కరోనా కిట్‌లో ఏముంటాయి?

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో తగినంత సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగడంలేదని వరుస విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది. గత నెల 16 నుంచి టెస్టుల సంఖ్యను పెంచగా, కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్ని, 83% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని గ్రహించి ఇప్పుడు యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టుల్నికూడా నిర్వహిస్తోంది. ప్రతిరోజు కనీసంగా 15 వేల చొప్పున మొత్తం రెండున్నర లక్షల టెస్టుల్ని చేయాలని టార్గెట్ పెట్టుకుంది. పాజిటివ్ వచ్చినా […]

Update: 2020-07-11 21:26 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో తగినంత సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగడంలేదని వరుస విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది. గత నెల 16 నుంచి టెస్టుల సంఖ్యను పెంచగా, కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్ని, 83% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని గ్రహించి ఇప్పుడు యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టుల్నికూడా నిర్వహిస్తోంది. ప్రతిరోజు కనీసంగా 15 వేల చొప్పున మొత్తం రెండున్నర లక్షల టెస్టుల్ని చేయాలని టార్గెట్ పెట్టుకుంది. పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేనివారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచిస్తుండడంతో వారికి ప్రత్యేక కిట్లను అందించడంపై దృష్టి పెట్టింది. దీనికి తోడు కంటైన్‌మెంట్ జోన్లలో అదనపు కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పింది జీహెచ్ఎంసీ.

ర్యాపిడ్ టెస్టులపై ప్రత్యేక ఫోకస్

జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఏరియా హెల్త్ కేర్ సెంటర్‌లో ర్యాపిడ్ టెస్టులు జరుగుతున్నాయని, రోజుకు కనీసంగా ఐదు వేల టెస్టుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి తోడు ప్రస్తుతం చేస్తున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు ఎలాగూ జరుగుతూనే ఉంటాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే రెండు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, అవసరానికి అనుగుణంగా అదనంగా కూడా తెప్పించుకుంటామన్నారు. ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ వస్తే లక్షణాలను బట్టి మూడు రోజుల తర్వాత మళ్ళీ ర్యాపిడ్ టెస్టు చేయడమా లేక తీవ్రతను బట్టి నేరుగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు చేయడమా అనేది వైద్యులు నిర్ణయిస్తారని తెలిపారు.

జీహెచ్ఎంసీతో పాటు జిల్లా ఏరియా ఆసుపత్రి మొదలు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ర్యాపిడ్ టెస్టుల్ని నిర్వహించడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అవి జరుగుతుండగా మరికొన్ని జిల్లాలకు కిట్లు వెళ్తూ ఉన్నాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రతిరోజు సుమారు 10 వేల టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లయితే ఇక ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు అవసరం లేదని వివరించారు. లక్షణాలేవీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నందున ఎక్కువ టెస్టులు చేయాల్సి వస్తోందని, ఆర్‌టీ-పీసీఆర్ విధానంలో చేసే పరీక్షలకు రిపోర్టు రావడానికి ఎక్కువ సమయం పడుతున్నందున ర్యాపిడ్ టెస్టుల మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని, అరగంటలోనే రిపోర్టు వస్తోందని తెలిపారు.

హోమ్ ఐసొలేషన్ పేషెంట్లకు కిట్లు

లక్షణాలు లేని పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోవడంతో వారిని హోమ్ ఐసొలేషన్‌లోనే ఉండాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం చేయించడంతో పాటు వారి అవసరాల కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా కిట్లను అందిస్తోంది. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పరిధిలోని పేషెంట్లకు మాత్రమే వీటిని అందిస్తోంది. ఆయా జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు ఆ పేషెంట్ల వివరాలను కాల్ సెంటర్ డాటా బేస్ ద్వారా తెలుసుకుని ఇండ్లకే వెళ్ళి ఇస్తారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నగరంలో సుమారు 11 వేల మంది హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. వీరందరికీ ఈ కిట్లు అందనున్నాయి.

ఈ కిట్‌లో ఏముంటాయి?

ప్రభుత్వం అందజేసే ఉచిత కిట్‌లో 34 సి-విటమిన్ మాత్రలు, 17 జింక్ టాబ్లెట్లు, 17 బి-కాంప్లెక్స్ టాబ్లెట్లు, ఆరు క్లాత్ మాస్కులు, అర లీటరు శానిటైజర్, ఒక డెట్టాల్ హ్యాండ్ వాష్, రెండు జతల గ్లౌజులు, 100 మి.లీ. సోడియం హైపో క్లోరైట్ ద్రావణం, వైరస్ వ్యాప్తి నివారణతో పాటు ఇమ్యూనిటీని పెంచుకోడానికి పాటించాల్సిన అంశాల బుక్‌లెట్… లాంటివన్నీ ఉంటాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కిట్‌తో పాటు ఒక ఆక్సిజన్ పల్స్ పరికరాన్ని కూడా అందిస్తోంది.

Tags:    

Similar News