గెలిస్తే కేసీఆర్..​ ఓడితే వాణీదేవి

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికలపై అధికార పార్టీలో వినూత్న చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ స్థానం నుంచి ఎలాంటి రాజకీయానుభవం లేని వాణీదేవిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ స్థానం బీజేపీకి సిట్టింగ్. కానీ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్​అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. అయితే ఇక్కడి అనుకున్నట్టే టీఆర్ఎస్​ గెలిస్తే అదంతా సీఎం కేసీఆర్​కు క్రెడిట్. ఒకవేళ ఇప్పుడున్న అంచనాలు, వ్యతిరేకపవనాలు కొనసాగి ఓడిపోతే మాత్రం వాణీదేవి కారణంగా చూపిస్తారని […]

Update: 2021-02-28 01:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికలపై అధికార పార్టీలో వినూత్న చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ స్థానం నుంచి ఎలాంటి రాజకీయానుభవం లేని వాణీదేవిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ స్థానం బీజేపీకి సిట్టింగ్. కానీ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్​అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. అయితే ఇక్కడి అనుకున్నట్టే టీఆర్ఎస్​ గెలిస్తే అదంతా సీఎం కేసీఆర్​కు క్రెడిట్. ఒకవేళ ఇప్పుడున్న అంచనాలు, వ్యతిరేకపవనాలు కొనసాగి ఓడిపోతే మాత్రం వాణీదేవి కారణంగా చూపిస్తారని గులాబీ శ్రేణుల్లో చర్చ. అయితే ప్రస్తుతం మండలి ఎన్నికల తర్వాత వాణీదేవికి ఇంకేమైనా పోస్టు ఇస్తారా… వచ్చే ఎమ్మెల్సీ ఖాళీల్లో అవకాశం ఇస్తారా అనేది తర్వాత అంశం.

ఈ హైదరాబాద్​ స్థానంలో అభ్యర్థిత్వం ఖరారుపై సీఎం కేసీఆర్​ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లకు ఇంకో రెండు రోజులు గడువు ఉందనగా పీవీ కూతురును ప్రకటించారు. అంతకు ముందు ఇక్కడ నుంచి అధికార పార్టీ పోటికి దిగుతుందా అనేదే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజకీయపక్షాలు ఒక విధంగా షాక్​కు గురయినట్టే. ఎందుకంటే పీవీ కూతురు కావడంతో విమర్శలపై వెనకడుగు పడింది. కాంగ్రెస్​కు ఆధ్యుడు పీవీ. ఇటు బీజేపీ కూడా పీవీకి గౌరవం ఇవ్వాల్సిందే. ఇప్పటికే పీవీ శత జయంతి ఉత్సవాల పేరుతో టీఆర్ఎస్.. కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చింది. దాన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియని పరిస్థితి హస్తం నేతలది. ఈ నేపథ్యంలో పీవీ కూతురును పోటీకి దింపారు. దీంతో పీవీ కూతురుపై ఎలాంటి విమర్శలకు దిగవద్దంటూ కాంగ్రెస్​ నిర్ణయం తీసుకుంది. తీసుకోవాల్సి అనివార్యమైంది.

బీజేపీ కూడా అంతే..

వాస్తవంగా ఎన్నికల్లో ఏదైనా ముందుగా అభ్యర్థులపైనే విమర్శలు ఎక్కువుంటాయి. అభ్యర్థులెవ్వరైనా… ఒకరినొకరు టార్గెట్​ చేసుకుని, స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకుని, సమస్యల కోసం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను ఎత్తిచూపిస్తూ విమర్శలు చేసుకుంటారు. ఆ తర్వాత పార్టీల వైపు విమర్శలు వెళ్తాయి. కానీ ఇక్కడ వాణీదేవిపై రెండు పార్టీలు వెనక్కి తగ్గినట్లే. అటు స్వతంత్రులు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న మండలి పోరులో వరంగల్​ స్థానంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి ప్రధానంగా ఏ స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాయి. పల్లా సూత్రదారిగానే ఇక్కడ అభ్యర్థులు విమర్శలకు దిగుతున్నారు.

మరోవైపు సామాజిక అంశాలుగా కూడా సీఎం వ్యూహం వేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన రామచంద్రారావు ఇక్కడ సిట్టింగ్​ఎమ్మెల్సీ. వాణీదేవి కూడా. ఇప్పుడు ఈ వర్గంలో ఎటువైపు ఉండాలనేది తేల్చుకోవడంలో వాణీదేవికే మొగ్గు చూపాల్సి వస్తోంది. అటు గతంలోనూ ఇక్కడ గెలుపు చరిత్రే టీఆర్ఎస్​కు లేదు. దీంతో వాణీదేవిని అభ్యర్థిగా దింపి ఈసారి గెలిచి తీరాలని చూస్తోంది.

గెలిస్తే మనకు…ఓడితే వాళ్లకు

ఇక మండలి ఎన్నికలను చాలా లైట్​గా తీసుకునే సీఎం కేసీఆర్​ ఇప్పుడు మాత్రం అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇది రాజకీయ కోణంలో చాలా ప్రచారం జరుగుతోంది. ఈ స్థానంలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో సీఎం కేసీఆర్​భారీ ఎత్తులు వేస్తున్నారని, ఇది విస్తృత ప్రచారంలోకి తీసుకువస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాణీదేవి… అంటే టీఆర్​ఎస్​ గెలువడం కష్టమే. నిరుద్యోగులు, యువత చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేవలం వాణీదేవి కోసం వీరంతా టీఆర్​ఎస్​ వైపు ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే. ఎందుకంటే కేవలం అభ్యర్థిని చూసి ఓట్లేసే ఎన్నిక కాదిది. అందుకే సీఎం కేసీఆర్​చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపించుకుంటున్నారు.

ఒకవేళ సీఎం కేసీఆర్​ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే వాణీదేవి గెలిస్తే… దాన్ని అధికార పార్టీ అతిపెద్ద విజయంగా చూపించుకుంటుందని, మళ్లీ గతంలో సీఎం కేసీఆర్​ ఆనాడు ప్రకటించుకున్నట్టే.. “ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని పెట్టినా గెలుస్తారు… గెలిపించుకుంటాం” అనేదాన్ని నినాదంగా చేసుకుంటారని, ఇది వచ్చే సాగర్​ ఉప ఎన్నిక, మినీ పురపోరుకు టానిక్​లా మారుతుందని గులాబీ దళం చెప్పుకుంటోంది. దుబ్బాక, జీహెచ్​ఎంసీలో తప్పిదారి బీజేపీ గెలిచిందని, అది గాలివాటమేనంటూ ప్రచారం చేసుకుంటారు.

ఇక పరిస్థితులన్నీ వ్యతిరేకంగానే కొనసాగి వాణీదేవి ఓడితే దాన్ని టీఆర్​ఎస్​ తప్పిదం కాదని, ఈ ఓటమిని కూడా ప్రతిపక్షాలు, ఓటర్లపైనే వేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఎందుకంటే పీవీ కుటుంబానికి టీఆర్ఎస్​ మాత్రమే గౌరవం ఇచ్చిందని, రాజకీయంగా ఎంత ఒత్తిడి… చాలా మంది పోటీదారులు ఉన్నా పీవీ కూతురు కాబట్టి టికెట్​ఇచ్చి పోటీకి దింపామని, కానీ కాంగ్రెస్​ పార్టీ కనీస గౌరవం ఇవ్వలేదంటూ ఎదురుదాడికి దిగనున్నారు. అటు బీజేపీపై కూడా అంతేస్థాయిలో విమర్శలు చేయనున్నారు. చివరకు గ్రాడ్యుయేట్​ఓటర్లను కూడా బద్నాం చేయనున్నారు. రాష్ట్రం నుంచి ప్రధానిగా ఎదిగిన పీవీ అంటే గౌరవం లేదని, మేం సగౌరవం ఇస్తే విద్యావంతులు మాత్రం నిర్లక్ష్యం చేశారని, వాణీదేవికి ఓటు వేయకుండా అగౌరవపర్చారంటూ చూపించుకోనున్నారు.

ఇలాంటి సమయంలో హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ పట్టభద్రుల స్థానంలో కేసీఆర్​ ప్రయోగాలు సక్సెస్​ అయి గెలిస్తే కచ్చితంగా ఇది మా విజయమని, సీఎంగా తాను రంగంలోకి దిగి, రాజకీయాలకు కొత్త అయిన వాణీ దేవిని గెలిపించుకున్నామని కాలర్​ ఎగురవేస్తారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం వాణీదేవి కాబట్టి ఓడిపోయిందని, వాణీదేవికి రాజకీయాలు కొత్తకావడంతో పాటుగా పీవీ కూతురుగా గౌరవం ఇవ్వని ప్రతిపక్షాలు అంటూ ఓటమిని వాణీదేవి ఖాతాలో వేయనున్నారు. మండలి ఎలాగైనా టీఆర్​ఎస్​కు ఓటమి మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంది.

Tags:    

Similar News