సీఎం మార్పుపై ఏం జరిగింది.. ఊహాగానాల మతలబేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో : దాదాపు రెండు నెలలుగా మంత్రుల మొదలు అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు “కేటీఆర్ సీఎం అవుతారు.. సీఎం కావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి.. ఆయనకు తగిన అనుభవమూ ఉంది.. ఆయనకేం తక్కువ.. ” లాంటి కామెంట్లు వచ్చాయి. సీఎం కావడం ఖాయంగానీ ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది అని చాలామంది పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. కానీ హఠాత్తుగా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం “నేనేం సీఎం. ఇంకో పదేళ్ళు కొనసాగుతాను. […]
దిశ, తెలంగాణ బ్యూరో : దాదాపు రెండు నెలలుగా మంత్రుల మొదలు అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు “కేటీఆర్ సీఎం అవుతారు.. సీఎం కావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి.. ఆయనకు తగిన అనుభవమూ ఉంది.. ఆయనకేం తక్కువ.. ” లాంటి కామెంట్లు వచ్చాయి. సీఎం కావడం ఖాయంగానీ ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది అని చాలామంది పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. కానీ హఠాత్తుగా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం “నేనేం సీఎం. ఇంకో పదేళ్ళు కొనసాగుతాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నాకు ఆరోగ్యం బాగలేకపోతే పార్టీ నేనే పార్టీ నేతలకు చెప్తాను.. సీఎం మార్పుపై ఇంకెవ్వరూ ఎలాంటి కామెంట్లు చేయొద్దు.. హద్దు మీరితే వేటు తప్పదు..” అంటూ హెచ్చరించారు.
ఇంతకాలం పార్టీ నేతలే కామెంట్ చేస్తే సైలెంట్‌గా ఉండిపోయిన సీఎం కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా క్లారిటీ ఎందుకిచ్చినట్లు? ఈ క్లారిటీ ఇవ్వడం కోసమే గతంలో జరిగిన సమావేశాలకు భిన్నంగా ఈసారి పార్టీ కార్యవర్గ సమావేశాన్ని హడావిడిగా ఏర్పాటుచేశారా? చాలా మంది మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు పట్టాభిషేకంపై ఎన్నోసార్లు వ్యాఖ్యానాలు చేసినా అటు కేసీఆర్‌గానీ, ఇటు కేటీఆర్‌గానీ వారించకుండా, ఖండించకుండా మౌనంగా ఎందుకున్నట్లు? ఇప్పుడు సీఎం మార్పు లేదనే సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకాలం మంత్రులు చేసిన వ్యాఖ్యలన్నింటినీ వదంతులుగానే భావించాలా? లేక ఉద్దేశపూర్వకంగా పార్టీ నాయకత్వమే లీకులిచ్చిందనుకోవాలా? కేటీఆర్‌కు పాలనా పగ్గాలు అప్పజెప్పడం ద్వారా ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇంతకాలం లీకులిచ్చిందా?.. ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
దాదాపు రెండు నెలలుగా కేటీఆర్ సీఎం కాబోతున్నారని స్వంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నా వారిని ఎందుకు కట్టడి చేయలేదు? డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఇటీవల కార్యక్రమంలో వేదికపై కేటీఆర్ ఉండగానే ‘కాబోయే సీఎం కేటీఆర్’ అని సంబోధిస్తే అక్కడికక్కడ ఎందుకు నిలువరించలేదు? కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే సీనియర్లు కూడా తొందర్లోనే సీఎం కావడం ఖాయం అని ఎందుకు చెప్తున్నట్లు? ఇలాంటివన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిజానికి కేటీఆర్ తన సన్నిహితులతో త్వరలో సీఎం కాబోతున్నట్లు చెప్పుకున్నట్లు కూడా కొందరి ద్వారా తెలిసింది. ఒక దశలో, దళితుడ్ని సీఎం చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు తన కొడుకుకే ఎందుకు ఇస్తున్నారన్న విమర్శలు కూడా బీజేపీ నేతల నుంచి వచ్చాయి. కాంగ్రెస్ నేతలు కూడా బీసీ వ్యక్తిగా ఉన్న ఈటల రాజేందర్‌ను సీఎం చేయాలన్న వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీఎం పోస్టును వదులుకుని కేటీఆర్‌కు అప్పజెప్తే ఇలాంటివి ఇంకొన్ని రాళ్లు పడతాయన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి విరమించుకున్నట్లు తెలిసింది.
సర్వే ఫలితాల ఎఫెక్టా?
కేటీఆర్ సీఎం అయితే .. అనే అంశంపై ప్రజల నాడిని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే పార్టీ అధినేత హఠాత్తుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం మార్పు లేదంటూ స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేటీఆర్ సీఎం అవుతారని పార్టీ నేతలు వ్యాఖ్యానించిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన అభిప్రాయాలు, పార్టీలోని కొద్దిమంది సీనియర్ నేతలు స్పందించిన తీరు, స్వంతంగా పార్టీ చేయించుకున్న సర్వేలో వచ్చిన ఫలితాలు .. ఇలాంటివాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. సర్వేలో ఎలాంటి ఫలితాలు వచ్చాయోగానీ సీఎం మార్పు విషయంలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సస్పెన్స్ తొలగించడానికి ఈ సమావేశాన్ని కేసీఆర్ వేదికగా వాడుకుని క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ‘సీఎంగా కేటీఆర్’ అనే అంశంపై అనుకూల అభిప్రాయాలతో పాటు ప్రతికూలమైనవీ విస్తృతంగానే వచ్చాయి. అనేక సందర్భాల్లో ‘బాధ్యత లేని సోషల్ మీడియా’ అంటూ తిట్టే సీఎం కేసీఆర్ ఈసారి వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. కార్యవర్గ సమావేశంలో ఈ మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కూడా నొక్కిచెప్పారు. విపక్ష పార్టీల విమర్శలకు ఈ వేదిక ద్వారా కూడా కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు నొక్కిచెప్పారు. ఇంతకాలం కేటీఆర్ సీఎం ఎప్పుడవుతారా అని ఎదురుచూసిన ఆయన అభిమానులకు, పార్టీలోని కొద్దిమందికి కేసీఆర్ సూటిగానే చెప్పిన విషయం షాక్‌లా తాకింది. ఇప్పుడు కాకపోతే కేటీఆర్ ఇంకెప్పుడు సీఎం అవుతారనే చర్చలూ ఆయన అభిమానుల్లో మొదలయ్యాయి.
మనసు మారిందా?
కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. అతి త్వరలోనే జరుగుతుంది అంటూ సీనియర్ మంత్రులు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండేవారు సైతం సందర్భానుసారంగా వ్యాఖ్యానించారు. పార్టీలో అలాంటి చర్చ జరగడం, భవిష్యత్తులో ఆ దిశగా నిర్ణయం జరుగుతుందనే సమాచారం లేకుంటే ఈ కామెంట్లు వచ్చేవా.? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ ఇందుకు సిద్దంగా లేనట్లయితే, ఆయనకు ఆ అభిప్రాయం లేనట్లయితే మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా వ్యాఖ్యానించేవారా? పార్టీలో అలాంటి అభిప్రాయమే లేనట్లయితే మంత్రులు చేసిన కామెంట్లపై వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేసి ఉండకపోయేవారా? ఎలాంటి ఉప్పు అందకుండానే, కేసీఆర్ నుంచి పరోక్షంగా సంకేతాలు లేకుండానే కేటీఆర్‌ను ఎత్తిపట్టేలా కామెంట్లు చేసే సాహసం ఆ పార్టీ నేతలు ఎవ్వరైనా చేయగలరా?.. ఇప్పుడు ఇవన్నీ పార్టీ శ్రేణులను, విపక్ష పార్టీ నేతలను తొలుస్తున్న ప్రశ్నలు. కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ తొలుత భావించి ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిందనేదే తాజాగా జరుగుతున్న చర్చ. కేటీఆర్ సీఎం అయితే అది నచ్చనివాళ్ళు పార్టీని విడిచిపెట్టి పోతారనే భయం, పరోక్షంగా అది దూకుడు మీద ఉన్న బీజేపీకి లాభిస్తుందనే ఆందోళన, ఇప్పటిదాకా నియంత్రణలో ఉన్న పార్టీలో ఇకపైన లుకలుకల మొదలవుతాయేమోననే అనుమానం.. వీటన్నింటి కారణంగానే తాత్కాలికంగా కేటీఆర్‌కు సీఎం బాధ్యతలను అప్పజెప్పాలన్న నిర్ణయాన్ని పక్కకు పెట్టి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కాకపోయి ఉంటే నా ఫొటో గాంధీ ఫోటో పక్కన పెట్టేవారు..
సీఎం బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పనున్నట్లు పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇకపైన ఎవ్వరు మాట్లాడినా కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరిక చేశారని పేర్కొన్న పార్టీ నేత ఒకరు ఆ సమావేశంలో జరిగిన అంశాలను ఉదహరించారు. సమావేశంలో కేసీఆర్ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను ఆ నేత ఇలా వివరించారు. “తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేను సీఎం కాకపోయి ఉంటే నా ఫోటో కూడా గోడకు మహాత్మాగాంధీ పటం పక్కన పెట్టేవారు. తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందనే సీఎం కుర్చీలో నేను కూర్చున్నా. నాకు తెలంగాణ తెచ్చిన పేరుకంటే సీఎం పదవి గొప్పదేమీ కాదు. సీఎం పదవిలో ఉన్నాను కాబట్టే వానితోని వీనితోని తిట్లు తింటున్నా.
అలా తిట్లు తినాలనా నాకు లేదు. పార్టీలో వివిధ స్థాయిల్లో, పదవుల్లో ఉండి చిల్లర కామెంట్లు చేయవద్దు. జయశంకర్ సార్ లాంటివారు పది మంది ఉంటే మీటింగులు పెట్టి ఇలాంటి పునాదులు వేశారు. ఆ పునాదుల మీద మీరు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. మన రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు నెరవెర్చాలనే కోరుకున్న. వేరే వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఆగమవుతుందనే సీఎంగా నేను ఉన్నా. ఈ పదవి నాకు గొప్పకాదు. కాలి చెప్పుతో సమానం. దళితులకు మనం మరింత చేయాల్సి ఉండె. చాలా మంది ఉద్యమాల పేరుతో పార్టీలు పెట్టి కాలం కలిసిరాక ఏమయ్యారు? మనం ఈ పార్టీని కష్టపడి కాపాడుకున్నాం. కాలం కలిసి వచ్చి జయశంకర్ సార్ తోడ్పాటుతో మనం విజయం సాధించాం. కేంద్రంలో మన అవసరం ఉంటే మీతో చెప్పే పోతా. నాకు చుట్టాలెవరున్నారు? అవసరం అయితే ముఖ్యులతో చర్చించే పోతా. పార్టీ సభ్యత్వాల నమోదుకు నేనే ఇంచార్జీలను నియమిస్తా” అని ఈ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.