37వ రోజుకు చేరుకున్న భూనిర్వాసితుల దీక్షలు.. హామీలను వెంటనే అమలు చేయాలి.
దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మాణంలో ఉన్న కిష్టరాయని పల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి ఏడేళ్లయినా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడంతో భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులు జరగకుండా పరిహారం కోసం చేస్తున్న నిరసన దీక్షలు 37వ రోజుకు చేరుకున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో 2 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టులు ముంపునకు […]
దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మాణంలో ఉన్న కిష్టరాయని పల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి ఏడేళ్లయినా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడంతో భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులు జరగకుండా పరిహారం కోసం చేస్తున్న నిరసన దీక్షలు 37వ రోజుకు చేరుకున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో 2 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టులు ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితుల నుండి భూసేకరణ చేపట్టి నష్ట పరిహారం ప్రభుత్వం అందజేసింది. కానీ 7 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నేటికీ అందజేయలేదు. అధికారులు మాత్రం ముంపు గ్రామాల్లో పరిహారం కోసం గ్రామ సభలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించి గ్రామ సభ ఆమోదం తీసుకుంటున్నారు. కానీ నేటికీ ఎక్కడ భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. దీంతో అధికారులపై భూ నిర్వాసితులు మండిపడుతున్నారు.
కిష్ట రాయనిపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన లక్ష్మణా పురం, ఈదుల గండి గ్రామాల వారికి చింతపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ భూమిలో ఇల్లు కేటాయిస్తామని రెండు పర్యాయాలు భూ నిర్వాసితులను అధికారులు నమ్మించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు నేటికీ జారీ కాలేదు. నిర్వాసితులు సైతం గ్రామ సభ ఆమోదం చేసి అధికారులకు అందజేశారు. నేటికీ గ్రామ సభ తీర్మానం మేరకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టడానికి గుత్తేదారు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి భూనిర్వాసితులకు భయభ్రాంతులకు గురి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ముగ్గురు సర్కిల్ ఇన్ స్పెక్టర్లు మారినా గుత్తేదారు మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. భూనిర్వాసితులకు మాత్రం పరిహారం అందించడంలో అధికార పార్టీ నాయకులు విఫలం కావడంతో భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులు కొనసాగనీయకుండా నిరసన దీక్షలు చేపడుతూనే ఉన్నారు. నెల రోజులు దాటినా ఇప్పటికీ జిల్లా మంత్రి కానీ జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భూ నిర్వాసితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే అందజేసి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుంది కానీ తన ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమిటని భూ నిర్వాసితులు మండిపడుతున్నారు.
జిల్లా మంత్రి చర్యలు చేపట్టాలి:
భూ సేకరణ చేసి ఏడేండ్ల గడుస్తున్నా ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కొరకు జిల్లా మంత్రి చర్యలు తీసుకోవాలని భూ నిర్వాసితులు దుగ్గి శకుంతల డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో పది ఎకరాల మాగాణి కోల్పోయాం. రోజువారీగా బయట ఊళ్లకు వెళ్లి కూలీ చేసుకుంటున్నామని తమ సమస్యలకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
డిండి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శిలాఫలకం వేసిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని భూనిర్వాసితులు గడ్డి యాదయ్య డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఇంటికొక ఉద్యోగం, సొంత ఇల్లు, కొల్పోయిన భూమిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలుపై చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టుల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముఖ్యమంత్రి వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విడుదల చేయాలని భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.