కాళేశ్వరానికి కరెంటు భారం.. రెండేళ్లలో రూ. 2,090 కోట్లు ఖర్చు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ వివాదాస్పదమే. ఆ ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాల సాగుభూమి అదనంగా వినియోగంలోకి వచ్చిందనే సంగతి ఎలా ఉన్నా రెండేళ్ళలో కరెంటు ఖర్చు మాత్రం రెండు వేల కోట్ల రూపాయలు దాటింది. ఒక్కో యూనిట్‌కు రూ. 5.80 చొప్పున ఉత్తర డిస్కం వసూలు చేస్తున్నది. ఎత్తిపోసిన నీరు మాత్రం కేవలం 99 టీఎంసీలే. గడచిన రెండేళ్ళలో 3,604 మిలియన్ యూనిట్లను వినియోగించింది. ఆ లెక్కన […]

Update: 2021-06-06 21:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ వివాదాస్పదమే. ఆ ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాల సాగుభూమి అదనంగా వినియోగంలోకి వచ్చిందనే సంగతి ఎలా ఉన్నా రెండేళ్ళలో కరెంటు ఖర్చు మాత్రం రెండు వేల కోట్ల రూపాయలు దాటింది. ఒక్కో యూనిట్‌కు రూ. 5.80 చొప్పున ఉత్తర డిస్కం వసూలు చేస్తున్నది. ఎత్తిపోసిన నీరు మాత్రం కేవలం 99 టీఎంసీలే. గడచిన రెండేళ్ళలో 3,604 మిలియన్ యూనిట్లను వినియోగించింది. ఆ లెక్కన కేవలం కరెంటు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 2,090 కోట్లను వెచ్చించాల్సి వచ్చింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన అన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులనూ ఈ రెండేళ్ళ కాలంలో వినియోగించిన విద్యుత్‌ను లెక్క వేసుకుంటే దాదాపు ఐదు వేల కోట్లకు చేరువగా ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతీ ఏటా విద్యుత్ బిల్లు తడిచి మోపెడవుతుందని సాగునీటి నిపుణులు మొదటి నుంచీ వాదిస్తూనే ఉన్నారు. ఇంకా పూర్తిస్థాయిలో పంపులు వినియోగంలోకి రాకముందే రెండేళ్ళ కాలానికి రూ. 2,090 కోట్లు ఖర్చయింది. గతేడాది 33 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి రూ 984.77 కోట్ల మేర విద్యుత్ కోసమే ఖర్చయితే అంతకుముందు సంవత్సరం (2019-20) మాత్రం 66 టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి రూ. 1,105.82 కోట్లు ఖర్చయింది. గతేడాది 1,697 మిలియన్ యూనిట్లను వాడితే అంతకుముందు ఏడాది 1,906.59 మిలియన్ యూనిట్లను వాడాల్సి వచ్చింది.

సంవత్సరంలో కేవలం నీటి లభ్యత ఉన్న 90 రోజులు మాత్రమే ఎత్తిపోతల ద్వారా నీటిని లిఫ్టు చేసేందుకు పంపులను వాడాలన్నది ఈ ప్రాజెక్టు ప్లాన్. ఏక కాలంలో అన్ని పంపులూ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. విద్యుత్ నిపుణులు, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ గతంలో వేసిన లెక్కల ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి కనీసంగా రూ. 7,903 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 13,172 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు కింద నెలకొల్పిన 19 పంపు స్టేషన్లలోని 82 మోటారు పంపుల వినియోగానికి 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. కనీసంగా 13,558 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటుందని అంచనా. ఒక్కో యూనిట్‌కు రూ. 5.80 చొప్పున మొత్తం సంవత్సరానికి రూ. 7,863.64 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

మొత్తం ఇరవై లిఫ్టులు ఈ ప్రాజెక్టుకు చెందిన లింకు ప్యాకేజీల్లో భాగం. కానీ ఇందులో ఎనిమిది చోట్ల వినియోగించిన మోటారు పంపులకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,906.59 మిలియన్ యూనిట్లు, 2020-21లో 1,697.99 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగమైంది. ఆ ప్రకారం 2019-20లో రూ. 1,105.82 కోట్లు, 2020-21లో రూ. 984.77 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాల సాగుభూమిని స్థిరీకరించడంతో పాటు అదనంగా మరో 18.19 లక్షల ఎకరాలను కొత్తగా ఆయకట్టులోకి తీసుకురాగలుగుతామని సాగునీటి ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రాజెక్టుకు రూ. 80,190 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినప్పటికీ సవరించిన అంచనాల ప్రకారం అది సుమారు లక్ష కోట్లు దాటేసింది. ఇందులో విద్యుత్ అవసరాల కోసం కొత్తగా కట్టే సబ్ స్టేషన్లకే రూ. 2,885 కోట్లు అవుతుందని అంచనా వేసింది. అయితే సబ్ స్టేషన్లు కట్టడం, భారీ సామర్థ్యం కలిగిన మోటారు పంపులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా వినియోగంలోకి తేవడం గడచిన రెండేళ్ళలో జరిగిపోయాయి. ఈ రెండేళ్ళ కాలంలో కేవలం ఆరు ప్యాకేజీల్లోని మోటారు పంపులకే రూ. 2,090 కోట్లమేర ఖర్చయిందంటే ఇంకా మిగిలిన 11 పంపు హౌజ్‌లనూ పనిచేయిస్తే కరెంటు భారం ఎక్కువగానే ఉంటుంది.

రెండేళ్ళలో ఎత్తిపోసిన నీళ్ళు 99 టీఎంసీలే

కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల ద్వారా దశలవారీగా భారీ మోటారు పంపులతో నీటిని ఎత్తి పోయడానికి భారీ స్థాయిలోనే విద్యుత్ ను వినియోగించాల్సి వచ్చింది. 2019-20 సంవత్సరంలో కేవలం 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 1906.59 మిలియన్ యూనిట్లను (రూ. 1105.82 కోట్లు)ను వినియోగించింది. ఆ తర్వాతి సంవత్సరం (2020-21)లో 33 టీఎంసీల నీటిని ఎత్తి పోయడానికి 1697.88 మిలియన్ల యూనిట్లను (రూ. 984.77 కోట్లు) వాడుకున్నది. ఇప్పటివరకు రెండేళ్ళ కాలంలో కేవలం 99 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసినా మోటారు పంపులను రన్ చేయడానికి మాత్రం రూ. 3604.49 కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే ఒక్కో టీఎంసీకి సగటున రూ. 36.40 కోట్ల చొప్పున విద్యుత్ కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది.

మేడిగడ్డ నుంచి అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్ళకు, ఆ తర్వాత ఎల్లంపల్లికి.. ఇలా చివరకు రంగనాయక సాగర్ వరకూ నీటిని ఎత్తిపోయడానికి ఈ మేరకు విద్యుత్ వాడాల్సి వచ్చింది. ఇక అన్ని పంపులూ రన్ చేయాల్సి వస్తే 13,558 మిలియన్ యూనిట్లను వాడాల్సి ఉంటుందని సాగునీటి నిపుణుల అంచనా.

మూడేళ్ళలో కరెంటు కోసం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు వివరాలను పరిశీలిస్తే… విద్యుత్ వినియోగం మిలియన్ యూనిట్లలో, ఖర్చు కోట్ల రూ.లలో

ప్యాకేజీ 2019-20 2020-21
వినియోగం ఖర్చు వినియోగం ఖర్చు
భూపాలపల్లి 199.65 1,15.79 176.77 102.52
జగిత్యాల-1 3.2 1.85 2.31 1.33
జగిత్యాల-2 2.12 1.22 1.97 1.14
కరీంనగర్-1 696.73 404.1 532.58 310.63
కరీంనగర్-2 6.72 3.89 132.2 76.67
పెద్దపల్లి-1 720.51 417.89 489.48 283.89
పెద్దపల్లి-2 158.86 92.13 223.24 129.47
పెద్దపల్లి-3 118.8 68.9 139.23 80.75
ఇతర ప్రాజెక్టులు 1029.9 597.34 587.12 340.52
మొత్తం 2936.5 1703.17 2284.89 1325.23

ఏడేళ్ళలో కాళేశ్వరం సహా అన్ని ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం వినియోగించిన విద్యుత్ 8075.37 మిలియన్ యూనిట్లు కాగా అందుకు అయిన ఖర్చు రూ. 4736.55 కోట్లు. 2014-15లో ఒక్కో యూనిట్‌కు రూ. 5.37, 2015-16లో రూ. 5.70, 2016-18 (రెండేళ్ళు)లో రూ. 6.40, 2018-21 (మూడేళ్ళు)లో రూ. 5.80 చొప్పున ఉత్తర డిస్కం బిల్లు వేసింది.

Tags:    

Similar News