కేంద్రంతో ఇక లడాయే!

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ విధానాలను సైతం తూర్పారపట్టారు. కాంగ్రెస్ చేతకానితనం, నిష్క్రియాపరత్వం కారణంగా బీజేపీ బలపడుతోందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలపై మరింతగా బాధ్యత పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానిదంతా ప్రచారాల, నినాదాల ఆర్భాటమే తప్ప ఆచరణ ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీయే చొరవ తీసుకుని ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నాయకులతో హైదరాబాద్ కేంద్రంగా డిసెంబరు రెండవ వారంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మోడీ […]

Update: 2020-11-18 20:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ విధానాలను సైతం తూర్పారపట్టారు. కాంగ్రెస్ చేతకానితనం, నిష్క్రియాపరత్వం కారణంగా బీజేపీ బలపడుతోందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలపై మరింతగా బాధ్యత పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానిదంతా ప్రచారాల, నినాదాల ఆర్భాటమే తప్ప ఆచరణ ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీయే చొరవ తీసుకుని ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నాయకులతో హైదరాబాద్ కేంద్రంగా డిసెంబరు రెండవ వారంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మోడీ తప్పుడు విధానాలతో ఆర్థికరంగంలో దేశం తిరోగమన దిశలో వెళ్తోందని విమర్శించారు. ఇదే ప్రభుత్వం మరికొంతకాలం కొనసాగితే నేపాల్ కంటే వెనకబడడం ఖాయమన్నారు.

వాజ్‌పాయి హయాంలో మొదలైన ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ మోడీ హయాంలో మరింత వేగవంతమవుతోందని పేర్కొన్నారు. ఎల్ఐసీ, భారత్ పెట్రోలియం, బీఎస్ఎన్ఎల్, రైల్వే.. ఇలా ఒక్కటొక్కటిగా ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మినట్లు చెప్పుకునే మోడీ ఇప్పుడు రైల్వే స్టేషన్లనే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్న బీజేపీ ఎన్నికలు వచ్చిన ప్రతీ సందర్భంలో కశ్మీర్, పుల్వామా, టెర్రరిస్టు దాడులలాంటివాటిని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. దేశాన్ని, ప్రజలను మతపరంగా విభజిస్తోందన్నారు. మత కల్లోలాలను రెచ్చగొడుతోందన్నారు.

కార్పొరేట్లకు అండగా

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరు తప్పదని కేసీఆర్​స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నదన్నారు. ఆ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉండి డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే భిన్నమైన ట్రెండ్ నడుస్తోందన్నారు. ఏదీ చేయకుండా అన్నీ చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ, ప్రజల కోసం పనిచేస్తున్నవారిపై నిందలు మోపుతున్నదని ఆరోపించారు. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నదన్నారు. అభూత కల్పనలతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నదన్నారు. దేశ ప్రజలను చైతన్యపరిచి బీజేపీ, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

మోడీ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలు, రైతులు, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, కార్మికుల కోసం ఒక్క పని కూడా చేయలేదన్నారు, ఎన్నికల్లో లబ్ధి కోసం సరిహద్దులో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటోందనీ, చైనాతో కొట్లాడలేక చతికిలపడి ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటోందని అన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో లాంటి అందమైన నినాదాలే తప్ప ఆచరణ ఏమీ లేదన్నారు. వాజ్‌పేయి పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టగా, ఇప్పుడు మోడీ ప్రభుత్వం 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించిందన్నారు. ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కొత్తగా ప్రారంభించకపోగా ఉన్నవాటినే మూసివేస్తోందన్నారు. లక్షలాదిమంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వాలకు నిధులు అందించే సంస్థలను కూడా మూసివేయడం దురదృష్టకరమన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ప్రతి రోజూ 67 వేల కి.మీ. మేర కోట్లాది మందికి సేవలందిస్తూ కరోనా సమయంలోనూ ప్రజలను గమ్యస్థానాలకు చేరిన రైల్వేలను ప్రైవేటుపరంచేసే అవసరం ఏమొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు.

ప్రైవేటీకరణ దిశగా

40 కోట్ల మంది పాలసీదారులు, 30 లక్షల కోట్ల ఆస్తి కలిగిన ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ రైతుబీమా పథకాన్ని గొప్పగా అమలుచేస్తోందని, పది రోజుల్లోనే పరిహారం అందిస్తున్నదని, ఇంతటి ప్రాముఖ్యత ఉన్నా ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్‌టీపీసీ, బీహెచ్ఇఎల్, బీఎస్ఎన్ఎల్, డిఫెన్స్, భారత్ పెట్రోలియం లాంటి ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం దేశంలోని రాజకీయ పక్షాలను కలుపుకుని పోరాటం తప్పదన్నారు. మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి అన్యాయం చేస్తున్నదని అన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చతికిలపడిందన్నారు. గరీబీ హఠావో అనే నినానమే తప్ప పేదరికం పోలేదన్నారు.

కాంగ్రెస్, బీజేపీ బడేభాయ్ వెంట చోటే భాయ్ అన్నట్లుగా తయారయ్యాయని, దేశానికి సరైన దిశ చూపెట్టలేకపోయాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, ఒరిస్సా ముఖ్యమంత్రులతో, డీఎంకే అధినేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని కేసీఆర్ తెలిపారు. కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ రెండో వారం హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సులో దేశవ్యాప్తంగా చేయాల్సిన ఉద్యమం గురించి చర్చిస్తామన్నారు.

Tags:    

Similar News