తెలంగాణలో కరోనా కర్ఫ్యూ..

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రమంతటా అప్రకటిత కర్ఫ్యూ అమలుకానుంది. ప్రధాని పిలుపు మేరకు దేశమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ అమలుకానుండగా తెలంగాణలో మాత్రం ఇది 24 గంటల పాటు జరగనుంది. ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతో తెలంగాణ రాష్ట్రంలో […]

Update: 2020-03-21 06:21 GMT

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రమంతటా అప్రకటిత కర్ఫ్యూ అమలుకానుంది. ప్రధాని పిలుపు మేరకు దేశమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ అమలుకానుండగా తెలంగాణలో మాత్రం ఇది 24 గంటల పాటు జరగనుంది. ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతో తెలంగాణ రాష్ట్రంలో కరోనాని అదుపులో ఉంచుదామని కోరారు. ఎవరైనా రోడ్లమీదకు వస్తే పోలీసులు నిలువరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రమంతా 24 గంటల షట్ డౌన్ కానుందని, అత్యవసర సేవలు మినహా మిగిలిన వ్యవస్థ అంతా బంద్ అవుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు బోర్డర్‌లోనే నిలిచిపోతాయన్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు అర్థం చేయించామన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, సుమారు 11 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారని, మార్చి 1వ తేదీ తర్వాత విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన సుమారు 21 వేల మందిలో ఇంకా కొద్దిమంది వివరాలు తెలియాల్సి ఉందన్నారు. విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారు స్వచ్ఛందంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి వివరాలు ఇవ్వాలని కోరారు. లేదంటే ఆలస్యమైనా వారి వివరాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఇందుకోసం రాష్ట్రం మొత్తంమీద 5274 నిఘా బృందాలు పనిచేస్తున్నాయని, వారి ద్వారా వివరాలు వస్తాయన్నారు. ఇప్పటివరకు సుమారు 700 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని, వారికి ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స అందుతోందన్నారు.

పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రంతో ఉన్న సరిహద్దుల్లో పటిష్ట నిఘా కొనసాగుతోందని, వచ్చీపోయేవారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. పరిస్థితి చేయిదాటి పోయేంతవరకు దారితీస్తే మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా బంద్ చేస్తామన్నారు. ఇప్పటివరకు పనిచేస్తున్న 18 చెక్ ఫోస్టుల స్థానంలో ఇప్పుడు 52 చెక్ పోస్టులు పెడుతున్నామని, 78 మొబైల్ స్క్వాడ్ బృందాలు గస్తీ తిరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికైతే కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని, అదుపు తప్పినట్లయితే రాష్ట్రం పూర్తిగా షట్ డౌన్ లోకి వెళ్తుందని, ప్రభుత్వమే స్వంత నిధులతో ఇంటింటికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ప్రజలను రోడ్లమీదకు రాకుండా చేస్తుందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారని, వారితో పాటు పిల్లలు కూడా రోడ్లమీదకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని పరిస్థితులు అదుపులోనే ఉన్నా భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేమని, అందుకే అన్ని కోణాల నుంచి ఆలోచించి సర్వ సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన కరోనా టెస్టింగ్ కిట్లు చేరుకున్నాయని, వైద్యుల స్వీయ రక్షణకు అవసరమైన పరికరాలు, ఉఫకరణాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వెంటిలేటర్లను కూడా సమకూర్చుకున్నామని తెలిపారు. ప్రధానితో మాట్లాడిన తర్వాత నగరంలోని సీసీఎంబీలో ఒకేసారి వెయ్యి పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను వాడుకోడానికి అనుమతి లభించిందని తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని, కేవలం ప్రభుత్వం మాత్రమే తీసుకునే చర్యలు సరిపోవని అన్నారు.

ఇండోనేషియా మతప్రచారకులు చట్టబద్ధంగానే వచ్చారు

కజకిస్తాన్, కిర్గిస్తాన్, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి సుమారు 70 మంది మత ప్రచారకులు రాష్ట్రంలోకి వచ్చారని, ఇందులో 60 మందిని ప్రభుత్వం గుర్తించి క్వారంటైన్‌లో ఉంచిందని, కొద్దిమందికి పాజిటివ్ కూడా నిర్ధారణ అయిందన్నారు. వారికి భారత ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని, వారు చట్టబద్ధంగానే ఇక్కడకు వచ్చారని, వారు దొంగమార్గంలో వచ్చిన చొరబాటుదారులు కాదని ముఖ్యమంత్రి వివరించారు. వారు కరీంనగర్‌లో తిరిగిన ప్రాంతాలన్నింటినీ ప్రభుత్వాధికారులు గుర్తించారని, నగరం మొత్తం శానిటైజ్ అయిందని, ఇప్పటిదాకా సుమారు 50 వేల ఇళ్ళను సందర్శించి ఎవరికైనా లక్షణాలు ఉన్నాయోమోనని తెలుసుకున్నారని, కానీ ఎక్కడా ఆందోళన కలిగించే పరిస్థితి రాలేదన్నారు. ఇండోనేషియా పౌరులు తిరిగిన ఆటో డ్రైవర్‌ను కూడా పరీక్షించామని, లక్షణాలు ఎక్కడా బైటపడలేదన్నారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనలకు వందలాది మంది హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, వారు కూడా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారని, అయినా సుమారు రెండు వేల మంది జమ అయ్యారని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలవని సీఎం కోరారు.

రోజువారీ కార్మికులకు నష్టమేమీ లేదు

గత వారం రోజులుగా రాష్ట్రంలో అమలవుతున్న ఆంక్షల వలన రోజువారీ కార్మికులు, అసంఘటిత రంగంలోనివారికి ఎలాంటి ఇబ్బందులూ రాలేదని, వారి ఉపాధికి లోటు రాలేదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి వారిని ఆదుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. సమీప భవిష్యత్తులో వారు ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తే ప్రత్యేక నిధులు కేటాయించి నిత్యావసరాలను సరఫరా చేస్తామన్నారు. ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదన్నారు. అదే సమయంలో బ్లాక్ మార్కెటీర్లకు అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటిదాకా పాలు, కూరగాయలు, న్యూస్ పేపర్లు తదితరాలను విక్రయించేవారిపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్నారు.

దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి

ప్రధాని మోడీ పిలుపు మేరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగనున్నా తెలంగాణ మాత్రం 24 గంటల పాటు కొనసాగించాలనుకుంటోందని, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఎన్నో రోజులు అన్ని పనులనూ బంద్ పెట్టుకున్న ప్రజలకు 24 గంటల టోటల్ షట్ డౌన్ పెద్ద విషయమేమీ కాదని సీఎం వ్యాఖ్యానించారు. మనం 24 గంటల బంద్ పాటించి యావత్తు దేశానికి తెలంగాణ సత్తాను తెలియజేయాలన్నారు. మనల్ని చూసి మిగిలిన రాష్ట్రాలు నేర్చుకునేలా మనం ఈ బంద్‌ను విజయవంతం చేయాలని, ప్రజలే స్వచ్ఛందంగా దీన్ని సక్సెస్ చేయాలన్నారు. మన పట్టుదల ఏంటో తెలియజేయాలన్నారు. దేశమంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నా తెలంగాణలో మాత్రం ‘నిర్బంధ కర్ఫ్యూ’ కొనసాగనుంది. స్వయంగా ముఖ్యమంత్రే ‘పోలీసులు రోడ్లపైకి రానివ్వరు, ఎక్కడికక్కడ నిలిపివేస్తారు’ అని వ్యాఖ్యానించడం విశేషం.

విదేశీ ప్రయాణీకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా

విదేశాల్లో తిరిగి తెలంగాణ చేరుకున్నవారు కూడా మన బిడ్డలేనని వ్యాఖ్యానించిన కేసీఆర్ అలాంటి వారంతా స్వచ్ఛందంగా వారి ప్రయాణ వివరాలను, తాజా ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారు కాజీపేట దగ్గర రైల్లో ప్రయాణిస్తుంటే తోటి ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని, ఇలాంటి పరిస్థితి రాకుండా వారే స్వచ్ఛందంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇలా స్వచ్చందంగా వివరాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి మరింత మెరుగైన చికిత్స సౌకర్యాలు అందుతాయని, వారికి పైసా ఖర్చు భారం లేకుండా అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. క్వారంటైన్‌లో ఉండకుండా రోడ్డు మీదకు రావడం ద్వారా వారి లక్షణాలు మరొకరికి అంటుకుంటాయని, ఇది తెలంగాణ సమాజానికి చేటు చేస్తుందని, తెలంగాణ బిడ్డలకు అంటుకుంటుందని అర్థంచేయించారు. స్వీయ నియంత్రణ పాటించని దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎంత నష్టం జరుగుతూ ఉందో చూస్తున్నాం కాబట్టి తెలంగాణ అలా మారకుండా ఉండేందుకు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

రాష్ట్రంలో మొట్టమొదటి కేసు

ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఇందులో 20 మంది విదేశీ ప్రయాణం చేసివచ్చినవారే. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఎలాంటి విదేశీ ప్రయాణం చేయకున్నా వారి ద్వారా పాజిటివ్ కేసుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం శనివారం నమోదైన రెండు కొత్త కేసుల్లో ఒకటి అమెరికా నౌక ద్వారా దుబాయి మీదుగా హైదరాబాద్ చేరుకున్నవారు ఒకరైతే, మరొకరు ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేకుండా ఆ లక్షణాలు అంటుకున్నాయని పేర్కొంది. విదేశీ ప్రయాణం తర్వాత విధిగా క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం చెప్పినా నిర్లక్ష్యం చేసిన కారణంగా స్థానికులకు కూడా ఇది అంటుకుంటోంది. రాష్ట్రంలో అలాంటి తొలి కేసు నమోదైంది. మహారాష్ట్రలో సైతం పూణె నగరానికి చెందిన ఒక మహిళకు ఇదే తీరులో అంటుకుంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా నమోదైన తొలి కేసులు ఇవి. ఈ స్థాయికి రాకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా అధ్యయనానికి నిపుణుల బృందం

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు అదనంగా నిపుణుల బృందం ఒకటి ఏర్పాటైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి, డీజీపి, సీఎంఓ అధికారులు తదితరులంతా ఇందులో సభ్యులుగా ఉంటారని, అంతర్జాతీయ స్థాయిలో ఏయే దేశాల్లో ఎలాంటి చర్యలు అమలవుతున్నాయి, వాటి ద్వారా నియంత్రణ ఏ స్థాయిలో జరుగుతోంది, తెలంగాణలో అలాంటివి అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు తదితరాలపై ఈ నిపుణుల బృందం ఆలోచిస్తుందని, దానికి తగినట్లుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చో ప్రభుత్వం ఆలోచిస్తుందని, దానికి తగిన నిర్ణయాలు తీసుకుంటుందని, అవసరమైతే కొన్ని రోజుల పాటు రాష్ట్రం మొత్తం షట్ డౌన్ అవుతుందన్నారు.

Tags: Telangana, Curfew, Janatha, 24 hours, Corona, Positive, Community Transmission, Indonesia

Tags:    

Similar News