ఏపీకి కర్ణాటక ఝలక్.. బకాయిలు చెల్లిస్తేనే పాలు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. పాల బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో అంగన్‌వాడీలకు పాల సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించింది. ఆంధ్రా ఇవ్వాల్సిన రూ.130కోట్ల పాల బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో పాలు సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ డా. సమీర్ శర్మకు లేఖ రాశారు. అంతేకాకుండా పాల ధరను లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు లేఖలో […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. పాల బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో అంగన్‌వాడీలకు పాల సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించింది. ఆంధ్రా ఇవ్వాల్సిన రూ.130కోట్ల పాల బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో పాలు సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ డా. సమీర్ శర్మకు లేఖ రాశారు. అంతేకాకుండా పాల ధరను లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్‌వాడీలకు అందించే పాల కోసం ఏపీ ప్రభుత్వం 2020 జూన్‌లో కర్ణాటక పాల సరఫరాదారుల సమాఖ్యతో అగ్రిమెంట్ చేసుకుంది. చిన్నారులకు పాలు అందిస్తుండటంతో కేఎంఎఫ్ లీటర్ ధరపై రూ.5 తగ్గించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి నెలా 110లక్షల లీటర్ల పాలను జగన్ సర్కార్ కేఎంఎఫ్ నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే గత నాలుగు నెలలుగా ప్రభుత్వం కేఎంఎఫ్‌కు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇప్పటి వరకు రూ.130కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
ఈ బకాయిలపై ప్రభుత్వానికి కేఎంఎఫ్ పదేపదే లేఖలు రాసినప్పటికీ స్పందన రాలేదని కేఎంఎఫ్ ఎండీ బీసీ సతీశ్ స్పష్టం చేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వానికిచ్చే రూ.5 సబ్సీడీని కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంపై కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఎండీ సతీశ్ తెలిపారు. ‘పెట్టుబడి ఖర్చులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో కర్ణాటక పాల యూనియన్లు నష్టాల్లో ఉన్నాయి. ఫలితంగా పాత ధరకే పాలు సరఫరా చేయలేం.
ఏపీ ప్రభుత్వం బకాయిలు పడ్డ కారణంగా పాల ఉత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ రూ.130కోట్ల బకాయిలు చెల్లించాలి. అలాగే పాల ధరను లీటరుకు రూ.5 పెంచితేనే ఇక మీదట పాలు సరఫరా చేయగలం’ అని సతీశ్ తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం దీనికి అంగీకారం తెలపాలని కేఎంఎఫ్ ఎండీ బీసీ సతీష్ తెలిపారు.