కేసీఆర్‌కు షాక్.. అనుమతి లేకున్నా 500 మందికి ఫస్ట్ డోస్

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ‘టీకా ఉత్సవ్‘ పేరుతో మే నెల 1వ తేదీ నుంచి 18-44 ఏజ్ గ్రూప్ వయోజనులకు కరోనా టీకాలను ఇవ్వనున్నట్లు ప్రకటించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానికి అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలోని ప్రజలకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. టీకాలను నేరుగా తయారీ సంస్థల నుంచే సమకూర్చుకునేలా రాష్ట్రాలకే అధికారం అప్పగించింది కేంద్రం. కానీ ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో […]

Update: 2021-05-09 12:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ‘టీకా ఉత్సవ్‘ పేరుతో మే నెల 1వ తేదీ నుంచి 18-44 ఏజ్ గ్రూప్ వయోజనులకు కరోనా టీకాలను ఇవ్వనున్నట్లు ప్రకటించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానికి అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలోని ప్రజలకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. టీకాలను నేరుగా తయారీ సంస్థల నుంచే సమకూర్చుకునేలా రాష్ట్రాలకే అధికారం అప్పగించింది కేంద్రం. కానీ ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో 18-44 గ్రూపు వారికి టీకాలను ఇవ్వలేమని, అందువల్ల ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు సైతం అనుమతి ఇవ్వలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఒక సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటికే 500 మంది 18-44 ఏజ్ గ్రూపు వయోజనులు టీకాలు తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే ఈ 500 మంది ఎలా టీకాలు తీసుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడించినందున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎలా సాధ్యమైందనేది మింగుడుపడడంలేదు. టీకాలు ఎవరు తీసుకున్నా విధిగా ‘కొవిన్‘ వెబ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని ఆ ప్రకారమే ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన. ఆ ప్రకారం రాష్ట్రంలోని వయోజనులు వారి పేర్లను పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆప్షన్లను కూడా ఇవ్వనప్పుడు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ను ఎలా తీసుకోగలిగారన్నదానికి అంతుచిక్కడంలేదు.

అపోలో, మాక్స్ లాంటి కార్పొరేట్ ఆస్పత్రులు 18-44 గ్రూపు వయోజనులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాయి. రాష్ట్రంలోని అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తామని సీఎం ప్రకటించినందున దానిపై విధాన నిర్ణయం తీసుకుని ప్రకటన వెలువడేంత వరకు ఆ ప్రక్రియను ప్రారంభించడంలేదని వైద్యరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆలోచన, ఆచరణ ఎలా ఉన్నా 500 మంది ఏ నిబంధన ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఉల్లంఘనలకు పాల్పడిన ఆస్పత్రులు ఏవి తదితరాలపై ఇప్పుడు వైద్యారోగ్య శాఖలో గుసగుసలు మొదలయ్యాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫస్ట్ డోస్ టీకాలను ఎలా ఇచ్చాయనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటిదాకా ‘టీకా ఉత్సవ్‘లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 17.76 లక్షల మంది 18-44 ఏజ్ గ్రూపులో ఉన్న వయోజనులు టీకాలు తీసుకున్నారు. తగినన్ని డోసులు అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు టీకా ఉత్సవ్‘ను కేంద్రం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 1వ తేదీ నుంచి మొదలుపెట్టలేమని స్పష్టం చేశాయి. ఇదే బాటలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిషా, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలు మాత్రమే టీకాలను ఇవ్వడం మొదలుపెట్టాయి. తెలంగాణ ఈ ప్రక్రియను ప్రారంభించకుండానే 500 మంది ఫస్ట్ డోస్ తీసుకోవడం విశేషం.

Tags:    

Similar News