కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు.. కిషన్ రెడ్డికి కీలక శాఖ

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేబినెట్‌లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి అవకాశం దక్కింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్లలో కేబినెట్ హోదా దక్కడం ఇదే ఫస్ట్ టైమ్. గత టర్ములో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ పనిచేసినా అది స్వతంత్ర హోదా మాత్రమే. కేబినెట్ మంత్రిగా ఎవ్వరూ లేరు. ఇంతకాలం హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్‌రెడ్డికి ప్రమోషన్ లభించి కల్చర్, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ లభించింది. […]

Update: 2021-07-07 11:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేబినెట్‌లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి అవకాశం దక్కింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్లలో కేబినెట్ హోదా దక్కడం ఇదే ఫస్ట్ టైమ్. గత టర్ములో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ పనిచేసినా అది స్వతంత్ర హోదా మాత్రమే. కేబినెట్ మంత్రిగా ఎవ్వరూ లేరు. ఇంతకాలం హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్‌రెడ్డికి ప్రమోషన్ లభించి కల్చర్, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ లభించింది. మొత్తం 30 మంది కేబినెట్ మంత్రుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. స్వతంత్ర, సహాయ మంత్రులంతా కలిపి కేంద్ర మంత్రివర్గంలో 77 మంది ఉంటే తెలంగాణ నుంచి మాత్రం కిషన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు.

దాదాపు మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ రాజకీయాల్లో ఉన్న కిషన్‌రెడ్డి మూడుసార్లు పూర్తికాలం ఎమ్మెల్యేగా కొనసాగారు. తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో అంబర్‌పేట్ నుంచి ఓడిపయినా ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి గెలుపొంది హోంశాఖ సహాయమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాటు ఆ బాధ్యతల నిర్వహణలో భాగంగా జమ్మూకశ్మీర్ వ్యవహారాలను చూశారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖతో పాటు పర్యాటకం, సాంస్కృతిక శాఖలను కూడా పర్యవేక్షించనున్నారు. పార్టీపరంగా చూస్తే సమైక్య రాష్ట్ర బీజేపీ చివరి అధ్యక్షుడిగా వరుసగా రెండుసార్లు నాలుగేళ్ళ పాటు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్షుడిగా పూర్తికాలం రెండేళ్ళ పాటు పనిచేశారు.

లోక్‌సభకు ఎన్నికైన తొలిసారే ఆయన కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కించుకోవడం విశేషం. తెలంగాణ నుంచి మొత్తం నలుగురు ఎంపీలు గెలిచినా అందులో కిషన్‌రెడ్డికే అవకాశం లభించింది. రెండున్నరేళ్ళ ఆయన పనితీరుతో కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వచ్చింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పట్ల మెతకవైఖరి అవలంబించినందున ఆయనకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉండొచ్చని పార్టీలోనే వివిధ స్థాయి నాయకుల్లో ఊహాగానాలు వచ్చినా దానికి భిన్నంగా కేబినెట్ ర్యాంకు దక్కడం గమనార్హం. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందించాలంటూ గత నెలలో రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ఢిల్లీకి వెళ్ళి పలు అంశాలపై విజ్ఞప్తులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.

రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వివిధ పథకాల కింద ఆర్థిక సాయం కావాలని, సకాలంలో నిధులను విడుదల చేయాలన్న రాష్ట్ర విజ్ఞప్తికి ఇప్పుడు ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News