పెళ్లికి బాజా మోగెదెప్పుడో!

దిశ వెబ్ డెస్క్: పెళ్లిల్లకు ముహుర్తాలు ఖరారయ్యాయి. పనులన్నీ జరుగుతున్నాయి. కార్డులు కూడా ప్రింటింగ్ అయ్యాయి. వధూ వరులు.. చేయి పట్టుకుని నడిచే ఏడడుగుల గురించి కలలు కంటున్నారు. పెళ్లి తర్వాత ఎక్కడెక్కడి వెళ్లాలో ప్లాన్ వేసుకుంటున్నారు. బంధువులంతా సంబరంలో ఉన్నారు. అంతలోనే.. కరోనా.. అందరి కలలకు బ్రేకులు వేసింది. పెళ్లిళ్లు వాయిదా వేసుకునేలా చేసింది. ఒకటా.. రెండా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరిగే … వేలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి. మళ్లీ ఆ పెళ్లిల్లన్నీ ఎప్పుడో […]

Update: 2020-04-10 21:45 GMT

దిశ వెబ్ డెస్క్: పెళ్లిల్లకు ముహుర్తాలు ఖరారయ్యాయి. పనులన్నీ జరుగుతున్నాయి. కార్డులు కూడా ప్రింటింగ్ అయ్యాయి. వధూ వరులు.. చేయి పట్టుకుని నడిచే ఏడడుగుల గురించి కలలు కంటున్నారు. పెళ్లి తర్వాత ఎక్కడెక్కడి వెళ్లాలో ప్లాన్ వేసుకుంటున్నారు. బంధువులంతా సంబరంలో ఉన్నారు. అంతలోనే.. కరోనా.. అందరి కలలకు బ్రేకులు వేసింది. పెళ్లిళ్లు వాయిదా వేసుకునేలా చేసింది. ఒకటా.. రెండా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరిగే … వేలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి. మళ్లీ ఆ పెళ్లిల్లన్నీ ఎప్పుడో జరుగుతాయో తెలియని పరిస్థితి. పెళ్లితో పరోక్షంగా సంబంధమున్న కూలీలపైన ఆ ప్రభావం పడింది. పెళ్లి కి అనుబంధంగా ఉండే వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనా దగ్గరయ్యే రెండు కుటుంబాలనే కాదు.. ఎంతోమందికి ఉపాధిని దూరం చేసింది.

పెళ్లికి అన్నింటికంటే ప్రధానమైంది ముహుర్తం. వధువరులను ఒక్కటి చేసేందుకు.. మూడుముళ్లతో బంధం వేసేందుకు పంతుళ్లు శుభ ఘడియల్ని నిశ్చయిస్తారు. ఆ ఇద్దరి పేర్ల మీద సంత్సరంలో కొన్ని రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నాయంటూ.. కొన్ని తేదీలను నిర్ణయిస్తారు. వరుడు తరుపున, వధువు తరుపున ఇద్దరూ తమ తమ అనుకూల సమయాలను ఎంచుకుని పెళ్లి ముహుర్తాన్ని ఓకే చేసుకుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా తమ పెళ్లి ముహుర్తానికి నెల రోజుల ముందుగానే ఆఫీసులో సెలవులు కోసం ఆర్జీ పెట్టుకుంటారు. పెళ్లి ఘడియ దగ్గర పడుతున్న కొద్దీ… ఇరు కుటుంబీకులు తమ తమ పనుల్లో బిజీ అయిపోతారు. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు. క్యాటరింగ్, డెకరేషన్ మాట్లాడుకుంటారు. పంతుళ్లకు, పందిళ్లకు అడ్వాన్స్ లు, కార్డు ప్రింటింగ్ లు .. బంధువులందరికీ పిలుపులు ఇలా బోలెడు కార్యక్రమాలకు ప్లాన్లు వేసుకుంటారు. ఒక్కసారిగా అవన్నీ తలకిందులైపోయాయి. కరోనా కారణంగా వేలాది పెళ్లిల్లు వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏప్రిల్ 14వ తేదీ వరకు అది అమల్లో ఉంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. లాక్ డౌన్ ఈ నెల చివరి వరకు కొనసాగించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా రాష్ర్టంలో.. మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించలేకున్నాం. దాంతో మే నెలలోని పెళ్లిల్లు కూడా జరిగేది అనుమానం. మే 23 వరకే మంచి ముహుర్తాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు శుభ ముహుర్తాలు లేనట్లే. ఇప్పుడు వాయిదా పడ్డ పెళ్లిళ్లకు .. ఆ సమయంలో (శ్రావణ మాసంలో) వధువరులకు కలిసే ముహుర్తాలు ఉంటేనే పెళ్లి బాజాలు మోగుతాయి. లేకపోతే.. కార్తీకం వరకు ఆగాల్సిందే.

నాలుగు నెలల్లో:

సాధారణంగా సంక్రాంతి దినాల్లో.. మంచి రోజులు ఉండవని అంటుంటారు. ఆ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయరు. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి అంతటా శుభ కార్యాలు మొదలువుతాయి. ఈ నెలలో పెళ్లి ముహుర్తాలు కూడా బాగానే ఉంటాయి. మార్చి ఏప్రిల్‌, మే, జూన్‌ ప్రథమార్థం వరకు పెళ్లి ముహుర్తాలు ఉంటాయి.

శ్రావణమాసంలో మూఢం రావడంతో గత సంవత్సరం మంచి ముహూర్తాలు లేక అంతంతమాత్రంగానే శుభకార్యాలు జరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్ళిళ్లు ఇతర శుభకార్యాలు నిర్వహించడానికి పెద్దలు సిద్ధమయ్యారు. కరోనా రూపంలో సమస్య రావడంతో శుభకార్యాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సారి మాత్రం మే 23 వతేదీ వరకు మాత్రమే మంచి పెళ్లి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు అంటున్నారు. మే23వ తేదీన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుందని, సాధారణంగా ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయని, కానీ ఈసారి ఇదే మాసంలో మూఢం రావడంతో జూన్‌ 10 వరకు ఎటువంటి శుభకార్యాలు జరిపేందుకు వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ తరువాత కూడా ఒకటి రెండు తప్ప పెద్దగా ముహూర్తాలు లేవు. ఆ వెంటనే ఆషాఢం వస్తుంది… కాబట్టి జూలై చివరి వరకు శుభకార్యాలు జరపడానికి వీల్లేదు. తర్వాత వినాయకచవితి పండుగ, ఆశ్వయుజమాసం వస్తుంది. అది అధికమాసం కావడం వంటి కారణాలతో మే 23 తరువాత నుంచి ఆగస్టు వరకు పెద్దగా మంచి ముహూర్తాలు లేవు. దీంతో పెళ్లితో ముడిపడిన వ్యాపారులు, కార్మికులు పరిస్థితి అగోమ్యగోచరంగా మారింది.

ఉపాధి ఎట్ల:

శుభకార్యాలు వాయిదా పడటంతో వీటితో ఆధారపడ్డ వ్యాపారులు, కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. పురోహితులు, సన్నాయి, బ్యాండ్, క్యాటరింగ్, డెకరేషన్, పూలు, లైటింగ్, ప్రింటింగ్, ఫంక్షన్ హాళ్లు ఇలా పెళ్లితో ముడిపడ్డ దాదాపు 15కు పైగా వ్యాపారాలన్నీ కూడా నష్టపోతున్నాయి. ఈ నాలుగు నెలల్లో జరిగే లక్షలాది పెళ్లిల్లు ఆగిపోతే తమకు పూట గడవని పరిస్థితి వస్తుందని, తమను ఎవరు ఆదుకుంటారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడ్వాన్స్‌లు తిరిగి చెల్లించలేం..

చాలామంది తమ ఇంట జరిగే వివాహాలకు ఇప్పటికే మండపాలకు, సన్నాయి, క్యాటరింగ్‌, లైటింగ్ వంటి వాటితో పాటు ఇతరత్రా వాటికి అడ్వాన్స్‌లు ఇచ్చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని చాలామంది అడుగుతుండటంతో తిరిగి చెల్లించలేమని, మరోసారి మీరు ముహూర్తం పెట్టుకున్నప్పుడు మీకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని అడ్వాన్స్‌ తీసుకున్నవారు స్పష్టం చేస్తున్నారు.

ఆన్ లైన్ లోనూ:

పెళ్లి వాయిదా అంటే మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. మళ్లీ ముహుర్తాలు, సెలవులు, పెళ్లి పనులు ఇవన్నీ కుదరాలంటే.. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే కొంతమంది ఆన్ లైన్ లోనే వివాహాలు చేసుకున్నారు. మరికొంత మంది నిశ్చితార్థాలు కానిచ్చేశారు. ఒకవేళ అంతా కుదుట పడితే.. సమయముంటే.. రిసెప్షన్ లేదా.. ఆత్మీయులందరినీ పిలిచి ఏదైనా పార్టీ లాంటిది ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు.

చైనాలో పెళ్లిగోల:

మన దగ్గర పరిస్థితి ఇలా ఉంటే.. కరోనా వైరస్ పుట్టిన చైనాలో మాత్రం అంతా కుదుటపడింది. దాదాపు 100 రోజుల పాటు లాక్ డౌన్ లో గడిపిన చైనీయులు.. లాక్డౌన్ ఎత్తివేయడంతో ఆనందంగా తిరుగుతున్నారు. టూర్లకు వెళుతున్నారు. అంతేకాదు పెళ్లి చేసుకోవడానికి ఆన్ లైన్ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. చైనాలో పెళ్లి చేసుకోవాల‌న్నా, పిల్ల‌లు క‌నాల‌న్నా.. ప్ర‌భుత్వ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి లాంటిది! ఈ నేప‌థ్యంలో తాము పెళ్లి చేసుకోవాలంటూ అనేక మంది ఆన్ లైన్ లో అప్లికేష‌న్లు పెట్టుకుంటున్నార‌ట‌. మామూలుగా వ‌చ్చే అప్లికేష‌న్ల‌తో పోలిస్తే.. ఇప్పుడు 300 శాతం అప్లికేష‌న్లు పెరిగాయ‌ని, ఇన్నాళ్లూ క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో పెళ్లిళ్ల‌ను వాయిదా వేసుకున్న వాళ్లంతా ఇప్పుడు ఒక్క‌సారి అప్లికేష‌న్ల‌ను పెట్టుకుంటున్నార‌ని అందుకే ఈ శాతం భారీగా పెరిగింద‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నార‌ట‌! రేపు ఇండియాలో కూడా లాక్ డౌన్ ఎత్తేశాకా.. వ‌ర‌స‌గా పెళ్లిళ్లు ఉంటాయేమో!

Tags: coronavirus, lockdown, marriage, muhurat, postpone, china, online marriage,

Tags:    

Similar News