‘దళిత బంధు’పై కేసీఆర్ పక్కా ప్లాన్.. అసెంబ్లీలో కీలక ప్రకటన..?

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధుపై అధికారులతో, దళిత ఎమ్మెల్యేలతో, ప్రజా సంఘాలతో ఇప్పటికే విస్తృతంగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే వారం రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన లాంఛనంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించడానికి ముందే అసెంబ్లీ సమావేశాలను చేపట్టాలనుకుంటున్నారు. ఉభయ సభల్లో ఒక్కో రోజు చొప్పున దీనిపై చర్చించాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆరు నూరైనా ఈ […]

Update: 2021-08-06 23:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధుపై అధికారులతో, దళిత ఎమ్మెల్యేలతో, ప్రజా సంఘాలతో ఇప్పటికే విస్తృతంగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే వారం రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన లాంఛనంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించడానికి ముందే అసెంబ్లీ సమావేశాలను చేపట్టాలనుకుంటున్నారు. ఉభయ సభల్లో ఒక్కో రోజు చొప్పున దీనిపై చర్చించాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆరు నూరైనా ఈ పథకాన్ని కొనసాగిస్తానని, చట్టభద్రత కూడా కల్పిస్తానని వాసాలమర్రి గ్రామంలో హామీ ఇచ్చినందున ఈ దిశగా అసెంబ్లీలో కసరత్తు జరిగే అవకాశం ఉంది.

ఒక పథకాన్ని ప్రవేశపెడితే తర్వాతి ప్రభుత్వాలు దాన్ని తొలగించకుండా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని గతంలో పలుమార్లు నొక్కిచెప్పిన కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పథకం విషయంలోనూ అర్హులైన లబ్ధిదారుల్లో చివరి వ్యక్తి వరకూ అందేలా చట్టభద్రత కల్పించాలన్నది ఆయన ఉద్దేశమని, అందుకే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దళితబంధు పథకం గురించి కేవలం దళిత ఎమ్మెల్యేలతో మాత్రమే ప్రగతి భవన్‌లో చర్చించిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల ప్రతినిధులకు వివరించడానికి, చర్చల ద్వారా సభ ఆమోదం పొందడానికి ఈ సమావేశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చినట్లు విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పథకాన్ని విమర్శించినట్లయితే దళిత ఓటు బ్యాంకుకు దూరమవుతాయన్న ఉద్దేశంతో పార్టీలు ఈ రాగం అందుకున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ జరిగి రాష్ట్ర ప్రజల్లో హాట్ టాపిక్‌గా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సభలో చర్చ జరిగి ఏకగ్రీవ ఆమోదం లభిస్తే దళితుల మనస్సులను గెల్చుకోవచ్చన్నది టీఆర్ఎస్ ప్లాన్‌గా కనిపిస్తున్నది. విమర్శించి దళితులకు దూరం కావడానికి బదులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

రెండు రోజుల పాటు ప్రత్యేక సెషన్ నిర్వహించి కేవలం ఈ అంశంపై మాత్రమే అసెంబ్లీలో ఒకరోజు, శాసనమండలిలో మరోరోజు చర్చించి ఆమోదం పొందేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లో తేదీలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున మంజూరయ్యాయి. జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి. ఇక లాంఛనంగా హుజూరాబాద్‌లో ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టి ప్రకటన చేయడమే తరువాయి. అప్పటికల్లా చట్టబద్ధంగా చర్చ, ఆమోదం తీసుకునే ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.

కేసీఆర్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, నేతలు ఫైర్.. సీఎంకు భారీ షాక్ తప్పదా.?

Tags:    

Similar News