హుజురాబాద్ బై పోల్స్.. కౌశిక్ రెడ్డికి మొదలైన ఇంటి పోరు 

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వం సరిగా లేకపోవడంతో కేడర్ ఇతర పార్టీల వైపు వెళ్లింది. ఉన్న కొద్ది మంది నాయకుల్లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి నచ్చిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. అసలే ఉత్కంఠకు కేరాఫ్‌గా మారిన హుజురాబాద్ బై పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటుందా అన్నదే ఆ ప్రాంతంలో […]

Update: 2021-07-01 06:20 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వం సరిగా లేకపోవడంతో కేడర్ ఇతర పార్టీల వైపు వెళ్లింది. ఉన్న కొద్ది మంది నాయకుల్లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి నచ్చిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. అసలే ఉత్కంఠకు కేరాఫ్‌గా మారిన హుజురాబాద్ బై పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటుందా అన్నదే ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రధాన చర్చ.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువే అయినప్పటికీ కౌశిక్ రెడ్డి బేషజాలకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని కలిసి గ్రీటింగ్స్ అందించారు. అయితే, ఇక్కడ ఆయనకు ఇంటిపోరు తప్పడం లేదన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్‌లు కౌశిక్ రెడ్డికి సంబంధం లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తనకు కూడా టికెట్ కేటాయించాలని కృష్ణారెడ్డి అధిష్టానాన్ని కోరారు.

కౌశిక్, కృష్ణారెడ్డిల మధ్య నెలకొన్న విబేధాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే వీరందరిని పార్టీ క్రమ శిక్షణ కమిటీ పిలిచి మాట్లాడి పంపించింది. అయినప్పటికీ వీరు మాత్రం అందరితో కలిసి పార్టీ నిర్మాణంలో పాలు పంచుకోవడం లేదు. పది రోజుల క్రితం కౌశిక్ రెడ్డి వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో పర్యటించినప్పుడు కూడా వీరు కలిసి రాకపోవడం గమనార్హం. అయితే, తాజాగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృష్ణారెడ్డి ఈ నెల 5న జమ్మికుంట నుంచి హుజురాబాద్ ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఈ పాదయాత్రలో కౌశిక్ రెడ్డి పాల్గొంటారా లేదా అన్న చర్చ సాగుతోంది. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌లో కౌశిక్ ఫోటో కూడా లేకపోవడం గమనార్హం.

రేవంత్ ముందు సవాళ్లు..

టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన తరువాత రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే మొదటి ఎన్నిక హుజురాబాద్‌దే కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న పరిస్థితులను చక్కదిద్దడంతో పాటు కేడర్‌లో నూతనోత్తేజం నింపాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే బలహీనంగా మారిన పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. హుజురాబాద్ బైపోల్‌ను సవాల్‌గా తీసుకుని ఇక్కడి అభ్యర్థిని గెలిపించుకునేందుకు రేవంత్ భారీ వ్యూహాన్నే రచించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గ్రామగ్రామాన తిరుగుతుండటం, టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంటుందన్న పరిస్థితి తయారైంది. దీంతో, రేవంత్ రెడ్డి కార్యరంగంలోకి దిగి హుజురాబాద్‌లో వర్గపోరుకు చెక్ పెట్టి, గెలుపు గుర్రానికి టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ప్రచారాన్ని తిప్పి కొట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Tags:    

Similar News