కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా.. ‘డబుల్’ మాటలు!

దిశ, తెలంగాణ బ్యూరో : ‘డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో జిల్లా అధికారులు ఎంపిక చేస్తారు. నా సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కూడా జోక్యం చేసుకోను. అవినీతికి, అవకతవకలు, పైరవీలకు తావులేకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు జరుగుతది’ -2020 మార్చి7న శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రకటన. ‘ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూంలు కేటాయిస్తాం. […]

Update: 2021-08-04 19:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ‘డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో జిల్లా అధికారులు ఎంపిక చేస్తారు. నా సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కూడా జోక్యం చేసుకోను. అవినీతికి, అవకతవకలు, పైరవీలకు తావులేకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు జరుగుతది’
-2020 మార్చి7న శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రకటన.

‘ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూంలు కేటాయిస్తాం. స్వయంగా ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్లి సంబంధిత పత్రాలు అందజేసి పార్టీ గౌరవాన్ని ఇనుమడింపచేయాలి. మరణించిన కుటుంబ సభ్యుల బాధ్యత టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీస్ పై ఉంది.’
-2021 ఆగస్టు4న తెలంగాణ భవన్‌లో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన పేదలకు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇళ్ల కేటాయింపులో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది. అయితే లబ్ధిదారుల ఎంపికను నిష్పక్షపాతంగా లాటరీ పద్ధతిలో చేపడతామని సీఎం కేసీఆర్ పేర్కొంటుండగా, ప్రమాదాల్లో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు డబుల్ ఇళ్లు కేటాయిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీలిస్తున్నారు. వీరిద్దరు ఒక్కో మాట మాట్లాడటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పేదల ఇళ్లను పరిశీలించి స్థితిగతులు తెలుసుకున్న కేసీఆర్.. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా 2లక్షలకు పైగా ఇళ్లు నిర్మించి అందజేస్తామని ప్రకటించారు. డబుల్ ఇళ్ల కేటాయింపునకు దరఖాస్తులు స్వీకరించి కూడా ఏళ్లు గడుస్తుంది. వాటికి నేటికీ మోక్షం లేదు. అయితే నిర్మించిన ఇళ్లల్లో అవకతవకలు జరుగుతున్నాయని సీఎం దృష్టికి రావడంతో వాటికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ జోక్యం ఉండకుండా పూర్తి అధికారాలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేలా చర్యలు చేపట్టారు. ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపులో జోక్యం చేసుకోనని కేసీఆర్ ప్రకటించారు. పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన 80మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో కేటీఆర్ మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్లులేదని, డబుల్ ఇళ్లు కేటాయించాలని కోరగా అందుకు మంత్రి హామీ ఇచ్చారు. అయితే పార్టీకి చెందిన కార్యకర్తల కుటుంబాలు దరఖాస్తు చేసుకోకున్నా ఎలా కేటాయిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇతరులకో న్యాయం… పార్టీ కార్యకర్తలకో న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఒక ప్రకటన… కేసీఆర్ మరో ప్రకటన చేయడంతో నేతలకే క్లారిటీ లేదు… మాకు న్యాయం ఎలా జరుగుతుందని దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Tags:    

Similar News