలకు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ఫిరంగి, పెద్ద కాలువ నేడు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 1967 వరకు ఫిరంగి కాలువ ద్వారా కొన్ని చెరువులు జలకళతో ఉట్టిపడ్డాయి. కాలువ పూడుకు పోకముందు వేలాది ఎకరాలకు సాగునీరు అందించినా ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్ ఎస్టేట్ దెబ్బ తగిలింది. భవిష్యత్నీటి అవసరాలు తీర్చేందుకు నాటి పాలకులు ముందుచూపుతో నిర్మించిన చెరువులు, కుంటలు సైతం నేడు కనుమరుగవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎంలు చంద్రబాబు నాయుడు, వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చెరువులకు నీళ్లు వచ్చేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. తర్వాత పట్టిచుకున్న పాపాన పోలేదు. ప్రత్యేక రాష్ర్టంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఫిరంగి కాలువను కబ్జా కోరల నుంచి విడిపించే విషయంలో విఫలమైందని స్థానిక నాయకులు అంటున్నారు.
గెలిచి.. మాట మరిచి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాని, పెద్ద చెరువు నింపుతాననే ఎజెండాతో ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచారు. నెగ్గి రెండు సంవత్సరాల దాటినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. చెరువులో నీరు తెవడం పక్కన పెడితే మిషన్ కాకతీయ పేరుతో చెరువులో మట్టిని అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినవిస్తున్నాయి. ఇకనైనా ఇబ్రహీంపట్నం ప్రజలకు ఎన్నికల్లో గెలిస్తే పెద్ద చెరువు నింపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.
జేబులు నింపుకున్నరు : మల్ రెడ్డి రంగారెడ్డి , మాజీ ఎమ్మెల్యే
చెరువు నింపుతామని చెప్పిన ఎమ్మెల్యే తన జేబులు నింపుకున్నారు. ఇప్పటి వరకూ పెద్ద చెరువుకు నీళ్లను తేలేకపోయాడు. 2015 మే నెలలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నిలుపుకోలేదు. పెద్ద చెరువు నింపి రైతులు, మత్స్యకారులకు ఉపాధి కలిగేలా చూడాలి.
మత్స్య కార్మికులు రోడ్డున పడ్డారు : శంకర్, మత్స్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును నింపితే 3000 మంది మత్స్యకారులకు ఉపాధి ఉంటుంది. చెరువులో నీళ్లు లేకపోవడంతో మత్స్య కార్మికులు రోడ్డున పడ్డారు. చెరువును నింపాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదు.
పంటలు పండడం కష్టంగా ఉంది: ఓనమాల బాల గణేష్, ఆయకట్టు రైతు
పెద్ద చెరువు కట్టకింద నాకు ఎకరంన్నర పొలం ఉంది. ఒక్కప్పుడు చెరువు నీళ్లతోనే పంటలు బాగా పండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ వ్యవసాయం చేయడం కష్టంగా మారడంతో ఇటీవలే బోరు మోటర్ సాయంతో పండిస్తున్న. ఈ మేరకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గడంతో ఉన్న ఈ పొలం పారడం కష్టంగా మరింది.