భూముల వేలం మై హోం కోసమేనా.. ? ఎక్కడా కనిపించని అంతర్జాతీయ సంస్థలు?

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఉపాధి అవకాశాలకు నిలయంగా బాసిల్లుతోందని చెబుతున్నారు. దేశంలోనే నంబరు 1 సిటీగా వర్ధిల్లుతున్నదని కొనియాడుతున్నారు. దీనిలో భాగంగానే కోకాపేట భూముల వేలం పాటలను ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేశారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తాయని ఆశించారు. అందుకోసం ఈ వేలం నిర్వహణకు వివిధ స్థాయిల్లో పలు రకాల కమిటీలను వేశారు. కానీ వేలంలో ఒక్క జాతీయ కంపెనీ మినహా అన్నీ తెలంగాణకు చెందినవే పాల్గొనడం […]

Update: 2021-07-16 20:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఉపాధి అవకాశాలకు నిలయంగా బాసిల్లుతోందని చెబుతున్నారు. దేశంలోనే నంబరు 1 సిటీగా వర్ధిల్లుతున్నదని కొనియాడుతున్నారు. దీనిలో భాగంగానే కోకాపేట భూముల వేలం పాటలను ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేశారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తాయని ఆశించారు. అందుకోసం ఈ వేలం నిర్వహణకు వివిధ స్థాయిల్లో పలు రకాల కమిటీలను వేశారు. కానీ వేలంలో ఒక్క జాతీయ కంపెనీ మినహా అన్నీ తెలంగాణకు చెందినవే పాల్గొనడం విశేషం. అయితే వేలంలో ఏయే కంపెనీలు పాల్గొన్నాయన్న అంశంపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేటలోని అత్యంత ఖరీదైన 49.951 ఎకరాలను వేలం వేసింది. దీని ద్వారా రూ.2 వేల కోట్లను సమకూర్చుకోనుంది. ఎకరం రూ.25 కోట్ల వంతున అప్ సెట్ బిడ్ అమౌంట్ గా నిర్ణయించారు. అయితే ఈ వేలంలో రూ.31.2 కోట్ల నుంచి రూ.60.2 కోట్ల వరకు పలికింది. కానీ, కోకాపేటలోని ఈ ఎనిమిది ప్లాట్లకు ఎన్ని కంపెనీలు ఈ ఆక్షన్‌లో పాల్గొన్నాయన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు చాలా మంది బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ వేదిక దొరికినా సరే.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరం అంటూ కీర్తిస్తున్నారు. కానీ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన, సదుపాయాలు కలిగిన కోకాపేట భూములను దక్కించుకునేందుకు మాత్రం లోకల్ కంపెనీలే ముందుకొచ్చాయి.

రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రెండు ప్లాట్లు(7.755 ఎకరాలు, 1.65 ఎకరాలు), అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ రెండు ప్లాట్లు(7.738 ఎకరాలు, 8.946 ఎకరాలు), హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఒకటి(ఎకరం), మన్నె సత్యనారాయణరెడ్డి ఒక ప్లాటు(7.721 ఎకరాలు), వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ఒకటి(7.575 ఎకరాలు) వంతున దక్కించుకున్నాయి. ఇవన్నీ తెలంగాణకు సంబంధించనవే. కేవలం ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక ప్లాటు(7.564 ఎకరాలు) దక్కించుకున్నది. ఇదొక్కటే ముంబాయి బేస్డ్ కంపెనీ కావడం గమనార్హం. ఎంత ప్రచారం చేసినా పేరెన్నికగన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వేలం పాటలో ఎందుకు పాల్గొనలేదన్న సందేహాలు కలుగుతున్నాయి.

వారి కోసమేనా?

ఈ వేలం పాటలోని కోకాపేట ఎనిమిది ప్లాట్లల్లో ఏడు లోకల్ వారికే దక్కాయి. అందులోనూ మైహోం సంస్థకు సంబంధించిన కంపెనీలే రెండు ఉన్నట్లు తెలుస్తోంది. అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీసు చిరునామా మాదాపూర్‌లోని మై హోం హబ్‌లోనే ఉంది. దానికి డైరెక్టర్లుగా శ్రీనివాసరావు అరవపల్లి, వినోద్ జూపల్లి, శ్యాంరావు జూపల్లి ఉన్నారు. అలాగే హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీసు కూడా మాదాపూర్‌లోని మైహోం హబ్‌లోనే ఉంది. డైరెక్టర్లుగా శ్రీనివాసరావు అరవపల్లి, శ్యాంరావు జూపల్లి, వినోద్ జూపల్లిలు ఉన్నారు. దీన్ని బట్టి కోకాపేట భూముల వేలం కొన్ని కంపెనీలకే కట్టబెట్టడానికేనా అన్న చర్చ మొదలైంది. మై హోం సంస్థ పేరుతో కాకుండా ఇతర పేర్లతో కూడిన కంపెనీల పేరిట దక్కించుకోవడం గమనార్హం. ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మాత్రమే తెలంగాణయేతర కంపెనీగా తెలుస్తోంది. కొన్ని వారాల పాటు ఈ వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించారు. కానీ ఇతర కంపెనీలు వేలంలో ఎందుకు పాల్గొనలేదో అర్ధం కావడం లేదంటున్నారు.

వరుస భేటీల ప్రయోజనం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని అధికారులు, మంత్రులు ప్రచారం చేశారు. ఇక పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ నేతృత్వంలో పలు విదేశీ బృందాలు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో వరుస భేటీలు జరిగాయి. పలు దేశాల నుంచి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు చర్చలు జరిపారు. రూ.వందలు, రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రకటనలు జారీ చేశారు. కానీ అవసరమైన సందర్భాల్లో మాత్రం ఆ కంపెనీలు వెనుకడుగు వేశాయి. ఏ ఒక్క కంపెనీ కూడా వేలం పాటలో పాల్గొనలేదని సమాచారం. పైగా వేలంలో ప్లాట్లు దక్కించుకున్న సంస్థలు, వ్యక్తుల పేర్లను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎవరెవరూ బిడ్లు దాఖలు చేశారన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది.

తెలంగాణలో భూ వివాదాలు అధికమని ప్రచారంలో ఉంది. 2008లోనూ వైఎస్​రాజశేఖర్​రెడ్డి హయాంలోనూ ఇవే భూములను పూర్వాంకర, డీఎల్ఎఫ్​వంటి ప్రముఖ సంస్థలు వేలం పాటలో దక్కించుకున్నాయి. కానీ కొద్ది రోజులకే ఆ భూములు వివాదంలో చిక్కుకున్నాయి. కొన్నేండ్ల వరకు వారికి స్థలాలు చేజిక్కలేదు. డబ్బులు కట్టిన తర్వాత కూడా క్లియరెన్స్​రాకపోవడంతో ఇబ్బంది పడ్డాయి. పైగా కేసులోనూ ఆ కంపెనీలను ఇరికించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కిరణ్​కుమార్​రెడ్డి హయాంలోనూ మై హోం సంస్థ వేలం పాటలో దక్కించుకున్న స్థలం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఏకంగా గేమింగ్​పార్కుకు శంకుస్థాపన చేసేటప్పుడు మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్​రావు సభలోనే గళమెత్తిన ఉదాహారణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ముందుకు రావడం లేదని రియల్​ఎస్టేట్​వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఆస్తులు అమ్మితే ఆదాయమా?

రియల్ ఎస్టేట్ బ్రోకర్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూములను వేలం వేసి వచ్చిన నగదును ఆదాయంగా నిసిగ్గుగా ప్రకటించుకుంటున్నారని తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ శుక్రవారం విమర్శించారు. ఆస్తులు అమ్ముకుంటే వచ్చిన సొమ్ము ఆదాయం ఎట్లా అవుతుందో గొప్ప పాలకులమని చెప్పుకుంటున్న నాయకులు, అధికారులు ప్రజలకు చెప్పాలన్నారు. అవివేకంగా ప్రపంచంలోనే అత్యధిక ధర ఎకరానికి పలికిందంటూ ఘనంగా చాటుకోవడం విచిత్రంగా ఉందన్నారు.

ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని, నిర్మాణాలు చేసుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పుకుంటున్న ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఇట్లా భూములను అమ్ముకుంటూ పోతే ఇంకేమి మిగులుతుందన్నారు. ఈ పాలకుల చేతిలో అధికారం పిచ్చివాడి చేతిలోని రాయిగా మారి పోయిందన్నారు. ఓట్లు రాల్చే ఉచిత పథకాలను పెట్టి ప్రజలను బానిసలుగా మార్చి విచ్చల విడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అవతరించిందన్నారు. నాయకుల కోతలు విని ప్రజలు విసిగి పోతున్నారన్నారు. అభివృద్ధి ఆచరణలో కనిపించడం లేదన్నారు.

Tags:    

Similar News